ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh, Weather

Weather Report: రేపటి నుంచి 4 రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 13 అక్టోబర్ 2024

Weather Report: ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం (Weather Report) వెల్లడించింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేసింది. ఐఎండీ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

దీని వల్ల నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.

ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుండి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేశారు.

భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. భారీవర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ విరిగిపడతాయని, వాటి కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్ వద్ద, టవర్స్ కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని హెచ్చరించారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

అప్రమత్తంగా ఉన్నామన్న ప్రభుత్వం
రాష్ట్రానికి త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసినట్లు హోం మంత్రి అనిత తెలిపారు.

పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24×7 అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి సూచించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర,రాయలసీమ జిల్లా ప్రాంతాలలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు,గట్లను గుర్తించి పర్యవేక్షించాలన్నారు.

ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పిడుగులు పడి, వాగులు పొంగే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెలకాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నియంత్రించే చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని కోరారు.

ఇవీ చదవండి: Hot weather care: ఎండ వేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Weather Report Now: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన
AP Weather Report: ఏపీకి వాతావరణ కేంద్రం హెచ్చరిక.. నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలి..
Rains in AP: ద్రోణి ప్రభావంతో రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading