AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులపాటు వర్షాలు విరివిగా పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపటి నుంచి కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. (AP Weather Report)
మరోవైపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో సముద్రం ఏకంగా 20 మీటర్లు వెనక్కు వెళ్లింది. భారీ వర్షాల ధాటికి, అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో ఈ మార్పులు జరుగుతున్నాయని గంగపుత్రులు చెబుతున్నారు.
ఇక ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతోంది. స్పిల్ వే దగ్గర నీటిమట్టం 31.700 మీటర్లకు చేరింది. పోలవరం నుంచి 8,09,916 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గింది. 10.3 అడుగుల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. 175 గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమ లంక గ్రామాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. గోదావరి వరద ప్రభావంతో రాజమండ్రిలో ఒక పూట మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది.
ఇక రాయలసీమలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ప్లో, అవుట్ ప్లో నిల్ అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అయితే, ప్రస్తుతం 813 అడుగులుగా ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 26 నాటికి వాయుగుండంగా బలపడే సూచన ఉందని వాతావరణ విభాగం తెలిపింది. రాగల మూడు నుంచి నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తదెలిపింది. అల్పపీడనం ప్రభావంతో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉంది.
ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏలూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. పోలవరం ముంపు మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయి.
Read Also : Rain Alert for AP TS: రానున్న 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు