బుధవారం, 25 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Vidadala Rajini: ‘ఎలక్షన్స్‌ను సెలక్షన్స్‌గా మార్చేశారు’.. చంద్రబాబుపై విడదల రజిని ఫైర్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 25 నవంబర్ 2026

Vidadala Rajini: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు నుంచి ఉపసంహరణ వరకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. మంగళవారం చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి చంద్రబాబును ‘రెడ్‌బుక్ ఎలక్షన్స్ రిగ్గింగ్ మ్యాన్’గా అభివర్ణించారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కనిపించిన తీరే పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగుతోందని, ‘ఎలక్షన్స్‌ను సెలక్షన్స్‌గా మార్చేశారు’ అని మండిపడ్డారు.

అర్ధరాత్రి వరకు ఉపసంహరణ కేంద్రాలు ఎందుకు?

రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ), అధికారులు, పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మరో కూటమిలా పనిచేస్తున్నారని రజిని విమర్శించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఇన్‌చార్జులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి కుటుంబాలపైనా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి వరకు నామినేషన్ల ఉపసంహరణ కేంద్రాలను తెరిచి ఉంచారని, అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారని అన్నారు. అభ్యర్థులతో సంబంధం లేని ఉపసంహరణ పత్రాలను కూడా ఆమోదించారన్న ఆరోపణపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘హైకోర్టు రక్షణ కల్పించినా నిర్బంధాలా?’

తమ నియోజకవర్గంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు హైకోర్టును ఆశ్రయించి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి వచ్చిందని రజిని చెప్పారు. ఆ ఉత్తర్వులు ఉన్న అభ్యర్థులనూ పోలీసులు స్టేషన్లకు తరలించి అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. ‘భార్య నామినేషన్ వేయడానికి వెళ్తే భర్తను ఎందుకు నిర్బంధిస్తారు?’ అని నిలదీశారు. ఎఫ్‌ఐఆర్ చూపించాలని అడిగినా పోలీసులు సమాధానం ఇవ్వలేదని, స్టేషన్లలోనే టీడీపీ నేతలను పిలిపించి రాజీకి ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు.

తిమ్మాపురం ఘటనపై పోలీసులకు రజిని ప్రశ్నలు

తిమ్మాపురం ఘటనలో హత్యాయత్నానికి కుట్ర జరిగిందని పోలీసులు వెల్లడించినట్లు రజిని పేర్కొన్నారు. కత్తులు, రాడ్ల ప్రస్తావనతో సుమారు 68 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఆ తర్వాత 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారని ఆమె అన్నారు. హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు నమోదు చేసిన ఈ ఘటనలో ఏం జరిగిందో పోలీసులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎడ్లపాడు మండలంలో నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీకి చెందిన 40 మందికిపైగా కేసులు పెట్టారని ఆరోపిస్తూ, రెండు ఘటనల్లో పోలీసులు అనుసరించిన తీరులో తేడా ఎందుకని ప్రశ్నించారు.

‘సమయం వచ్చినప్పుడు ప్రజలే సమాధానం చెబుతారు’

ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల విశ్వాసం కోల్పోయిన కూటమి ప్రభుత్వం అధికార బలంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని రజిని విమర్శించారు. ఒత్తిళ్ల మధ్య పోటీలో నిలిచిన అభ్యర్థులను, వారికి అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలను అభినందించారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.

ఇవీ చదవండి: Vidadala Rajini : బోయపాలెంలో ఉద్రిక్తత.. ఆలయం వద్ద మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నం
Rajini : బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై విడదల రజిని ఆగ్రహం
Medical news: సత్యకుమార్‌కు ఆధారాలతో విడదల రజిని కౌంటర్

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.