ఆదివారం, 22 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Drishyam 3 OTT Release: దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. నవంబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 22 నవంబర్ 2026

Drishyam 3 OTT Release: అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. హిందీ ‘దృశ్యం’ ఫ్రాంఛైజీలో మూడో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 27, 2026 శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎనిమిది వారాల తర్వాత డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్‌ సాల్గావ్కర్‌ కథకు ముగింపు పలికే ఈ సినిమాకు అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వం వహించారు.

ఓటీటీలో తెలుగు వెర్షన్‌ ఉంటుందా?

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ‘కమింగ్‌ సూన్‌’ జాబితాలో ప్రస్తుతం హిందీ వెర్షన్‌కు నవంబర్‌ 27 విడుదల తేదీ ఉంది. తెలుగు డబ్బింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇంకా తేదీ రావాల్సి ఉంది. ఇదే పేరుతో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ నటించిన మలయాళ ‘దృశ్యం 3’ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ డబ్బింగ్‌లతో అందుబాటులో ఉంది. ఆ చిత్రంలో కథ జార్జ్‌కుట్టి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అజయ్‌ దేవగణ్‌ చిత్రంలో విజయ్‌ సాల్గావ్కర్‌ కుటుంబం ఎదుర్కొనే పరిణామాలతో కథ సాగుతుంది. OTTweek

కూతురి పెళ్లి వేళ మళ్లీ తెరపైకి పాత కేసు

‘దృశ్యం 2’ ఘటనలు జరిగిన ఆరు నెలల తర్వాత మూడో భాగం కథ మొదలవుతుంది. విజయ్‌ తన పెద్ద కూతురు అంజు పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటాడు. మరోవైపు, తన కుమారుడు సామ్‌కు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న మీరా దేశ్‌ముఖ్‌ ప్రయత్నం కొనసాగుతుంది. ఎస్పీ రాజ్‌వీర్‌ సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని బృందం పాత కేసును తిరిగి తెరవడంతో విజయ్‌ కుటుంబం మరోసారి విచారణను ఎదుర్కొంటుంది. విజయ్‌గా అజయ్‌ దేవగణ్‌, మీరాగా టబు, నందినిగా శ్రియా సరన్‌, అంజుగా ఇషితా దత్తా నటించారు. ఎస్పీ పాత్రలో జైదీప్‌ అహ్లావత్‌ కనిపించగా, రజత్‌ కపూర్‌, ప్రకాశ్‌ రాజ్‌, మృణాల్‌ జాదవ్‌ కీలక పాత్రలు పోషించారు.

తొలి రోజే రూ.62 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్లకు పైగా

‘దృశ్యం: ది కన్‌క్లూజన్‌’ తొలి రోజే భారత్‌లో రూ.62 కోట్ల నెట్‌ వసూళ్లతో బలమైన ఆరంభాన్ని అందుకుంది. తొలి వారంలో దేశీయ నెట్‌ కలెక్షన్లు రూ.245.50 కోట్లకు చేరాయి. బాక్సాఫీస్‌ ట్రాకర్‌ సాక్‌నిల్క్‌ 51 రోజుల లెక్కల ప్రకారం, ఈ చిత్రం భారత్‌లో రూ.381.01 కోట్ల నెట్‌, రూ.456.13 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. విదేశాల్లో వచ్చిన రూ.133.20 కోట్లను కలిపితే ప్రపంచవ్యాప్త గ్రాస్‌ రూ.589.33 కోట్లు. థియేటర్లలో విజయవంతమైన ఈ థ్రిల్లర్‌ను ఈ శుక్రవారం నుంచి ఇంట్లోనే చూడొచ్చు.

ఇవీ చదవండి: OTT Movie: దృశ్యం కంటే తక్కువేమీ కాదు.. 8.2 IMDb రేటింగ్‌తో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్.. రెండు గంటలు కూడా ఉండదు!
Crazy Kalyanam OTT Release: క్రేజీ కల్యాణం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనుపమ సినిమా ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చంటే?

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.