AP Land Mutation: భూమి మ్యుటేషన్ ఆమోదమైంది. కానీ మారిన వివరాలతో అడంగల్ ప్రతి చేతికి రాలేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పంపిణీ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. మ్యుటేషన్ పూర్తయిన తర్వాత సవరించిన అడంగల్ ప్రతిని భూయజమాని దరఖాస్తులో ఇచ్చిన ప్రస్తుత చిరునామాకు తపాలాశాఖ ద్వారా పంపనుంది. ఈ నెల నవంబర్ 26 నుంచి 30 వరకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఇకపై ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించేలా భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి. జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
31 వేల దరఖాస్తులు.. పత్రం ఎప్పుడు వస్తుంది?
అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా భూ లావాదేవీలు, రికార్డుల సవరణలకు సంబంధించి సుమారు 31 వేల మ్యుటేషన్ దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ దరఖాస్తుల్లో మ్యుటేషన్ పూర్తయిన వాటికి సంబంధించిన సవరించిన అడంగల్ ప్రతులను నవంబర్ విడతలో పంపిణీ చేయనున్నారు. తహసీల్దార్లు పత్రాలను సకాలంలో పంపేందుకు చర్యలు తీసుకోవాలని, పంపిణీ రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు మండలాలకు వెళ్లి ప్రక్రియను పర్యవేక్షించాలని సీసీఎల్‌ఏ సూచించారు.
దరఖాస్తులో రెండు చిరునామాలు.. పోస్టు దేనికి వస్తుంది?
మ్యుటేషన్‌కు తహసీల్దార్ ఆమోదం ఇచ్చిన తర్వాత కూడా సవరించిన అడంగల్ అందలేదని ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో స్పందించిన వారిలో 40 నుంచి 50 శాతం మంది తెలిపారు. దరఖాస్తుల్లో చిరునామా తప్పుగా ఉండటం కూడా పత్రాలు చేరకపోవడానికి కారణమని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అందుకే లావాదేవీ, సవరణ మ్యుటేషన్ దరఖాస్తుల్లో శాశ్వత చిరునామా, ప్రస్తుత ఉత్తర ప్రత్యుత్తరాల చిరునామా రెండూ నమోదు చేసేలా మార్పులు చేశారు. అడంగల్ ప్రతి ప్రస్తుత చిరునామాకే వస్తుంది. భూమి ఒక గ్రామంలో ఉండి, యజమాని మరో ఊరిలో నివసిస్తే ప్రస్తుతం పోస్టు అందుకునే ఇంటి నంబరు, ప్రాంతం, పిన్‌కోడ్ సరిచూసుకోవాలి.
అడంగల్ చేతికొచ్చాక ఏ వివరాలు చూడాలి?
మ్యుటేషన్ అంటే భూ లావాదేవీ లేదా ఆమోదించిన సవరణకు అనుగుణంగా రెవెన్యూ రికార్డును నవీకరించడం. అడంగల్‌లో భూయజమాని పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, భూమి విస్తీర్ణం వంటి వివరాలు ఉంటాయి. పోస్టులో ప్రతి అందిన తర్వాత మీరు కోరిన మార్పు నమోదైందో లేదో ముందుగా చూడండి. ఉదాహరణకు, విస్తీర్ణం సవరణకు దరఖాస్తు చేసి ఉంటే కొత్త ప్రతిలో సర్వే నంబరుతో పాటు సవరించిన విస్తీర్ణాన్ని పరిశీలించండి. ఆన్‌లైన్‌లో భూ రికార్డును ‘మీభూమి’ పోర్టల్‌లో చూడవచ్చు. gramawardsachivalayam.ap.gov.in
ఆమోదం వచ్చినా పోస్టు రాకపోతే?
మీ సేవ ద్వారా దరఖాస్తు చేసి ఉంటే రసీదులోని అప్లికేషన్ లేదా ట్రాన్సాక్షన్ నంబరుతో ‘Check Your Application Status’లో స్థితి తెలుసుకోవచ్చు. మ్యుటేషన్ ఆమోదం పొందినా నిర్ణీత పంపిణీ తేదీలు ముగిసేలోగా ప్రతి అందకపోతే, దరఖాస్తు రసీదుతో సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించండి. పత్రం తపాలాకు పంపించారా, దరఖాస్తులో ఏ చిరునామా నమోదైందో తెలుసుకోండి. Online Login Form ::
అధికారిక లింకులు
మీభూమి భూ రికార్డులు · మీ సేవ దరఖాస్తు స్థితి
ఇవీ చదవండి: Webland Land Records System: రైతులకు గుడ్ న్యూస్.. వెబ్‌ల్యాండ్ రికార్డులకు లాకింగ్ సిస్టమ్.. భూమి కబ్జాలకు చెక్!
Davos : దావోస్ వేదికపై జగన్ మార్క్! క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం కృషి చేశారని అభినందించిన గీతా గోపినాథ్






