TDP Leaders in BRS: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇందులో రేవంత్‌రెడ్డి ఒకరు. ఆయనకు ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పుడున్నది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కాదు… చంద్రబాబు కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి అని, చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే ఆయన శిష్యుడు 24 గంటల కరెంటు దండగ.. 3 గంటలు చాలంటూ వ్యాఖ్యానిస్తున్నారని మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చింది. (TDP Leaders in BRS)
అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో (BRS Party) కూడా టీడీపీ నుంచి వచ్చిన నేతలు చాలామందే ఉన్నారంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోలతో సహా పోస్టు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మొదలుకొని.. చాలా మంది ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్నారని పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు (Chandrababu) పక్కన ఉన్న నేతల ఫొటోలు ప్రదర్శిస్తున్నారు.
వీరిలో సీఎం కేసీఆర్ సహా ప్రస్తుతం మంత్రలుగా ఉన్న మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి సహా కీలక నేతలు ఉన్నారని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం 88 మంది అయితే వీరిలో టీడీపీ నుంచి వచ్చిన వారి సంఖ్య 42 అని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు 18 మంది అయితే, ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారి సంఖ్య 11 అని చెబుతున్నారు.
నీ తండ్రి కేసీఆర్‌తో పాటు మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వారే కదా… అంటూ కేటీఆర్‌కు “ఆపన్న హస్తం” పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్టు వెలిసింది. మొదటి ఎన్నికలే టీడీపీ పొత్తుతో పోటీ చేశారంటూ ట్విట్టర్‌లో కాంగ్రెస్ ప్రశ్నలు గుప్పించింది. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ తరహా పోస్టులు రావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
తొలిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలను దారుణంగా దెబ్బ కొట్టారు. ముఖ్య నేతలు, ప్రముఖులందరినీ పార్టీలోకి లాగేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దాని ఫలితమే తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండాపోయిందని, ఈ తరుణంలో బీజేపీ పుంజుకొనేందుకు ఆస్కారం ఏర్పడిందని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ప్లాన్ ప్రకారం దొరకబట్టిన కేసీఆర్.. తర్వాత టీడీపీని భూస్థాపితం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ భయంతోనే చంద్రబాబు ఏకంగా పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను వదిలేసి అమరావతి పొలాల్లోకి షిప్ట్ అయిపోయారని చెబుతున్నారు.
నీ అయ్యతో సహా మీ పార్టీలో మొత్తం టీడీపీ నుండి వచ్చినవారే కదా డ్రామా రావు..
నీ మొదటి ఎన్నికలే టీడీపీ పోత్తుల పోటీ చేసినవ్ కదా కేటీఆర్..#BabuRaoSamithi pic.twitter.com/fbFy9tgDmv— Aapanna Hastham (@AapannaHastham) July 17, 2023