దేశ రాజధాని ఢిల్లీలోన వసంత విహార్‌లో కొత్తగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి పార్టీ భవన్‌ను (BRS Bhavan) ఆ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. భవనం (BRS Bhavan) ప్రారంభానికి ముందు అక్కడ సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం కార్యాలయ శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. మధ్యాహ్నం 1.05 గంటలకు రిబ్బన్ కట్ చేసి భవనంలోకి (BRS Bhavan) కేసీఆర్ ప్రవేశించారు. కార్యాలయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి.. పార్టీ నేతలను ఉత్సాహంగా పలకరించారు.
భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు ముఖ్యమంత్రి వెళ్లి తన కుర్చీలో ఆసీనులయ్యారు. పార్టీ ముఖ్య నేతలంతా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ముఖ్య నేతలతో కొత్త కార్యాలయంలో తొలి సమావేశం నిర్వహించి పలు అంశాలపై కేసీఆర్ చర్చలు జరిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం కోలాహలంగా సాగింది.
రాజధానిలోని వసంత విహార్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి 2021 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో ఆఫీసును కట్టారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్లు ఉంటాయి. మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 రూములు ఏర్పాటు చేశారు.
పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు..
ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులందరికీ మంత్రి కేటీఆర్ విషెస్ చెప్పారు. పార్టీ నేతలకు ప్రత్యేక సందేశం పంపారు. నాడు జలదృశ్యం.. నేడు ఢిల్లీలో అద్వితీయ దృశ్యం ఆవిష్కృతమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కేవలం బీఆర్ఎస్ శ్రేణులకే కాదు.. తెలంగాణ ప్రజానీకానికి గర్వకారణమని చెప్పారు.
ఉద్యమ నాయకుడే.. ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతోందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం.. ప్రస్తుతం చారిత్రక అవసరమన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని నిజం చేసేదాకా అలుపెరుగని పోరాటం చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
గోల్‌మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదని దేశ వ్యాప్తంగా ప్రజలు గ్రహిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. గోల్డెన్ తెలంగాణ మోడల్ పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. జాతీయ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ బలమైన ముద్ర వేయడం కచ్చితంగా జరుగుతుందని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్న ప్రతి ఒక్క గులాబీ సైనికుడి బాధ్యత ప్రస్తుతం మరింత పెరిగిందన్నారు.ఇదే స్పూర్తితో వచ్చే ఎన్నికల కోసం కష్టపడాలని సూచించారు.
Read Also : Harish Rao On Governor Tamilisai: సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?