తెలంగాణ గవర్నర్ తమిళిసైపై రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao On Governor Tamilisai) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అట్టహాసంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని పిలవాలని రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు. నేడు మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి.. తమిళిసై లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు (Harish Rao On Governor Tamilisai) చేశారు.
గవర్నర్ ఒక డాక్టర్ అయి ఉండి ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం ఏం పద్ధతని హరీష్‌రావు (Harish Rao On Governor Tamilisai) ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్‌గా, ఓ మహిళగా తమిళిసైకి గౌరవం ఇస్తామని, కానీ ఆమె తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు హరీష్ రావు.
పార్లమెంటు భవనం శంకుస్థాపనకు రాష్ట్రపతిని మోదీ పిలిచారా? వందే భారత్ ట్రైన్లు ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తామేమైనా ప్రశ్నించామా? అని హరీష్ రావు ప్రశ్నలు వేశారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య వినతిపత్రం ఇచ్చారని భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారని మండిపడ్డారు. వైద్యశాఖలోప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు బిల్లును గవర్నర్ ఆపడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు.
ఆ బిల్లులో అభ్యంతరకరమైన అంశాలు ఏమున్నాయని నిలదీశారు. చాలా రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏళ్లకు పదవీ విరమణ పెంచారని హరీష్ రావు గుర్తు చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం పదవీ విరమణ వయసును పెంచుకోవచ్చనే విషయాన్ని గుర్తించాలన్నారు. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్‌కు ఎందుకంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌రావు.
సుప్రీంకోర్టులో కేసులేవైనా ఉంటే గవర్నర్ అలాంటి బిల్లులు ఆపవచ్చని హరీష్ రావు చెప్పారు. బిల్లుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అని అడిగారు. పదవీ విరమణ వయసు బిల్లును ఏడు నెలలు ఆపడం ఎంత వరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో 70 ఏళ్లు ఉన్నపుడు ఇక్కడ 65కు కూడా గవర్నర్ ఎందుకు ఒప్పుకోరని నిలదీశారు.
వైద్యురాలు అయి ఉండి కూడా ప్రజలకు సౌకర్యాలు ఆపడం న్యాయమా అని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తేగానీ గవర్నర్ రియాక్ట్ కాలేదన్నారు. చివరకు తిరస్కరించి రాష్ట్రపతికి పంపారని, ముఖ్యమైన బిల్లులు ఆపడం ద్వారా గవర్నర్ ప్రజలకు విద్య వైద్యం దూరం చేస్తున్నారని నేరుగా బాణాలు ఎక్కుపెట్టారు హరీష్‌రావు. తన ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.
నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరింపా..?
గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్.. ఇపుడు అలాంటి బిల్లునే ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, అవి బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా అన్నారు. సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీ మంజూరైందని, దానికి ప్రొఫెసర్ల కొరత ఉందని చెప్పారు.
గవర్నర్ ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనని పేర్కొన్నారు. జీ 20 సమావేశాల్లో గవర్నర్ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసేలా మాట్లాడారని హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ ఎన్నిసార్లు రాజీనామా చేసి గెలిచారో గమనించుకోవాలన్నారు. తాము ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నామని, ఓపికను అలుసుగా చేసుకోవద్దని హరీష్‌రావు హెచ్చరించారు. గవర్నర్ బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారంటూ హరీష్‌రావు చెప్పారు. గవర్నర్‌కు రాజకీయాలు ఇష్టముంటే వెళ్లి బీజేపీలో చేరాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో పోటీ కూడా చేయాలని సలహా ఇచ్చారు.
Read Also : Telangana: కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం