Manipur DGP: మణిపూర్ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు ఇచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గం.కు కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ లో ఎఫ్‌ఐఆర్ ల దాఖలు తీరు సరిగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మణిపూర్ హింసపై విచారణ జరుపుతున్న అత్యున్నత ధర్మాసనం.. రాష్ట్ర పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలకొద్దీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్‌లు జరగలేదని పేర్కొంది. విచారణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని పేర్కొంది. (Manipur DGP)
అసలు ఎఫ్‌ఐఆర్‌లు ఇలాగేనా? నమోదు చేసేదని మణిపూర్ పోలీస్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ మణిపూర్ డీజీపీకి సమన్లు ఇష్యూ చేసింది. మణిపూర్‌లో శాంతి భద్రతల అనే మాటే లేదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర యంత్రాగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తింది. హింస చెలరేగి మూడు మాసాలైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదంది. అరెస్టులు జరగలేదంది. విచారణలో అడుగడుగునా నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తోందని తీవ్రంగా మండిపడింది.
విచారణ సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక కామెంట్స్ చేశారు. మే నుంచి జూలై చివరి వరకు రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైందన్నారు. ఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాధారణ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన తేదీ, సెక్షన్ 164 సీఆర్‌పీసీ కింద స్టేట్‌మెంట్‌లు నమోదు చేసిన తేదీ, అరెస్టుల తేదీ.. మొత్తం అన్నింటితో స్టేట్‌మెంట్ రూపొందించాలని సూచించారు. రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితుల్లో మనం లేమన్నారు. కాబట్టి.. ఒక యంత్రాంగం అవసరమని అభిప్రాయపడ్డారు. 6,500 ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తును సీబీఐకి అప్పగించడం అసాధ్యమన్న విషయంపై తమకు స్పష్టత ఉందన్నారు.
ప్రభుత్వ పనితీరును గమనించి పరిశీలించడం, పరిహారం, పునరుద్దరణ పనులు, దర్యాప్తు స్వతంత్ర్యంగా జరిగేలా జాగ్రత్త వహించడం, స్టేట్‌మెంట్లు రికార్డు చేయడం, ఇలా అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌కు అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.