Manipur Violence: మానవత్వమా నీ వెక్కడ? మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండగులు.. మణిపూర్‌ హింసలో ఆలస్యంగా వెలుగులోకి!

Manipur Violence: స్వతంత్ర భారత దేశంలో 75 ఏళ్లు గడిచినా మానవత్వం మంటగలిసిపోయేలా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. అతివలకు నేటికీ ఘోరమైన అవమానాలు తప్పడం లేదు. భరతమాత సిగ్గుతో తలదించుకొనే ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మణిపూర్‌లో జరుగుతున్న హింసలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను కొందరు దుండగులు జాత్యహంకారంతో నగ్నంగా ఊరేగింపు చేశారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఇవాళ ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. (Manipur Violence)

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. జాతుల మధ్య ఘర్షణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ హక్కుల కోసం పోరుబాట పట్టిన ఇద్దరు మహిళలను కొందరు మగవాళ్లు నగ్నంగా ఊరేగించారు. ఈ దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. అయితే, మే 4న ఈ అమానవీయ ఘటన జరగ్గా.. బుధవారం వెలుగు చూసింది. ఈ పరిణామంతో రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇండిజీనియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం (ఐటీఎల్‌ఎఫ్‌) తాజాగా నిరసన ర్యాలీ నిర్వహించాలని తలపెట్టింది.

సరిగ్గా సమయంలో నగ్న ఊరేగింపు వీడియో వైరల్‌ అయ్యింది. ఈ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు మరింత శృతిమించాయి. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సామాజికవేత్తలు, విశ్లేషకులు, నిపుణులంతా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. టీవీ చర్చల్లో ఈ దురాగతాన్ని ప్రశ్నిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ వీడియోలో కనిపించిన మహిళల చుట్టూ కొందరు పురుషులు నడుచుకుంటూ వచ్చారు. వీరంతా కలిసి సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ గిరిజన సంస్థ ఆరోపణ చేసింది. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లాలో మే 4వ తేదీన ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ముందు రోజే రాష్ట్రంలో ఇరు తెగల నడుమ ఘర్షణలు జరిగాయి. గుర్తుతెలియని దుండగులపై కిడ్నాప్‌, సామూహిక అత్యాచారం, హత్యానేరం కింద నాంగ్‌పాక్‌ సెక్‌మై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Image

ఎవరినీ వదిలిపెట్టబోమన్న ప్రధాని నరేంద్ర మోదీ..

మణిపూర్‌లో హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ముందుగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసిన ఘటనపై ఆయన తీవ్రంగా రియాక్ట్‌ అయ్యారు. ఈ సంఘటన దేశానికే సిగ్గుచేటని అభివర్ణించారు. ఇందుకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

ఇద్దరు మహిళలపై అమానవీయమైన ప్రవర్తన తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా ఈ ఘటన చేసిందన్నారు. ఆడ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని ఎన్నటికీ క్షమించలేమన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదన్నారు. నిందితులను విడిచిపెట్టబోమని ప్రజలకు భరోసా ఇస్తున్నానన్నారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కోరారు. నిందితులను శిక్షించేందుకు చట్టం పూర్తి శక్తితో పనిచేస్తుందని మోదీ తెలిపారు.

నగ్నంగా మహిళల ఊరేగింపు ఘటనకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌ సహా పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. వీడియోలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున వీడియోలను తొలగించాలని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Read Also : Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్‌కు రెండేళ్ల జైలు శిక్ష.. అల్లు అరవింద్‌ ఇచ్చిన పరువు నష్టం దావా కేసులో..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles