Maharashtra: మహారాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేన వర్గాన్నిచీల్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఏక్‌నాథ్ శిండేకు (Eknath Shinde) ప్రస్తుతం పదవీ గండం పొంచి ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thakre) వర్గంలో ఉన్న శిండే.. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి చీలిపోయి బీజేపీ (BJP) వద్దకు చేరి ఆ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. శిండే వర్గానికి చెందిన సుమారు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. (Maharashtra)
రీసెంట్‌గా ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్.. (Ajit Pawar) మహారాష్ట్ర సర్కార్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్ పవార్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. శిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి అజిత్‌ను సీఎం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆదివారం జరిగిన నాటకీయ పరిణామాల వెనుక బీజేపీ అసలు వ్యూహం ఇదేనంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరాఠా నేత అయిన శిండేను శివసేన (Shiv sena) నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీ అధిష్టానం.. ఇప్పుడు అంతకన్నా బలమైన నేతకు పగ్గాలు అప్పగించి రాబోయే ఎన్నికల్లో జాక్ పాట్ కొట్టాలని యోచిస్తోందని చర్చ జరుగుతోంది.
మరోవైపు 16 మంది శిండే వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగస్టు 11 లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిండేను తప్పించి అజిత్‌కు పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాలపై శివసేన (ఉద్ధవ్)కు చెందిన పత్రిక సామ్నా ప్రచురించిన సంపాదకీయం ఈ మేరకు చర్చనీయాంశమైంది.
త్వరలోనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే స్థానాన్ని అజిత్ పవార్ భర్తీ చేస్తారని సామ్నా అభిప్రాయపడింది. ఏడాది కిందట శివసేనను చీల్చి బయటకు వచ్చిన వారిలో 16 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని జోస్యం చెప్పింది ఆ పత్రిక.
ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ మహారాష్ట్రలోనే కాదు.. దేశంలోని రాజకీయాలనే బురదమయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సామ్నా. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే స్థానాన్ని అజిత్ పవార్ భర్తీ చేస్తారని పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పవార్ ఈ కూటమితో కలవలేదని, శిండే ఆయన మద్దతుదారులపై త్వరలో అనర్హత వేటు పడే చాన్స్ ఉందని జోస్యం చెప్పింది.
పవార్‌కు పట్టాభిషేకం చేస్తారని తెలిపింది. రాష్ట్రంలో ఇదివరకు ఇలాంటి సంప్రదాయం లేదని సామ్నా మండిపడింది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో రికార్డు సృష్టించారని తెలిపింది. గతంలోని కాంగ్రెస్, బ్రిటిష్ హయాంలే నయమని, వారు ధైర్యంగా వీధుల్లోకి వచ్చి పోరాడేవారని నొక్కివక్కాణించింది. ఇలా దొంగ దెబ్బ తీసేవారు కాదంటూ విమర్శలు గుప్పించింది.
మరోవైపు అజిత్ పవార్‌కు సీఎం పదవి కట్టబెట్టడంపై వస్తున్న ఊహాగానాలను బీజేపీ తోసిపుచ్చింది. అనర్హత వేటు విషయంలో అసలు తమకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడే అవకాశం లేదని, ఒకవేళ వచ్చినా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ సీనియర్ నేత మాధవ్ భండారి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో 45 వరకు బీజేపీ గెలవాలని కోరుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, అది ప్రస్తుత ముఖ్యమంత్రి శిండే వల్ల ఎంత మాత్రం సాధ్యం కాదనే భావనకు బీజేపీ పెద్దలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మరో బలమైన మరాఠా నేత అజిత్ పవార్‌ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపగలమని ఆశిస్తోందని చెబుతున్నారు.
Read Also : Central Cabinet Changes: కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. బండి సంజయ్‌కి స్థానం?