Women Health Tips: మహిళలు చాలా మంది గృహిణులుగా, ఉద్యోగులుగా జీవితం గడుపుతుంటారు. ఇంటి పని, కుటుంబ సంరక్షణ, ఆఫీస్ పనిలో తలమునకలవుతారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇందుకోసం ఐదు సూత్రాలు పాటించాలి. (Women Health Tips)
ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అందరికీ వర్తిస్తుంది. కానీ మహిళలకు కొన్ని ప్రత్యేక ఆరోగ్య సూత్రాలు అవసరం. వాటిని పాటిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చు. మరి మహిళలకు ఎందుకు ప్రత్యేక జాగ్రత్తలు అంటే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ ఉన్నాయి.
మహిళలకు చాలా వరకు సమయం అనుకూలించడం లేదనే కారణంతో వ్యాయామంపై శ్రద్ధ పెట్టరు. కొందరు ఆహారంపై శ్రద్ధ పెట్టినా వ్యాయామం గురించి జాగ్రత్తలు తీసుకోరు. మరికొందరు వ్యాయామం చేసినా ఆహారం గురించి పట్టించుకోరు. కానీ ఆహారం, వ్యాయామం రెండూ సమన్వయంతో ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. యోగా ద్వారా బరువు తగ్గడంతో పాటు శారీరక దృఢత్వం సాధించవచ్చు.
మహిళలు సమతుల ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి విటమిన్స్,మినరల్స్ అందుతాయి. క్యాల్షియం ఎముకల పటిష్టతకు చాలా కీలకంగా పనిచేస్తుంది. బ్రకోలీ, బీట్‌రూట్, క్రాన్‌బెర్రీ, బ్లూబెర్రీస్ మహిళల ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఒకవేళ మాంసాహారులైతే చేప, గుడ్డు కూడా తీసుకోవచ్చు.
మహిళలు ఆహారంలో అతిగా చెక్కర తీసుకోవద్దు. జంక్ ఫుడ్ తినొద్దు. ఇవి శరీరంలో రకరకాల సమస్యలకు దారి తీస్తాయి. అండాశయంపైనా ప్రభావం చూపుతాయి. మహిళ ఆరోగ్యానికి సంబంధించి అండాశయ సంరక్షణ చాలా కీలకం. శరీరానికి హాని చేసే ఆహారాలు విషతుల్యమైనవిగా భావించవచ్చు. అందుకే అనారోగ్యకరమైన ఆహారాన్ని తినవద్దు. మహిళలు ఆహారం, వ్యాయామంతో పాటు తరచుగా స్త్రీల ప్రత్యేక వైద్యుల్ని సంప్రదిస్తే మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆహ్లాదంగా జీవించవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటించండి
మంచి ఆరోగ్యం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాల కలబోత. అందుకే సంపూర్ణ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యోగ, ధ్యానం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకోవచ్చు. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండటం కూడా ఒక సూత్రమే. ఎప్పుడైనా ఏవైనా లక్షణాలు కనిపించినా హెచ్చరికలుగా భావించాలి. క్రమం తప్పిన పీరియడ్స్, తీవ్రమైన రక్తస్రావం, ఛాతిలో కణతులు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. తరచుగా గైనకాలజిస్టుల్ని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి పరీక్షలు చేయించుకోవాలి. కానీ చాలా మంది ఉపేక్షిస్తారు.
ఇదీ చదవండి: Deepam: మహిళలు పుట్టింటి నుంచి దీపం తెచ్చుకుంటే ఏమవుతుంది? ఫలితాలు ఎలా ఉంటాయి?