Morning Breakfast: సాధారణంగా పరగడుపున ఏం తింటారు? అనేది ఆసక్తికర ప్రశ్న. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉంటారు కాబట్టి.. పొద్దున్నే తీసుకునే ఆహారం చాలా కీలకం. పొద్దున్నే పరగడుపున తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ కొందరు హెవీగా, కొందరు లైట్ గా తీసుకుంటారు. ఎలా తీసుకున్నా.. ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు అనేది చాలా చాలా ముఖ్యం. ఇటీవల నేహా సహాయ అనే పోషకాహార నిపుణురాలు, వెల్ నెస్ కన్సల్టెంట్… ఇంస్టాగ్రామ్ లో నెటిజెన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. చాలా మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పరగడుపున తీసుకోకూడని నాలుగు రకాల ఆహారాల గురించి చర్చ జరిగింది. (Morning Breakfast)
పరగడుపున టీ, కాఫీ తాగడం వల్ల పొట్టలో యాసిడ్స్ పెరుగుతాయి. ఫలితంగా ఆహారం జీర్ణం కావడంపై ప్రభావం పడుతుందని నేహా సహాయ తెలిపారు. ఈ అభిప్రాయంతో ముగ్ధా ప్రధాన్ ఏకీభవించారు. ఉదయం నిద్ర లేవగానే ఒత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో టీ, కాఫీల్లో ఉండే కెఫిన్.. కార్టిసోల్ ను మరింతగా పెంచుతుందని వివరించారు. తద్వారా ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. నిద్ర లేచిన తర్వాత గంట, రెండు గంటల వరకు టీ, కాఫీ తాగొద్దని తెలిపారు. ఒకవేళ వాటిని తీసుకుంటే… ఏదైనా ఫుడ్ తో పాటు తీసుకోవాలని సూచించారు.
లెమన్ వాటర్ లో తేనె కలుపుకొని తాగితే…?
చాలామంది ఉదయం లెమన్ వాటర్ లో తేనె కలుపుకొని తాగుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందని… బరువు తగ్గుతారని నమ్ముతారు. కానీ నేహా సహాయ ఈ అభిప్రాయం కరెక్ట్ కాదని తెలిపారు. ఎందుకంటే… తేనెలో ఎక్కువ కేలరీలు ఉంటాయని చెప్పారు. సాధారణంగా స్వచ్ఛమైన తేనె దొరకడం కష్టం. కాబట్టి వివిధ రకాల తీపి పదార్థాలు కలిపిన కల్తీ తేనె మాత్రమే మార్కెట్లో దొరుకుతోంది. అది తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నేహా సహాయ చెప్పారు.
ఈ అంశంపై ఇంస్టాగ్రామ్ లో జరిగిన చర్చలో మరో న్యూట్రిషనిస్ట్ ముగ్ధా ప్రధాన్… నేహా సహాయ అభిప్రాయంతో విభేదించారు. స్వచ్ఛమైన తేనె వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయని అన్నారు. కార్బోహైడ్రేట్స్ కలిగి ఉండడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందని తెలిపారు. తేనె వల్ల జీవక్రియలు మెరుగుపడతాయని అనేక అధ్యయనాలు వెల్లడించినట్టు వివరించారు. తేనె ఆరోగ్యానికి చాలా మంచిది అయినా… అది స్వచ్ఛమైనదా కాదా అనేది గుర్తించడం ముఖ్యం.
ఇతర ఆహారాలతో పోలిస్తే పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. తిరిగి ఒక గంటలోనే ఆకలి కలుగుతుంది. సిట్రస్ కలిగిన పండ్లు పరగడుపున తింటే ఎసిడిటీకి కారణం అవుతాయని నేహా సహాయ తెలిపారు.
మంచి బ్రేక్ ఫాస్ట్ అంటే ఏంటి?
బ్రేక్ ఫాస్ట్ లో ఫ్యాట్, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలన్న నేహా అభిప్రాయాన్ని ప్రధాన్ కూడా సమర్థించారు. ఇలాంటి ఆహారం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా స్థిరంగా ఉంటాయని అన్నారు. డయాబెటిక్ సమస్య లేని వాళ్ళు ఉదయం కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారం, పండ్లు, తేనె తీసుకుంటే ఎలాంటి నష్టం లేదని వివరించారు. ఒత్తిడి సమస్యతో బాధపడేవాళ్లు ఉదయం కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఉపశమనం కూడా కలుగుతుందని తెలిపారు. కానీ అది కూడా మితంగా తీసుకుంటేనే మంచిదని… లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపి…. దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
ఉదయం పరగడుపున ప్రోటీన్, ఫ్యాట్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని నేహా సహాయ సూచించారు. అలా చేయడం వల్ల రోజంతా అతిగా ఆకలి భావన కూడా తగ్గుతుంది. లంచ్ కోసం తీవ్రంగా ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రోటీన్ ఫుడ్ తో పాటు… నట్స్, అవకాడో, నెయ్యి, గింజలు వంటి ఆహారం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మంచిదని నేహా తెలిపారు. ఇలా చేయడంవల్ల రోజంతా ఎక్కువ ఆకలి కలగదు.
Read Also : Best health tips: ఏ జబ్బు తగ్గాలన్నా రాత్రిపూట ఇవి తిని ప్రయత్నించండి.. మార్పు గ్యారెంటీ..