Atha Kodalu: పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఐదారు మంది అన్నదమ్ములు, కోడళ్లు, అత్తమామలు, పిల్లా జల్లా.. అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. పరస్పరం సహకరించుకుంటూ అన్యోన్య జీవితం గడిపేవారు. చిన్న చిన్న మనస్పర్దలు, చికాకులు వచ్చినా ఒకరిని మరొకరు ఓదారుస్తూ సర్దిచెప్పుకుంటూ ఆనందమయ జీవితాన్ని గడిపేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. కుమారుడు ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే అక్కడికే భార్యా పిల్లలు వెళ్లి ఎప్పుడో ఆరు నెలలకో, ఏడాదికో ఊరికి వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. (Atha Kodalu)
అడపా దడపా కుటుంబాలు కుమారులు, కోడళ్లతో కలిసి జీవిస్తుంటారు. ఈ క్రమంలో అనాదిగా వస్తున్న గొడవ.. అత్తా కోడళ్ల మధ్య సఖ్యత లేకపోవడం. భర్తతో సఖ్యత లేకపోవడం కొందరి సమస్య అయితే, అత్తతో పొసగకపోవడం ఇంకొందరికి బాధిస్తుంటుంది. ఈ క్రమంలో కోడళ్లు అటు అత్తపోరు భరించలేక.. ఇటు భర్తకు చెప్పినా అర్థం చేసుకోక మధ్యలో నలిగిపోతూ నరకకూపంలా మారిన సంసార జీవితాన్ని గడుపుతుంటారు. (Atha Kodalu)
అత్తపోరు పడలేకపోతున్న కోడళ్లు, ఆడ పడుచులతో విభేదాలు, అత్తమామలతో ఇబ్బందులు, మరుదులతో మాట పట్టింపులు.. ఇలాంటి సమస్యలు చాలా ఇళ్లలో ఎదుర్కొనేవే. ఇవన్నీ ఆడవాళ్లకు ఎక్కువ బాధని కలుగజేసేవే. ఎక్కడా సుఖం లేదు, పెళ్లి చేసుకొని ఎన్నేళ్లయినా బాధలు తప్పడం లేదని చాలా మంది మహిళలు వాపోతుంటారు. ఇలాంటి వారందరికీ కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.
తోటి ఆడవాళ్లకు గాజులు దానం చేయాలి..
అత్తారింట్లో బాధలు ఎదుర్కొంటున్న మహిళలు తోటి ఆడవాళ్లకు గాజులు దానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నెలకోసారి గానీ, వీలు చూసుకొని ఫంక్షన్లు, పండుగలు, వేడుకల సమయాల్లో ఈ పని చేయాలని చెబుతున్నారు. సనాతన ధర్మంలో మనం గాజులు వేయించుకుంటే ఇంకో నలుగురు ఆడవాళ్లకు గాజులు వేయించాలని చెబుతారు. పండుగలు, పబ్బాలకు ఇంట్లో ఆడవాళ్లందరూ ఒక చోట చేరి అందరూ గాజులు వేసుకొని సంతోష పడటం ఆనవాయితీ. పాత రోజుల్లో ఎంత మంది కలిసి ఉన్నా విభేదాలు రాలేదంటే అందుకు కారణం గాజులేనని నిపుణులు నొక్కివక్కాణిస్తున్నారు.
కుటుంబ పరంగా తీరని బాధలు తీరాలి, అలాంటి సమస్యలు పోవాలంటే వీలైనంతగా తోటి ఆడవాళ్లకు మట్టి గాజులు వేయిస్తూ ఉండాలని చెబుతున్నారు. పూర్వ కాలంలో వ్రతాలు, నోములకు ఎనలేని ప్రాధాన్యం ఉండేది. ఇందులో భాగమే “గాజుల గౌరీ వ్రతం”. ఆ వ్రతాన్ని ఇందుకోసమే చేశారని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కష్టం, బాధ తొలగిపోయి, ఆనందకర జీవితం ఆడవాళ్లకు సొంతం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. తోటి ఆడవాళ్లకు సరిపోయే గాజులను వాళ్లను షాప్‌కు తీసుకెళ్లి అయినా సరే తీసుకోవాలి. గాజుల వల్ల ఇంతటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు. గాజులు ఇవ్వడం ద్వారా 10 మందికి ఆనందం పంచుతారని, అలాంటి ఆనందమే మనకూ వస్తుందని పెద్దలుచెబుతున్నారు.
మీకే ఎందుకు సమస్యగా అనిపిస్తోంది?
అత్తతో పడలేకపోతున్న కోడళ్లు… ఆమె కుమారుడికి ఎందుకు సమస్యగా అనిపించడం లేదనేది ఆలోచించాలి. మా అమ్మ చాలా మంచిదని మీ భర్త అంటున్నాడంటే.. మీకు మాత్రమే ఆమె గయ్యాలిలా కనిపిస్తోందా..? ఎందుకు ఇలా జరుగుతోంది? అనేది ఆలోచన చేయాలి. అత్తను నా అనే భావనతో మీరు చూడకపోవడమే కారణం అని పెద్దలు చెబుతున్నారు. ఇది నా కుటుంబం.. ఎక్కడా తేడా రాకూడదు.. నా కుటుంబానికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే ఆలోచన చేసి, మానసిక పరిణతి చెందితే సమస్య అసలు ఎదురు కాదని చెబుతున్నారు. అలాంటి పరిణతి రానంత వరకు శక్తి హీనురాలిగానే కోడళ్లు ఉంటారని పెద్దలు సూచిస్తున్నారు.
వారి ప్రవర్తన ఎలా ఉన్నా తమ పని తాము చేసుకుంటూ వెళ్లి, తక్కిన విషయాలను, గొడవకు దారి తీసే ఆలోచనలను మానుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోకుండా మీ పనుల గురించిమాత్రమే ఆలోచించినప్పుడు సమస్య ఏదైనా సరే.. చిన్నదిగా మారిపోతుందంటున్నారు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలని, ఎవరు ఏ మాటలు అన్నా మనసు వరకు తీసుకోకుండా ఉండాలని పెద్దలు సూచిస్తున్నారు.
అత్తా కోడళ్లపై కొన్ని సామెతలు ఇవీ…
-
అత్తా ఒకింటి కోడలే..
అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు
అత్త ఎప్పటికీ అమ్మ కాదు.. కోడలు ఎప్పటికీ కూతురు కాదు..
అత్తమీది కోపం దుత్త మీద చూపినట్లు..
అత్త కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిందట..
అత్తింటి కాపురం.. కత్తి మీద సాముతో సమానం..
ఆకలవుతోంది అత్త గారూ.. అంటే రోకలి మింగవే కోడలా అందట
కోడలు ఏడ్చిన కొంప, ఎద్దు ఏడ్చిన ఎవుసం (వ్యవసాయం) ఎప్పటికీ బాగుపడదు
అత్త సచ్చిందని అత్తచీర కట్టుకుంటే దయ్యమై పట్టిందట..
అన్నం పెట్టు అత్తా అంటే సున్నం పెడతానందట..
అత్త చచ్చిన ఆర్నెళ్లకు కోడలు ఎదురు గుంజ పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిందట.
రోకలి ఎత్తవే అత్తా అంటే.. అమాస రానీయ్యవే కోడలా అందట..
అత్తను కొట్టి అటకెక్కిందట.. మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందట..
అత్త రంకుకు పోతూ కోడలుకు బుద్ధి చెప్పిందట..
అత్త మంచి లేదు.. వేప తీపి లేదు..
అత్త ముండ కన్నా ఉత్త ముండ మేలు..
అత్త చేసిన ఆరాటం ఎవరికీ తెలియదు.. కోడలు చేసిన గొడ్డుతనం అందరికీ తెలుసు..
అత్తింటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజి మేలు
అత్తా అత్తా.. కొడుకును కంటానంటే.. నేనొద్దంటానా అన్నదట..
కొర్ర గింజంత కోడల్ని చూస్తే కొండంత అత్తకు చలిజ్వరమొచ్చిందట..
అత్త ఆడమంది.. కోడలు కుంటమంది..
అత్త బుద్ధి కోడలు బుద్ధి ఒకటవుతాయా?