Kamal Haasan: తమిళ సినీ దిగ్గజం, మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ మరోసారి తన రాజకీయ ఆలోచనలను స్పష్టంగా వెల్లడించారు. నేటి యువత సోషల్ మీడియా రీల్స్ ప్రపంచానికే పరిమితం కాకుండా దేశ రాజకీయాలు, సమాజం, సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. అలాగే ముఖ్యమంత్రి పదవిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. “అర్హత వచ్చినప్పుడు ప్రజలే ఆ బాధ్యత ఇస్తారు” అని చెప్పారు.
విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కమల్ హాసన్.. రాజకీయాలు, అవినీతి, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘రీల్స్ మాత్రమే జీవితం కాదు’.. యువతకు కమల్ హాసన్ సందేశం
ప్రస్తుతం యువత ఎక్కువ సమయం సోషల్ మీడియా వేదికలపై గడుపుతున్నారని పేర్కొన్న కమల్ హాసన్.. రీల్స్, షార్ట్ వీడియోలు వినోదానికి మాత్రమే పరిమితం కావాలని, జీవితాన్ని అవే నిర్ణయించకూడదని అన్నారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతకు రాజకీయాలపై సరైన అవగాహన అవసరమని, మంచి నాయకుడిని గుర్తించే సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విషయాలపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
‘రాజకీయాలే నా వృత్తి’.. పెరియార్ ప్రభావం గురించి
తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడిన కమల్ హాసన్.. తనకు రాజకీయాలు నేర్పినవారు కూడా తందై పెరియార్ ఆలోచనలనే అనుసరించారని చెప్పారు. అదే మార్గంలో తాను కూడా నడుస్తున్నానని, అందుకే రాజకీయాలను తన వృత్తిగా స్వీకరించానని పేర్కొన్నారు. ప్రజల కోసం పని చేయడమే తన లక్ష్యమని, రాజకీయాల్లోకి వచ్చి కేవలం నాటకాలు ఆడాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
అవినీతిపై ఘాటు వ్యాఖ్యలు
సమాజంలో అవినీతి గురించి మాట్లాడటం మాత్రమే సరిపోదని కమల్ హాసన్ అన్నారు. లంచాలు తీసుకునే వారి కంటే, లంచాలు ఇచ్చే వారి బాధ్యత కూడా అంతే ఉంటుందని వ్యాఖ్యానించారు.”లంచం ఇచ్చే ప్రతి ఒక్కరూ.. లంచం తీసుకునే చేయిని మరింత బలపరుస్తున్నారు” అంటూ అవినీతిని అరికట్టాలంటే ప్రజల ఆలోచనలో కూడా మార్పు రావాలని సూచించారు.
‘సీఎం పదవి ప్రజలే ఇస్తారు’
తాను సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు నేరుగా స్టార్ హీరోగా లేదా దర్శకుడిగా రాలేదని కమల్ హాసన్ గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాల కష్టపడి, తన ప్రతిభతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అదే విధంగా రాజకీయాల్లో కూడా నేరుగా ముఖ్యమంత్రి పదవి కోరడం సరైంది కాదన్నారు. ప్రజల విశ్వాసం, అనుభవం, అర్హతలు సంపాదించినప్పుడు ప్రజలే ఆ బాధ్యత అప్పగిస్తారని వ్యాఖ్యానించారు.
AIపై కూడా స్పందించిన కమల్ హాసన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి మాట్లాడుతూ.. ప్రతి సాంకేతికతలో మంచి, చెడు రెండూ ఉంటాయని కమల్ హాసన్ అన్నారు. ప్రస్తుతం చాలామంది AIని నేర్చుకుని ఉపాధి అవకాశాలుగా మలుచుకుంటున్నారని చెప్పారు. అయితే AIను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సాంకేతికతను సమాజానికి ఉపయోగపడే దిశగా మలచాలని యువతకు సూచించారు.
యువతకు కమల్ హాసన్ పిలుపు
తన ప్రసంగం ముగింపులో యువతకు ప్రత్యేక సందేశం ఇచ్చిన కమల్ హాసన్.. వినోదంతో పాటు సమాజం, రాజకీయాలు, ప్రజాస్వామ్యం, సాంకేతికత వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని కోరారు. మంచి నాయకుడిని ఎంచుకునే బాధ్యత యువతదేనని, భవిష్యత్ భారత నిర్మాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని చెప్పారు.
ఇవీ చదవండి: Kamal Haasan: ట్రంప్‌కు కమల్ హాసన్ బహిరంగ లేఖ.. వ్యాఖ్యలపై ఘాటుగా స్పందన
Akhil Akkineni: ‘ఏజెంట్’ తర్వాత అఖిల్‌కు ఏమైంది? 48 కుట్లు, రెండు సర్జరీలు.. మూడేళ్ల గ్యాప్ వెనుక అసలు కథ
Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా.. కమర్షియల్ ఫ్లైట్లలో ప్రయాణిస్తూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం!






