Florida Plane Crash: ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. క్షిపణిలా నేలవైపు దూసుకొచ్చి భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పామ్‌బీచ్ కౌంటీలో నవంబర్ 1న మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గ్రీన్ఏకర్స్ ప్రాంతంలో రద్దీగా ఉండే మిలిటరీ ట్రయల్ రహదారి సమీపంలో విమానం కూలిపోయింది. కార్లలో ప్రయాణిస్తున్నవారి కెమెరాల్లో ఈ భయానక దృశ్యాలు రికార్డయ్యాయి. జనావాసాల మధ్య విమానం కూలినప్పటికీ నేలపై ఉన్నవారికి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది.
35 వేల అడుగుల ఎత్తులో మొదలైన సమస్య
ప్రమాదానికి గురైన లియర్‌జెట్ 60 (Learjet 60) విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బహామాస్‌లోని నార్త్ ఎల్యూథెరా విమానాశ్రయానికి బయలుదేరింది. N722BD రిజిస్ట్రేషన్ కలిగిన ఈ విమానాన్ని 2004లో తయారు చేశారు. ఫ్లోరిడా గగనతలంలో 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో రెక్కలపై మంచు పేరుకుపోవడం, గాలుల తీవ్రతతో విమానం కుదుపులకు గురవుతున్నట్లు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలిపారు. మెరుగైన వాతావరణ పరిస్థితుల కోసం మరో రెండు వేల అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు అనుమతి కోరారు. అనుమతి లభించిన కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
‘మాకు సమయం లేదు’.. పైలట్ చివరి మాటలు
విమానం అకస్మాత్తుగా అత్యంత వేగంతో కిందకు దిగడం ప్రారంభించింది. తొలుత నిమిషానికి 10 వేల అడుగులు, ఆ తర్వాత 20 వేల అడుగుల వేగంతో కిందకు పడిపోతున్నట్లు పైలట్ కంట్రోల్ రూమ్‌కు తెలిపారు. ‘మేడే.. మేడే.. విమానం వేగాన్ని నియంత్రించలేకపోతున్నాం. నేలను ఢీకొట్టబోతున్నాం’ అంటూ హెచ్చరించారు. చివరిగా ‘మాకు సమయం లేదు’ అన్న మాటలు వినిపించాయి. తొలి అత్యవసర హెచ్చరిక నుంచి చివరి సందేశం వరకు దాదాపు 35 సెకన్ల వ్యవధి మాత్రమే ఉంది. ఫ్లైట్రాడార్24 సమాచారం ప్రకారం విమానం కిందకు దిగుతున్న వేగం ఒక దశలో నిమిషానికి 32 వేల అడుగులను దాటింది.
600 మంది తరలింపు.. రహదారి మూసివేత
విమానం నేలను ఢీకొట్టిన ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడింది. శకలాలు చెల్లాచెదురుగా పడగా అగ్నికీలలు, దట్టమైన పొగ ఎగసిపడ్డాయి. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ విమానం క్షిపణిలా దూసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. సమీపంలోని నివాస ప్రాంతాల నుంచి దాదాపు 600 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వారి కోసం రెండు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలానికి సమీపంలోని మిలిటరీ ట్రయల్ రహదారిని మూసివేశారు.
విమానం ఎందుకు కూలింది?.. దర్యాప్తులో కీలక అంశాలు
విమాన ప్రమాదానికి మంచు పేరుకుపోవడం, తీవ్ర గాలులు కారణమై ఉండవచ్చని విమానయాన నిపుణులు భావిస్తున్నారు. అయితే అసలు కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. విమాన ప్రయాణ సమాచారం, వాతావరణ పరిస్థితులు, పైలట్ల స్పందన, సాంకేతిక అంశాలను పరిశీలించనున్నాయి. మృతుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ప్రైవేట్ జెట్ ఇలా విషాదాంతం కావడం అమెరికాలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
ఇవీ చదవండి: IndiGo Flight Ticket Prices: విమాన ప్రయాణికులకు షాక్.. ఇండిగో టికెట్ ధరలు మళ్లీ పెరగనున్నాయా?
American Airlines: ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు.. ఫీనిక్స్ గగనతలంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం






