YSR Yantra Seva: ఏపీలో రైతన్నల కోసం వైయస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్ రైతు భరోసా, విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలను జగన్ సర్కార్ అందిస్తోంది.
రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తోంది. కనీస మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని (YSR Yantra Seva) ప్రత్యేకంగా అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, 5 రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరల ప్రకటన, రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసింది.
వైఎస్సార్ యంత్ర సేవలో (YSR Yantra Seva) భాగంగా ఇప్పటికే మొదటి మెగా మేళాలో రూ.240.67 కోట్ల సబ్సిడీతో రూ.690.87 కోట్ల విలువైన 6,525 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తున్న 3,800 ట్రాక్టర్లు, 391 కంబైన్ హార్వెస్టర్లు, 22,580 ఇతర వ్యవసాయ పనిముట్లు అందించిన ప్రభుత్వం.. మరోసారి యంత్ర సేవ కార్యక్రమంలో పనిముట్లు అందజేసేందుకు సిద్ధమైంది.
రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళాలో భాగంగా.. జూన్ 2వ తేదీన రూ.361.29 కోట్ల వ్యయంతో 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను గుంటూరులో పంపిణీ చేయనున్నారు సీఎం జగన్. రూ.125.48 కోట్ల సబ్సిడీని రైతు సంఘాల ఖాతాల్లో నేరుగా సీఎం జగన్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అన్నదాతల సాగు అవసరాలను తీర్చి, యాంత్రీకరణ ద్వారా సాగు వ్యయం తగ్గించి, నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. రైతన్నలు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు, 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణంతో వారికి యాంత్రీకరణ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీకే ప్రాంతంలో ఉన్న మిగిలిన రైతులకు తక్కువ ధరకే యంత్రసేవ అందుబాటులోకి తీసుకురావాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతి ఆర్బీకే పరిధిలోకి విస్తరిస్తూ…‘వైఎస్సార్ యంత్రసేవ’ అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
జూన్ 2న పంపిణీ చేస్తున్న రూ.361.29 కోట్ల వ్యవసాయ పనిముట్లతో కలిపి ఇప్పటి వరకు 10,444 ఆర్బీకే స్థాయి, 491 క్లస్టర్ స్ధాయి యంత్రసేవా కేంద్రాలకు విస్తరిస్తూ రూ.1052.16 కోట్ల విలువైన 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్ హార్వెస్టర్లు, 36,153 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసింది. రూ.366.15 కోట్లను సబ్సిడీగా అందించి రైతు పక్షపాతిగా జగన్ నిలిచారు.
మొత్తం ఒక్కొక్కటీ రూ.15 లక్షల విలువగల 10,444 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలు, ఒక్కొక్కటీ రూ.25 లక్షల విలువగల 491 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం. ఇక ప్రతి ఆర్బీకేలో ‘‘యంత్ర సేవా పథకం’’ అమలు చేస్తున్నారు. రైతు గ్రూపులకు పెట్టుబడి భారం లేకుండా కేవలం 10 శాతం పెట్టుబడితో, 40 శాతం రాయితీతో సాగు యంత్రాలు, పనిముట్ల సరఫరా చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఆప్కాబ్, డీసీసీబీ ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో 50 శాతం రుణం కూడా అందిస్తున్న జగన్ సర్కార్.. రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తోంది.
ట్రాక్టర్లు, పనిముట్లు, ఇతర వ్యవసాయ పరికరాలు తమకు నచ్చిన దగ్గర కొనుక్కునే స్వేచ్ఛ ఆ గ్రూపులకే ఇస్తూ.. ఒక సంవత్సరం పాటు హార్వెస్టర్‌కు ఉచిత సర్వీసింగ్.. ఆపరేటర్‌కు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మళ్లీ మరోసారి ఈ అక్టోబరు నెలలో రైతులకు వ్యక్తిగతంగా 7 లక్షలకు పైగా వ్యవసాయ పనిముట్లు, స్ప్రేయర్లు, టార్పాలిన్లు అందించనున్న ప్రభుత్వం. ఏడాది పొడవునా కురుస్తున్న వర్షాలు, సమృద్దిగా పంటలు పండుతుండటంతో ఒక్క కరవు మండలం ప్రకటించే పరిస్థతి కూడా రాలేదు.
వైఎస్సార్ వ్యవసాయ యంత్ర సేవా పథకం ముఖ్య ఉద్దేశాలివే..
* గ్రామాల్లో రైతు గ్రూపుల ద్వారానే యంత్ర సేవా కేంద్రాల నిర్వహణ..
* పంటల సరళి, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయం.
* అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి సరసమైన అద్దె, సంప్రదించవలసిన వారి వివరాలు రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శన..
* సులభతరంగా యంత్రాలను బాడుగకు బుక్ చేసుకోవడానికి వీలుగా వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను విడుదల చేసిన జగన్ ప్రభుత్వం.. దీని ద్వారా రైతులు వారికి కావాల్సిన వ్యవసాయ పరికరాలను 15 రోజుల ముందుగానే బుక్ చేసుకొనే సౌలభ్యం..
* ఆధునిక సాంకేతికతతో కిసాన్ డ్రోన్ సేవలు..
* ప్రతి ఆర్బీకే పరిధిలో డ్రోన్లు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్ ప్రభుత్వం.
* స్ప్రేయర్లు, టార్పాలిన్లు 50 శాతం రాయితీపై సన్నకారు రైతులకు అందించేందుకు చర్యలు.
Read Also : YSR Kalyanamasthu Shadi tofa: వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పూర్తి వివరాలివే..