Vijayasai Reddy on Babu: నెల్లూరు జిల్లాలో సమస్యల పరిష్కారం పై మరింత దృష్టి పెట్టామని వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రజల నుంచే నేరుగా సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ స్వరం మారిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పై టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విజయసాయి ఫైర్ అయ్యారు. స్కిన్ అలర్జీ పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. (Vijayasai Reddy on Babu)
దోమలు, మంచినీళ్లు, ఏసీలు అంటూ టీడీపీ నేతలు ఏదో ఒక డ్రామా చేస్తున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అమిత్ షా లోకేష్ ను పిలిచినట్టు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ అడ్వొకేట్‌ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పురంధేశ్వరిది ఎల్లో లోటస్ అని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్ష సాధింపు అంటూ పురంధేశ్వరి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు.
పురంధేశ్వరి భర్తే చంద్రబాబును అవినీతిపరుడన్నారనే విషయం గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పారు. బాబు అవినీతిలో పురంధేశ్వరి వాటా ఎంతో చెప్పాలని విజయసాయి డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్కిల్ స్కామ్ వెలికితీశాయనే విషయం మరువరాదన్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది
మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి సంబంధం లేని ఆస్పత్రిలో బాబుకు చికిత్స అందించాలని కోరారు. పోలీసుల సమక్షంలోనే చంద్రబాబుపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో చంద్రబాబుకు భద్రత లేదంటూ చెప్పుకొచ్చారు. జగన్ పాలనపై తమకు నమ్మకం లేదన్నారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే సీఎం బాధ్యత తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు జైల్లో తగిన వసతులు కల్పించాలన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారన్నారు. చంద్రబాబు ఏ నేరం చేయకుండా జైల్లో ఉన్నారంటూ వాపోయారు. చంద్రబాబు తప్పు చేశారంటే ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ ఢిల్లీలో టీడీపీ ఎంపీలు అన్నారు.
Read Also : Posani Krishna Murali: బాబుపై పోసాని సంచలన ఆరోపణలు జైల్లో ఉండి కుట్రపన్నారని వ్యాఖ్య