Tirumala Samacharam (17-07-2023): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వ దర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 86,170 మంది భక్తులు దర్శించుకున్నారు. మరోవైపు శ్రీవారికి 31,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు చేకూరింది. (Tirumala Samacharam (17-07-2023):
నేడు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
తిరుమలలో నేడు (సోమవారం, జూలై 17) శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇక సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా.. బంగారం వాకిలిలో అర్చకులు ఆస్థానం నిర్వహించనున్నారు. అటు పిమ్మట స్వామివారికి రూపాయి హారతి సమర్పిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు పుష్ప పల్లకిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సాలకట్ల ఆణివార ఆస్థానంలో భాగంగా ఉదయం బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో ఉభయదేవేరుల సమేతంగా మలయప్పస్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. గతంలో ఆణివార ఆస్థానం రోజు నుంచి శ్రీవారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేది. అయితే టీటీడీ ఏర్పడ్డాక ఏప్రిల్ నుంచి ఆదాయ వ్యయాలు అనుసరిస్తూ వస్తున్నారు.
Read Also: Subramanian swamy: టీటీడీపై చంద్రబాబు, పవన్‌వి తప్పుడు ఆరోపణలు..: సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం
జియ్యంగార్ల వస్త్ర సమర్పణ
తిరుమల పెద్ద జీయర్ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా వస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరణ చేస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరణ గావిస్తారు. ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామిని ఆశీర్వదించడం ఆనవాయితీ.
భక్తులకు గుడ్ న్యూస్
శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4 వేలు చొప్పున అదనంగా విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు.
Read Also: Gold Price today 17 July 2023: పసిడికి గెల్డెన్ డేస్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవీ..