CM Jagan Humanity: కొండంత దుఃఖం కమ్మేసినప్పుడు మనిషి కోరుకునేది ఓదార్పు. జీవితంలో అనుకోని కష్టం ఆపదలా వచ్చి మీదపడిపోతే.. మనసు నిండా బాధ అలముకుంటుంది. ఇలాంటి సమయంలో తన వారి స్పర్శ, మాట, ఆత్మీయత, ఓదార్పు ఉంటే ఆ మనిషి కాస్త ఊరడిల్లుతాడు. అలాంటి ఆత్మీయ స్పర్శనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈరోజు ఓ బాధితుడికి ఇచ్చారు. కన్న కొడుకు తనకంటే ముందు చనిపోతే ఆ తండ్రి బాధ వర్ణింపనలవి కానిది. అలాంటి కష్టమే ఈ వృద్ధుడికి వచ్చింది. (CM Jagan Humanity)
ఏపీలోని విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద నిన్న ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనతో దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ ఉలిక్కిపడింది. రైల్వే శాఖలో చిన్నపాటి తప్పిదాలు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు తదితర కారణాల కారణంగా ఇటీవలి కాలంలో దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు చనిపోవడం ఒక బాధాకరమైన విషయం అయితే, లోకో పైలెట్ చిరంజీవి చనిపోవడం అతని కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కేంద్ర ప్రభుత్వ కొలువులో స్థిరపడిన తనయుడు ఘోర ప్రమాదం బారిన పడి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తండ్రి హృదయం తల్లడిల్లింది.
చనిపోయిన లోకోపైలెట్ చిరంజీవి తండ్రి సన్యాసిరావు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి పరిస్థితిని చూసిన ప్రజలు శోకతప్త హృదయాలతో ఓదార్చారు.
రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.. సహాయ కార్యక్రమాలపై ఉన్నతాధికారులకు హుటాహుటిన ఆదేశాలు ఇచ్చారు. తగిన వైద్య సదుపాయం అందించి బాధితులను ఆదుకోవాలని సూచించారు. అంతటితో ఆగిపోలేదు. ఈరోజు మధ్యాహ్నం బాధితులను పరామర్శించేందుకు స్వయంగా వెళ్లారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పేరుపేరునా పలకరించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆస్పత్రి నుంచి బయటకు రాగానే అక్కడ చిరంజీవి తండ్రి సన్యాసిరావు సీఎం జగన్‌కు కనిపించారు. ముఖ్యమంత్రిని చూడగానే సన్యాసిరావు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో సీఎం జగన్ చలించిపోయారు. సన్యాసిరావును ఓదార్చారు. ఊరడిల్లాలంటూ ధైర్యం చెప్పారు. స్వయంగా వృద్ధుడి కన్నీటిని తన చేతులతో తుడిచారు సీఎం జగన్. మృతుడు చిరంజీవిది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుశాలపురం గ్రామం. విజయనగరం సర్వజన ఆసుపత్రి వద్ద కొడుకు మృతి పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్న తండ్రి సన్యాసిరావు కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్ఉతన్నారు.