Telangana TDP: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ఇప్పటికే అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. తన తరఫున ఢిల్లీ నుంచి కాస్ట్‌లీ లాయర్లను తీసుకొచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బెయిల్ సాధించుకోలేకపోతున్నారు. కేసుల నుంచి ఉపశమనం పొందే దారి తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను ఈజీగా మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు.. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ రివర్స్ సీన్ ఎదురవుతోంది. తాజాగా ఆ పార్టీకి ఊహించని పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు కీలక స్టెప్ తీసుకున్నారు. (Telangana TDP)
తెలంగాణలో దుకాణం బంద్
రాష్ట్ర విభజన అనంతరం జాతీయ పార్టీగా ప్రకటించుకుంది టీడీపీ. 2014లో అడపాదడపా సీట్లు సాధించింది. అనంతరం 2019లో చేతులెత్తేసింది. మరో నెల రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేయకూడదని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ టీడీపీ క్యాడర్ కు చంద్రబాబు సంకేతాలు పంపారు. తెలంగాణలో పోటీ చేయొద్దంటూ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ కు బాబు సూచించినట్లు తెలుస్తోంది. (Telangana TDP)
కాంగ్రెస్‌కు మేలు చేసేందుకేనా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవలి కాలంలో కాస్త జోరు పెరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కు మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి దూరమంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తో కుదిరిన ఒప్పందం మేరకే పోటీకి దూరమంటూ చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకున్న చంద్రబాబు.. తెలంగాణ, హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే ఎందుకు పోటీ చేయడంలేదని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి.
తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది. కొందరు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలతో భ్రస్టుపట్టించారని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. పోటీ చేసి సత్తా ఏంటోచూపిద్దామని కొందరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా చాలెంజ్‌లు చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు మేలు చేస్తున్న విషయం అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా తెలియకుండా పోదు. 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీని, అమిత్ షాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు.. తాను ఘోరంగా ఓటమిపాలైన తర్వాత కళ్లు బైర్లు కమ్మి రియలైజ్ అయ్యారు. కొంత కాలం మౌనంగా ఉన్న తర్వాత మోదీ ప్రజా నాయకుడని, గొప్పవాడని, పొగడటం మొదలు పెట్టారు. అయితే, బీజేపీ అధిష్టానం చంద్రబాబు వంక చూడటం లేదు.
తాజాగా చంద్రబాబు అరెస్టు తర్వాత కూడా ఆయన తనయుడు లోకేష్ ఢిల్లీలోనే తిష్ట వేసి కేంద్ర బీజేపీ పెద్దల ఆశీస్సుల కోసం పడిగాపులు గాశారు. అయితే, చాలా రోజులు వెయిట్ చేపించిన తర్వాత ఎట్టకేలకు హోంమంత్రి అమిత్ షా.. లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే, అక్కడ కూడా లోకేష్ రాయబారం బెడిసికొట్టింది. చంద్రబాబుకు ఉపశమనం లభించలేదు. దీంతో చేసేది లేక ఢిల్లీలోనే చినబాబు చక్కర్లు కొడుతున్నాడు. తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేసే విషయం, ఏపీలో పొత్తులు, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ముందుకెళ్లేలా కార్యాచరణ…. ఇవన్నీ బీజేపీ పెద్దలతో ఇప్పటికే డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును నమ్మే స్థితిలో మోదీ, అమిత్ షా ద్వయం లేదన్నది వంద శాతం నిజం. గెలిచిన తర్వాత ఒకలా, ఓడితే మరోలా చంద్రబాబు తీరు ఉంటుంది. ఇప్పటికే ఈ విషయం రుచి చూసిన బీజేపీ పెద్దలు.. చంద్రబాబును నమ్ముతారా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. మరోవైపు చంద్రబాబు అటు ఇండియా కూటమిలో కూడా చేరలేదు. దీంతో అటు బీజేపీకి దగ్గర కాలేక, ఇటు ఇండియా కూటమిలోనూ ఎంట్రీ ఇవ్వలేక ఎటూ కాకుండా ఉండిపోయారు.
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ సపోర్ట్ చేయడం ద్వారా మరింత కష్టాల్లో కూరుకుపోయినట్లేననే విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వేళ కాంగ్రెస్ గెలిచినా ఏపీలో ఉపయోగం ఉండదు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ద్వారా రాజకీయం నడపడమే ఓ ఆప్షన్. కానీ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, ముదుర్లు చంద్రబాబు హవాను, రేవంత్ తైతక్కలను సాగనిస్తారా? ఒక వేళ కాంగ్రెస్ గెలిచినా రేవంత్ సీఎం కావడం ప్రశ్నార్థకమే. ఇక కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ రావడం కూడా పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ దేశమంతా చుట్టి వచ్చినా బీజేపీకి పోటీ ఇచ్చేంత సత్తా రావడం లేదనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇన్ని పరిణామాల మధ్య చంద్రబాబు ఎటు స్టెప్ తీసుకోవాలన్నా ఆలోచనలో పడిపోయే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అసలు చంద్రబాబు ఎప్పుడు బయటకొస్తారు? ఎన్నికల్లోపు వస్తారా? రాకపోతే ఎన్నికలను ఎదుర్కొనే సత్తా కూడా లోకేష్, టీడీపీ నేతలకు లేదనేది బహిరంగ సత్యం. ఈ క్రమంలో రెంటికీ చెడ్డ రేవడిలా టీడీపీ మిగిలిపోతుందేమోననే భయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తల్లో గుబులు పుట్టిస్తోంది.
ఇవీ చదవండి: Telangana Congress CM: ఆ కుర్చీ నాది రా బై.. తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి క్యాండేట్ల లిస్టు ఇదీ..!
