Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటి నుంచి అమెరికా వెళ్లారంటే అది మా వల్లేనని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటికే కంప్యూటర్, సెల్‌ఫోన్ తానే కనిపెట్టానని, టెక్నాలజీ వచ్చిందంటే అందుకు తానే కారణమని పలుమార్లు చెప్పిన చంద్రబాబు.. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. అమరావతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు. ఇంగ్లిష్‌లో చదివి కాదు.. నాలెడ్జ్ వల్లే విదేశాలకు వెళ్తున్నారంటూ పరోక్షంగా సీఎం జగన్‌కు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. (Chandrababu Naidu)
శ్రీకాళహస్తిలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో భూమి కొన్న ఎన్ఆర్ఐని అనేక ఇబ్బందులు పెట్టారని వాపోయారు. సొంతభూమిని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక సాధారణ వ్యక్తుల భూములను అధికార పార్టీ నేతలు వదులుతారా? అని ప్రశ్నించారు. నరకం అంటే ఏంటో ఈ నాలుగేళ్లలో జగన్ చూపించారంటూ చంద్రబాబు ఫైరయ్యారు. వైఎస్సార్‌సీపీలోనే చిన్న చేపలను పెద్ద చేపలు మింగేస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు.
పేదలను దోచేస్తూ పేదల పక్షపాతినని చెప్పుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో తమ పార్టీ ఓడిపోయాక భూముల విలువలు తగ్గాయని పేర్కొన్నారు. ధైర్యంగా రాజకీయాలు చేస్తానంటూ పరదాల మధ్య తిరుగుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. సజ్జల భార్గవ్ కూడా సైకోలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎన్ఆర్ఐల భూముల కబ్జాకు అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేశారని, దొంగలను కాపాడే పనిలో కొందరు పోలీసులు ఉన్నారంటూ పోలీసులపైనా చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు.
ముఠాలను మట్టిలో కలిపేశా..
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ చిత్తుగా ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుందంటూ చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ, వ్యక్తులు ముఖ్యం కాదని, రాష్ట్రం శాశ్వతమంటూ పేర్కొన్నారు. విద్యారంగాన్ని చిన్నాభిన్నం చేశారని, ఇక్కడి విద్యార్థులు తెలంగాణలో పరీక్షలు రాస్తున్నారని ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు కామెంట్లు చేశారు. డీఎస్సీ లేదు, ఉద్యోగాలు లేవని, ఇంగ్లీషు నేర్పిస్తేనే ఉద్యోగాలు వస్తాయా ? అని ప్రశ్నలు వేశారు. సజ్జల భార్గవ్ ఓ ఇడియట్ అని, ఏపీలో రౌడీయిజం పెరిగిపోయిందని చంద్రబాబు గుండెలు బాదుకున్నారు. ముఠాలను మట్టిలో కలిపేశా.. రౌడీలు ఏం చేస్తారు? అంటూ బ్రహ్మానందం టైపులో చంద్రబాబు డైలాగులు చెప్పారు. అబద్దాలు చెప్పడం జగన్‌కే సాధ్యమని వ్యాఖ్యానించారు.
మేం అధికారంలో ఉంటేనే రాష్ట్రం సేఫ్!
తాను బాంబులకే భయపడలేదని, ఈ సైకోలు ఓ లెక్కా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందరి సంగతి తేలుస్తానంటూ బెదిరించారు. లులూ కంపెనీని విశాఖ నుంచి తరిమేశారని ఆరోపించిన బాబు.. అమర్ రాజా సంస్థను తామే పంపించేశామని సజ్జల ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. మట్టి, మద్యం, గనులు ఇలా అన్నింట్లో దోపిడీ జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. సీఎం జగన్ అండతో రౌడీలు రెచ్చిపోతున్నారని, నాలుగేళ్లుగా ఏపీలో విధ్వంస పాలన తట్టుకోలేకపోతున్నామన్నారు. ఏపీలో ఎవరూ సేఫ్‌గా లేరని, తాము అధికారంలో ఉంటే తప్ప రాష్ట్రం సేఫ్ కాదనే భావంలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ పెట్టుబడిదారులందరినీ తరిమేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.