Chandrababu CID Custody: స్కిల్ స్కామ్ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబును రెండు రోజుల సీఐడీ రిమాండ్‌కు ఏసీబీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో నేడు, రేపు సీఐడీ అధికారులు బాబును విచారణ చేస్తున్నారు. చంద్రబాబుకు వంద ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఐడీ టీమ్‌లో 12 సభ్యులు ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు సీఐడీ కస్టడీ అంశంలో కీలక అంశాలున్నాయి. (Chandrababu CID Custody)
ఏసీబీ కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైలులో చంద్రబాబును సీఐడీ విచారిస్తోంది. ఉ.9:30 నుంచి సా. 5గంటల వరకు విచారణ ఉంటుంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చింది కోర్టు. కస్టడీకి తీసుకునే ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్యపరీక్షలు జరపాలని కోర్టు సూచించింది. విచారణ సమయంలో గంటకు 5 నిమిషాలు చంద్రబాబుకు విరామం ఉంటుంది.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ విరామం ఇస్తారు. పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని కోర్టు సూచించింది. విచారణ సమయంలో మొత్తం 12 మందికి అనుమతి ఇచ్చింది. 9 మంది పోలీస్ సిబ్బందితో పాటు వీడియోగ్రాఫర్, ఇద్దరు మీడియేటర్లకు అనుమతి ఇచ్చింది. విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదని కోర్టు సూచించింది. సీల్డ్ కవర్ లో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేష్
తన తండ్రి అరెస్టుతో ఢిల్లీలో రాయబారాలు చేసేందుకు, తండ్రిని కాపాడుకొనేందుకు లోకేష్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గత 9 రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో పరిణామాలు వేగంగా మారాయి. సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు చేస్తున్నారట. సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్ తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేష్ చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.
తాడేపల్లి సిట్ కార్యాలయం నుంచి రాజమండ్రికి సీఐడీ అధికారులు
ల్యాప్ టాప్, ప్రింటర్, సహా పలు డాక్యుమెంట్స్ ను అధికారులు వెంట తీసుకెళ్లారు. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. సీఐడీ బృందంలో వి.విజయ్ భాస్కర్, ఏ.లక్ష్మీనారాయణ, మోహన్ కుమార్, వై.రవికుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, పి.రంగనాయకులు, ఎం.సత్యనారాయణ ఉన్నారు. విచారణలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు పాల్గొంటున్నారు.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర, బ్యాంకు ఖాతాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తో మీటింగ్ లపై ప్రశ్నలు గుప్పిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: CBN remand: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు : చంద్రబాబు