CBN remand: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు రిమాండ్‌ను కోర్టు ఈనెల 24వ తేదీ వరకు పొడిగించింది. కస్డడీపై చంద్రబాబు అభిప్రాయాలను జడ్జి కోరారు. చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయమూర్తి మాట్లాడారు. రిమాండ్ లో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా? అని చంద్రబాబును అడిగారు. (CBN remand)
ఎల్లుండి వరకు జ్యూడీషియల్ కస్టడీలోనే ఉంటారని, మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోందని న్యాయమూర్తి చంద్రబాబుతో అన్నారు. మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారంటూ జడ్జి చంద్రబాబుకు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వాపోయారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని జడ్జిని చంద్రబాబు కోరారు.
ఇది పెద్ద పనిష్మెంట్
విచారణలో న్యాయమూర్తితో చంద్రబాబు తన ఆవేదనను చెప్పుకున్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని పేర్కొన్నారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని వ్యాఖ్యానించారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందన్నారు. అన్యాయంగా తనను అరెస్టు చేశారని తెలిపారు. ఇది తన బాధ, తన ఆవేదన, తన ఆక్రందన అని చెప్పారు.
ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చంద్రబాబు వాపోయారు. తనపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే… నిర్ధారణ కాలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే.. చట్టాన్ని గౌరవిస్తానని చంద్రబాబు తెలిపారు. తనను అకారణంగా జైల్లో పెట్టారని పదేపదే కోర్టుకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని బాబు చెప్పారు.
ఆన్‌లైన్ లో చంద్రబాబు రిమాండ్ పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేశారని బాబు చెప్పుకొచ్చారు. జైలులో చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలపై న్యాయమూర్తి నివేదిక కోరారు. జైల్లో ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని జడ్జి చంద్రబాబుకు సూచించారు.
చట్టం అందరికీ సమానమే
చట్టం అందరికీ సమానమేనని చంద్రబాబుకు జడ్జి సూచించారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, రిమాండ్ ను శిక్షగా భావించొద్దు అని బాబుకు సూచించారు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయని జడ్జి పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పిన విషయాలు జడ్జి నోట్ చేసుకున్నారు.
మరోవైపు చంద్రబాబు ఏ1 నిందితుడిగా ఉన్న అంగళ్లు కేసులో బాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 26కు న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Chandrababu Scams: చంద్రబాబుకు క్యూలో వరుస కేసులు.. వెయిటింగ్‌లో ఇన్నర్ రింగు రోడ్డు స్కామ్!