AP Groups Notification: ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ విషయంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏపీలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే జగన్ అధికారంలోకి వచ్చాక 2 లక్షలకుపైగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు సీఎం జగన్. తాజాగా ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. (AP Groups Notification)
ఈ మేరకు ఏపీపీఎస్సీ చర్యలకు ఉపక్రమించింది. గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2022 గ్రూప్ 1 ప్రక్రియను రికార్డు స్థాయిలో 9 నెలల్లో పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం చేపడుతున్న ప్రక్రియ కూడా ఇదే తరహాలో వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో 5 పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, మరో 2 పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని వెల్లడించారు.
లాంగ్వేజ్ లో 2 పేపర్లకు బదులుగా ఒకే పేపర్ ఉంటుందని సవాంగ్ తెలిపారు. సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవని క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మంచి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతనే ఈ తరహా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ లో 2,200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో రిజల్ట్ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు.