YSR Awards: సమాజంలో వివిధ వృత్తుల్లో రాణించి ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులే డాక్టర్ వైయస్సార్ అవార్డులని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ ఏ– కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు దివంగత వైయస్సార్ సతీమణి విజయమ్మ, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, అవార్డు గ్రహీతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. (YSR Awards)
23 మందికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు, నలుగురుకి వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అందజేశారు. అవార్డులు అందుకున్న వారిని విజయమ్మ పేరు పేరునా ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…
‘‘ఎందరో మహానుభావులు అందరికీ ఈ శుభ సందర్భంలో వందనాలు. ఈరోజు ఇక్కడ మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయులు గవర్నర్ గారికి, నా మంత్రివర్గ సహచరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సన్మాన స్వీకర్తలు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. వరుసగా ఈరోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్సార్ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి.
ఈ సంవత్సరం 27 మందికి వైఎస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేయబోతున్నాం. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైయస్సార్ గారి పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తుంది.
డాక్టర్ వైయస్సార్ గారి హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా చూసినవే. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగుళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతు వాదానికి… సాటి మనుషులకు చేస్తున్న సేవలకు ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది.
ఈ అవార్డులు అందుకుంటున్నవారు అంతా కూడా తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించిన వారు, మన వారసత్వాన్నితమ భుజాల మీద మోసిన వారు. వీరంతా మన జాతి సంపద. ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడు సంవత్సరాల్లో సామాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది. ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు.’’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
అవార్డు గ్రహీతల వివరాలు..
వ్యవసాయం
1. పాంగి వినీత, మహిళా రైతు, అల్లూరి సీతారామరాజు జిల్లా (వైఎస్సార్ అచీవ్‌మెంట్)
• వ్యవసాయంలో సేంద్రీయ విధానాలను పాటించడం
• రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ కషాయాల తయారీ.. రైతులకు పంపిణీ
• పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ఏడాది పొడవునా వ్యవసాయ ఉత్పత్తుల సాగు
• రైతులకు సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన..
2. డా. వై.వి. మల్లారెడ్డి, రైతు, అనంతపురం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• ప్రముఖ సామాజిక కార్యకర్త ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) లో 42 ఏళ్లుగా సేవలు
• గత 15 సంవత్సరాలుగా అసియన్ ఫ్రాటెర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్
• అనంతపురం జిల్లాలో 235 గ్రామాల పరిధిలో 60వేల మందికి పైగా రైతులు, భూమి లేనివారు మరియు ఇతర వర్గాలతో కలిసి వ్యవసాయం
• జీవావరణం, పర్యావరణం, వాతావరణ మార్పు, వ్యవసాయం, పేదరిక నిర్మూలన, మహిళాభివృద్ధి, పిల్లల విద్య వంటి రంగాలలో విశేష సేవలు
ఆర్ట్ అండ్ కల్చర్ (కళలు, సంస్కృతి)
3. యడ్ల గోపాలరావు, రంగస్థల కళాకారుడు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• చిన్ననాటి నుంచే కళలపై మక్కువ.. నక్షత్రక, శ్రీకృష్ణ, శ్రీరాముడి పాత్రలకు జీవం
• 14 ఏళ్ల వయసులో సాంఘిక నాటకాల ద్వారా అరంగేట్రం
• ఐదు దశాబ్ధాలుగా సాంఘిక, పౌరాణిక పాత్రల ద్వారా వేలాది ప్రదర్శనలతో కళాభిమానుల మెప్పు
4. తలిశెట్టి మోహన్, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుడు, తిరుపతి (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• 1974 నుంచి కలకంకారీ కళకు విశేష సేవలు
• అద్దకం, ఫ్యాబ్రిక్ తయారీలో నేటి కళాకారులకు శిక్షణ
• 1990 లో కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వశాఖ ద్వారా నేషనల్ మెరిట్ అవార్డును అందుకున్నారు
• 1997లో కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ నుండి జాతీయ అవార్డు సర్టిఫికెట్ స్వీకరించారు.
5. కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ, బాపట్ల (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• ప్రసిద్ధ హరికథా విద్వాంసుడైన కోట సచ్చిదానంద శాస్త్రి ఆదిభట్ల నారాయణ దాసు యొక్క ప్రియశిష్యులు
• ఈయన హరికథలు, సినిమా చూస్తున్నట్లు ఉంటాయని నానుడి
• రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ 1500కు పైగా చిలుకు ప్రదర్శనలిచ్చి అనేక ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు.
• భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికిగాను పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది
6. కోన సన్యాసి, తప్పెటగుళ్లు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• తప్పెటగూళ్లు సన్యాసి అంటే ఉత్తరాంధ్రలో ఫేమస్
• తెలుగు జానపదాలకు తప్పెటగుళ్లు పాట, ఆటతో దేశవ్యాప్తంగా కీర్తి తెచ్చిన కోన సన్యాసి
• ఆదరణ తగ్గినా కూడా అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్న కోన సన్యాసి
• తన ఇద్దరు కుమారులకు తప్పెటగుళ్లు కళను నేర్పిన కోన సన్యాసి
• ఊరిలోను ఇరుగుపొరుగు యువతకు తప్పెటగుళ్లు కళను నేర్పుతున్న సన్యాసి
7. ఉప్పాడ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో– ఆపరేటివ్ సొసైటీ, కాకినాడ (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• 1938లో తన కార్యకలాపాలను ప్రారంభించిన ఉప్పాడ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో– ఆపరేటివ్ సొసైటీ, కాకినాడ
• మొత్తం 515 మంది సభ్యులను కలిగి ఉన్న ఉప్పాడ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో– ఆపరేటివ్ సొసైటీ
• వైఎస్సార్ నేతన్న నేస్తం, చేనేత పింఛన్లు, చేనేత ముద్ర పథకం, క్లస్టర్లు వంటి అనేక ప్రభుత్వ పథకాలు సొసైటీ ద్వారా అమలు
• ఉప్పాడ జమ్దానీ చీర అనేది ఉప్పాడలో నేసిన పట్టు చీర శైలి.. ఇది వస్తువుల భౌగోళిక సూచికల (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం, 1999 ద్వారా నమోదలు
8. ఎస్వీ రామారావు, అంతర్జాతీయ చిత్రకారుడు, కృష్ణా (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• 1936లో జన్మించిన డా.ఎస్వీ రామారావు ప్రముఖ కళాకారుడు, కవి, విద్యావేత్త మరియు రచయిత
• సమాకాలీన ప్రపంచ కళాత్మక సంప్రదాయానికి మరింత వన్నె తీసుకొచ్చారు
• తూర్పు మరియు పశ్చిమ కళలకు వారధిగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు
• 28 ఏళ్ల వయసులో ఉండగా ఎస్వీ రామారావును లండన్ లోని ప్రధాన పత్రికలన్నీ మేధావిగా కీర్తించాయి
9. రావు బాలసరస్వతి, తొలి తరం నేపథ్య గాయని, నెల్లూరు (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• 1928లో జన్మించిన రావు బాలసరస్వతీ తొలితరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని
• లలిత సంగీత సామ్రాజ్ఞిగా రావు బాలసరస్వతి అత్యంత ప్రసిద్ధి పొందారు
• ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఈమె కంఠం తెలుగు వారికి సుపరిచితం
• సినిమాలలో నేపథ్యగాయనిగా ఈవిడ తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు
• ఆరవ ఏటనే బాలసరస్వతి గాత్ర మాధుర్యం ప్రారంభమైంది
10. తల్లావజ్ఝుల శివాజీ, చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రకాశం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• జననం విద్యాభ్యాసం ఒంగోలులో, కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి నుంచి నేర్చుకున్నారు
• బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు.
• పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు
• ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలు వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి.
• చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు.
11. డా. చిగిచెర్ల కృష్ణా రెడ్డి, జానపద కళలు, అనంతపురం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రికార్డు స్థాయిలో 35 పీహెచ్‌డీ డిగ్రీలు, 66 ఎంఫిల్ డిగ్రీలను ప్రదానం చేసి, జానపద కళలను పర్యవేక్షించి మార్గదర్శకత్వం వహించిన దేశంలోనే ఏకైక ప్రొఫెసర్‌గా ఘనత సాధించారు.
• ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జానపద ప్రదర్శన కళలలో మొట్టమొదటిసారిగా పీహెచ్‌డీ అందించడంలో ప్రత్యేకతను సాధించారు.
• జానపద కళలు, జానపద సంస్కృతిపై 14 పుస్తకాలను రచించారు మరియు 3 పుస్తకాలను సవరించారు మరియు అనేక పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు.
12. కలీసాహెబీ మహబూబ్- శ్రీ. షేక్ మహబూబ్ సుబానీ దంపతులు, నాదస్వరం, ప్రకాశం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• ప్రకాశం జిల్లా, పెద కొత్తపల్లికి చెందిన షేక్ మహబూబ్ సుబానీ ప్రముఖ సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందినవారు.
• కలీసాహెబీ మహబూబ్ పూర్వీకులు కూడా ప్రసిద్ధ నాదస్వరం విద్వాంసులు కావడం విశేషం
• శ్రీమతి. కలీసాహెబీ మహబూబ్- శ్రీ. షేక్ మహబూబ్ సుబానీ దంపతులు దేశవ్యాప్తంగా మరియు అబుదాబి, బ్రస్సెల్స్, కెనడా, దుబాయ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మలేషియా, శ్రీలంక, USA & UKలో దాదాపు అన్ని దేశాలలో నాదస్వర కచేరీలను ప్రదర్శించారు.
సాహిత్యం
13. ప్రొ. బేతవోలు రామబ్రహ్మం, పశ్చిమ గోదావరి (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• ఈయన ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, పద్యకవి, అవధాని, కథకుడు, అనువాదకుడు, విమర్శకుడు, వ్యాఖ్యాత అంతకుమించి అధ్యాపకులు.
• కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చదివారు
• నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు
• దేవీ భాగవతం వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు
14. ఎండీ ఖదీర్ బాబు, రచయిత, నెల్లూరు (వైఎస్సార్ అచీవ్‌మెంట్)
• మహమ్మద్ ఖదీర్ బాబు ప్రసిద్ధ తెలుగు కథా రచయిత
• నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబుది ప్రత్యేకమైన స్థానం
• ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ‘కథాకోకిల’ అవార్డును అందుకున్నారు
• ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్ఠాత్మక ‘చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ‘ కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.
• తెలుగు కథలకు ఈ ఫెలోషిప్ దొరకడం ఇదే తొలిసారి.
15. మహజబీన్, నెల్లూరు (వైఎస్సార్ అచీవ్‌మెంట్)
• ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, న్యాయవాది, తెలుగు కవయిత్రి మరియు స్త్రీవాద రచయిత్రి అయిన శ్రీమతి. మహజబీన్ స్వస్థలం నెల్లూరు
• న్యాయవాద విద్యను కూడా అభ్యసించిన శ్రీమతి. మహజబీన్ తన కవితా సంకలనం “ఆకు రాలు కాలం” 1997లో ప్రచురితమైంది.
• ఈమె కవిత్వం ప్రధానంగా లింగ న్యాయం, శాంతి, పర్యావరణం, మహిళలు మరియు పిల్లల హక్కులపై దృష్టి పెట్టడం విశేషం
16. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, చిత్తూరు (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సుప్రసిద్ధ రచయిత
• 1980, 1990లలో ఈయన కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి
• సాధారణమైన రాయలసీమ వాడుక భాషలో పిల్లల తేలికగా అర్థం చేసుకునేలా కొన్ని పుస్తకాలు రచించారు
• ఆయన జీవితానుభవాలనే కథలుగా రచించి పాఠకుల మన్ననలు పొందారు
• నామిని విలక్షణమైన రచనాశైలిని, చమత్కారాన్ని బాపూ, స్వర్గీయ పీ.వీ.నరసింహారావు మొదలైన ప్రముఖులెందరో ప్రశంసించారు.
17. అట్టాడ అప్పలనాయుడు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• అట్టాడ అప్పల్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథా, నవలా రచయిత
• కోటిపాం జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నారు
• శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితులై జననాట్యమండలిలో పనిచేశారు
• పార్వతీపురంలో ఇంటర్మీడియట్ చదివి జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పనిచేశారు
• నాగావళి వారపత్రికలో పనిచేసి గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగం సాధించి పదవీ విరమణ చేశారు
• తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించారు
క్రీడా విభాగం
18. పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్, గుంటూరు (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• పుల్లెల గోపీచంద్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
• ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు చీఫ్ నేషనల్ కోచ్‌గా ఉన్నారు
• ఈయన 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు
19. కరణం మల్లీశ్వరి, వెయిట్ లిఫ్టింగ్, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• కరణం మల్లేశ్వరి శ్రీకాకుళానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి
• 2000 లో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు
• 2022లో కరణం మల్లీశ్వరికి ‘బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు
వైద్య రంగం
20. డా. ఇండ్ల రామ సుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, రచయిత, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో 25.10.1953లో జన్మించారు
• విజయవాడలో గత 40 సంవత్సరాలుగా కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తూ, 50 పడకల మానసిక వ్యాధుల ఆసుపత్రి “ఇండ్లాస్” డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు
• ముంబైలోని ఇండ్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ (ICGC) డైరెక్టర్
• డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులయ్యారు
21. డా. ఈసీ వినయ్ కుమార్, స్వచ్ఛంద సేవా సంస్థ, డాక్టర్, వైఎస్సార్ జిల్లా (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, బీఏహెచ్ఏ సర్వే, గురకకు శస్త్రచికిత్స, రైనోప్లాస్టీ, మైక్రో ఇయర్ సర్జరీలలో ప్రసిద్ధులైన ఈఎన్‌టీ స్పెషలిస్ట్
• హైదరాబాద్ అపోలో హెల్త్ సిటీతో అనుబంధం కలిగి ఉన్న డా. ఈసీ వినయ్ కుమార్ ట్రస్ట్ తో పాటు వినికిడి లోపం ఉన్నవారికి సహాయం చేయడానికి సాహీ సొసైటీని ప్రారంభించారు
మీడియా రంగం
22. గోవిందరాజు చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్, కృష్ణా జిల్లా (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం
• మీడియా వ్యాఖ్యాత, అనువాదకుడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంమ్‌లలో కంటెంట్ సృష్టికర్తగా సేవలు
• నాలుగు దశాబ్దాల అనుభవంతో తెలుగు యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించారు
23. కె. హనుమంత రెడ్డి (హెచ్ఆర్కే), ఆధునిక, సంస్కరణవాద కవిత్వం, కర్నూలు (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• ప్రముఖ ఆధునిక, సంస్కరణవాద కవిత్వంలో దిట్ట కె. హనుమంతరెడ్డి.. హెచ్‌ఆర్కే అనేది ఈయన పేరుకు సంక్షిప్త రూపం
• ఈయన కలం అసలు పేరు హనుమంత రెడ్డి కొద్దెల
• కర్నూలు జిల్లాలోని ‘గని’ అనే మారుమూల గ్రామంలో 1951లో పేద రైతు కుటుంబంలో జన్మించారు
సామాజిక సేవ
24. బెజవాడ విల్సన్, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• 1966లో జన్మించిన బెజవాడ విల్సన్ ప్రముఖ సామాజిక నాయకులు
• మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన , నిర్మాణం, ఆపరేషన్ మరియు ఉపాధి కోసం విశేష కృషి చేస్తున్నారు
• భారతీయ మానవ హక్కుల సంస్థ సఫాయి కర్మచారి ఆందోళన్ (SKA) వ్యవస్థాపకులలో ఒకరు
• 2016లో ఈయన రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించబడ్డారు
25. శ్యాంమోహన్, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (వైఎస్సార్ అచీవ్‌మెంట్)
• దక్షిణాది రాష్ట్రాల్లోని గిరిజన మరియు దళిత గ్రామాల్లోని సమస్యలను వారి విజయాలను తెలియజేసే విధంగా ఒక యూట్యూబ్ ఛానెల్ స్థాపించారు
• తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అవగాహన కార్యక్రమాలను, ప్రసంగాలను ప్రదర్శిస్తున్నారు
• కార్టూనిస్ట్ అయిన చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, జర్నల్‌లో ప్రదర్శించబడ్డాయి
• ఈయన రెండు ప్రముఖ తెలుగు పత్రికల డెస్కులో కూడా పనిచేశారు
26. నిర్మల హృదయ భవన్, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• మదర్ థెరిసా సోదరీమణులు నిర్వహిస్తున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను 1973లో మదర్ థెరిసా ప్రారంభించారు.
• ఇదొక కులం, మతం లేదా మతంతో సంబంధం లేకుండా పేదలను ఆదుకునే లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ
• వీధుల్లో ఒంటరిగా ఉన్నవారిని, అనారోగ్యంతో మరియు ఎవరూ పట్టించుకోని వారిని ఇంటి సంరక్షణకు నోచుకోనివారిని ఆదుకుని రక్షణ కల్పిస్తోంది.
• వారికి మందులు మరియు అవసరమైన సహాయం అందజేస్తుంది.
27. డా. జి. సమరం, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)
• డా. గోపరాజు సమరం ప్రముఖ వైద్యులు, సంఘ సేవకుడు, రచయిత కూడా
• వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించారు
• కాకినాడ రంగరాయ వైద్య కళాశాల నుండి ఎం.బీ.బీ.ఎస్. పట్టా పొందిన సమరం 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు.
• వందలాది ఉచిత వైద్యశిబిరాలు, టీకావైద్యం క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్రా శిబిరాలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్.ఐ.వీ. రక్తపరీక్షా శిబిరాలు నిర్వహించటంలో ప్రధానపాత్ర పోషించారు
• 1996-97లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు.
Read Also : Chandrababu Release: చంద్రబాబుకు బెయిల్ మంజూరు.. అభివృద్ధిని గుర్తు చేసుకున్నందుకు ధన్యుడినన్న బాబు!