AP Govt: పట్టణ స్థానిక సంస్థల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదనం అవాస్తవమని ఏపీ ప్రభుత్వం (AP Govt) పేర్కొంది. సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్ లో ఉన్న 2,760 బిల్లులకు రూ.510.46 కోట్లు చెల్లింపు చేశామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం వేదికగా క్లారిటీ ఇచ్చారు. నిధులు కొరత కూడా ఏమాత్రం లేదని, ఎటు వంటి బిల్లుల బకాయిల ఉన్నా సరే వెంటనే చెల్లించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. (AP Govt)
2017-18 సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సి.ఎఫ్.ఎం.ఎస్. విధానంలో అనుసరిస్తున్న ప్రొటోకాల్ విదానం వలనే చెల్లింపుల్లో జాప్యానికి కారణమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో బిల్లులు అన్నీ పేరుకు పోయాయని, గుత్తేదారులకు చెల్లింపులు జరపకపోవడం వల్ల పనులన్నీ అగిపోయాయని, పనుల నిర్వహణకు ఎన్ని సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడం లేదంటూ పలు అవాస్తవాలతో కథనాన్ని ఒక ప్రముఖ దినపత్రిలో ప్రచురించడాన్ని మంత్రి ఖండించారు.
ఈ వార్తాంశంలో ఏమాత్రం నిజంలేదని, ప్రభుత్వంపై విషంజిమ్మేలా అవాస్తవాలతో ఈ కథకాన్ని ప్రచురించడం జరిగిందంటూ వాస్తవాలను ఆయన వివరించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ పనులకు సంబంధించి గత వారం పదిరోజుల్లో సి.ఎఫ్.ఎం.ఎస్.లో పెండింగ్ లో ఉన్న 2,760 బిల్లులకు సంబందించి రూ.510.46 కోట్లు చెల్లింపు చేయడం జరిగిందన్నారు. ఇందులో కరెంటు చార్జీల 16 బిల్లులకు రూ.20.54 కోట్లు, 1,926 వర్కు బిల్స్ కు రూ.258.20 కోట్లు, సచివాలయాల అద్దెలకు సంబందించి 2 బిల్లులకు రూ.9.19 కోట్లు, 44 మిస్లేనియస్ బిల్లులకు సంబందించి రూ.51.98 మరియు ఇతర ఖర్చులకు సంబందించిన బిల్లులు కలుపుకుని మొత్తం 1,992 బిల్లులకు సంబందించి రూ.340.67 కోట్లు మేర మున్సిపల్ జనరల్ ఫండ్స్ ను చెల్లించడం జరిగిందన్నారు.
14వ, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పలు పనులకు సంబంధించి మొత్తం 768 బిల్లులకు రూ.169.79 కోట్లను చెల్లించడం పూర్తయిందన్నారు. పలు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి పెడింగ్ బిల్లులకు కూడా చెల్లింపులు చేశామన్నారు. పట్టణ స్థానిక సంస్థలైన పలాస-కాసీబుగ్గ కు రూ.2.10 కోట్లు, వైఎస్సార్ తాడిగడప కు రూ.11.87 కోట్లు, సాలూరు కు రూ.1.02 కోట్లు, గుంటూరు మున్సిఫల్ కార్పొరేషన్ రూ.13.28 కోట్లు, జంగారెడ్డి గూడెంకు రూ.1.91 కోట్లు, పిడుగురాళ్ల కు రూ.1.37 కోట్లు, ఎర్రగుంట్ల కు రూ.1.00 కోటి వెరసి మొత్తం రూ.32.58 కోట్లను 269 బిల్లులకు సంబంధించి చెల్లింపు చేశామన్నారు.
తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబందించి ఈ ఏడాది మే 22 వ తేదీ నాటికి పెండింగ్ లో పలు బిల్లులకు సంబందించి రూ.13.61 కోట్లు మేర జనరల్ ఫండ్స్ ను చెల్లించామన్నారు. ఈ కార్పొరేషన్ లో 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు అన్నింటికి పూర్తికా చెల్లింపులు చేయడం జరిగిందని, ఎటువంటి బకాయిలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లి-మంగళగిరి మున్సిఫల్ కార్పొరేషన్ లో ఫేజ్-2 లో జనరల్ ఫండ్స్, 14 మరియు 15 వ ఆర్థిక సంఘం నిధుల చేపట్టబడిన పనులకు కూడా సుమారు రూ.44.00 కోట్ల మేర చెల్లింపు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాద్యతలు చేపట్టినప్పటి నుంచి పట్టణ స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే విధంగా నూతన జవసత్వాలు అందించేలా చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. అమృత్ 1.0 పథకం రూ.3,500 కోట్లు, అమృత్ 2.0 పథకం క్రింద రూ.5,000 కోట్లతో పరిపాలనా అనుమతులను ఇప్పటికే జారీ చేశామన్నారు.
రాష్ట్ర పురపాల, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. పట్టణ స్థానిక సంస్థల్లో స్థానికంగా పనుల నిర్వహణకు సహజంగానే ఎన్నో ఆటంకాలు ఉంటాయని, వాటన్నింటినీ అధిగమిస్తూ పనులను ముందుకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం 7 స్థానిక సంస్థల్లోనే సమస్యలు ఉన్నాయని, మిగిలిన అన్ని పట్టణ స్థానకి సంస్థల్లో పనులు సజావుగానే సాగుతున్నాయన్నారు. పనులకు సంబందించిన అన్ని పెండింగ్ బిల్లులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేశామన్నారు.
Read Also : CM Jagan Review On GIS: విశాఖ ఐటీ హబ్ కావాలి.. రివ్యూ మీటింగ్‌లో సీఎం జగన్