Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని సేవలను మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు 1,035 ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం, వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 54 లక్షల మంది ప్రజలు మొత్తం 1.78 కోట్ల సేవలు పొందారు. ఈ సేవల వినియోగం పెంచేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్స్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించారు.
కర్నూలులో డ్రోన్ సిటీ అభివృద్ధి వేగం
కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే ప్లాంట్లు స్థాపించేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యిందని, మే నెల రెండో వారంలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారైన నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ మొదటి దశ పనులను ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నేర నియంత్రణలో సీసీ కెమెరాల విస్తరణ
రాష్ట్రంలో నేర నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి సీసీ టీవీ కెమెరాల వినియోగాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నేరస్తులను గుర్తించడం, వాహనాల దొంగతనాలను అరికట్టడం, మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న కెమెరాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
శాటిలైట్ డేటాతో వేగవంతమైన చర్యలు
రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులకు తక్షణ స్పందన అందించేందుకు శాటిలైట్ డేటాను RTGS వ్యవస్థతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. ఇటీవల తిరుమల-తిరుపతి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై స్పందిస్తూ, శాటిలైట్ సమాచారం ఉంటే మరింత వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన డీజిల్, పెట్రోలు సరఫరా సమస్యపై ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు. అయితే సమస్యలు ఏర్పడకముందే రియల్ టైమ్‌లో గుర్తించి చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
సాంకేతికతను వినియోగించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Andhra Pradesh Pensions: ఏపీలో కొత్త పింఛన్లపై గుడ్ న్యూస్.. జూన్ నుంచి ఎవరెవరికి ఇస్తారంటే!
Andhra Pradesh Crime: 15 తులాల బంగారం మిస్సింగ్.. ఇంట్లోకి రానివ్వని భర్త.. పసికందుతో ఇంటి ముందు మహిళ
