Ahana krishna: మలయాళ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అహానా కృష్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయిన అహానా, సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవితో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా అహానా తండ్రి కృష్ణ కుమార్ ధృవీకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కూతురి పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మా ఇంటిక్కూడా వచ్చి వెళ్తుంటాడు
కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. “అహానా పెళ్లి చేసుకుంటానని నాకు మెసేజ్ చేసింది. ఆ అబ్బాయిని మాకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు ఇప్పటికే మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి వెళ్లాడు.
నేను యువకుడిగా ఉన్నప్పుడు కూడా అచ్చం అలాగే ఉండేవాడిని. నా భార్య సింధును పెళ్లికి ముందే ఇంటికి తీసుకెళ్లేవాడిని. దాంతో నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో కుటుంబానికి ముందే తెలుసు. అలాంటప్పుడు పెళ్లి సమయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు” అని తెలిపారు.
నిమిష్ కుటుంబం మాకు చాలాకాలంగా పరిచయం
నిమిష్ కుటుంబం గురించి కూడా ఆయన మాట్లాడారు.
“నిమిష్ తండ్రి, నిర్మాత రవి నాకు దాదాపు 30 ఏళ్లుగా తెలుసు. వారి కుటుంబంలో ఏ అవసరం వచ్చినా నేను స్నేహపూర్వకంగా సలహాలు ఇస్తుంటాను. అహానా, నిమిష్ కలిసి ఒక షార్ట్ ఫిలింలో పని చేసినప్పుడు నేను అతడిని మొదటిసారి కలిశాను. అతడు చాలా సింపుల్‌గా ఉంటాడు. అతడి ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. నిమిష్ తండ్రి సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో త్యాగాలు చేశాడు. ఆ త్యాగాలకు దేవుడు పిల్లల రూపంలో మంచి ఫలితం ఇచ్చాడు” అని కృష్ణ కుమార్ చెప్పుకొచ్చారు.
ప్రేమకు నెక్స్ట్ స్టెప్?
గత కొన్నేళ్లుగా అహానా కృష్ణ, నిమిష్ రవి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలతో వీరి సంబంధం త్వరలోనే పెళ్లి వరకు వెళ్లే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.
సినిమాల్లో అహానా ప్రయాణం
అహానా కృష్ణ మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది.
ఎంజన్, స్టీవ్ లోపెజ్, లూకా, పతినెట్టం పది, ఆడి, నాన్సీ రాణి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు సంపాదించాడు. అతడు ఇటీవల పనిచేసిన ‘లోక: చాప్టర్ 1’ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం అహానా పెళ్లి వార్తలతో మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ జంట తమ ప్రేమను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: Marriage: పెళ్లి చేసుకునే వారికి కొత్త తలనొప్పి.. విందు ఖర్చులపై ట్రెండింగ్ టాపిక్ ఎఫెక్ట్!
Marriage muhurtham dates: పెళ్లి కళ వచ్చేసిందే బాలా.. March శుభ ముహూర్తాల వేళ మోగనున్న భాజా భజంత్రీలు
Marriage : యువకులారా.. పెళ్లి కావడం లేదా? ఏ గుడికి వెళ్లాలి? ఏ దేవుడిని మొక్కాలి? దైవ అనుగ్రహంతో వివాహ యోగం ఎలా కలుగుతుంది?
