Andhra Pradesh : దేవదేవుడి ప్రసాదం అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఎన్.చంద్రబాబు నాయుడు లేని పోని ఆరోపణలు చేస్తున్నారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. పందికొవ్వు, జంతువుల కొవ్వు ఉన్నాయంటూ ప్రచారం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో వాస్తవాలు తేలాలని Supreme Court of India ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిందని గుర్తుచేసిన బొత్స, ఇప్పటికే కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. “మానవమాత్రులు జీర్ణించుకోలేని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు దుర్బుద్ధి ఇదా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు” అని వ్యాఖ్యానించారు.
హెరిటేజ్ – ఇందాపూర్ అంశంపై ఆరోపణలు
కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని చెప్పి ఇందాపూర్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, కానీ ఇప్పుడు అదే ఇందాపూర్ రూ.680కే నెయ్యి సరఫరా చేస్తోందని బొత్స పేర్కొన్నారు. “ఇందాపూర్ ఎవరిదో కాదు, Heritage Foods కు సంబంధించినదే. ఇవన్నీ మేం తయారు చేసినవి కాదు, హెరిటేజ్, ఇందాపూర్ సంస్థలే చెప్పినవి” అని స్పష్టం చేశారు.
దేవదేవుడిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని, ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ దోపిడీకి బాటలు వేసిందని ఆరోపించారు. “దేవుడి విషయంలో తప్పు మాట్లాడితే దేవదేవుడు ఊరుకోడు” అని హెచ్చరించారు.
అసెంబ్లీలో చర్చకు ఎందుకు ఒప్పుకోలేదు?
పందికొవ్వు, జంతువుల కొవ్వు అంటూ ఎన్ని మాటలు మాట్లాడారో, అదే విషయంపై అసెంబ్లీలో చర్చకు ఎందుకు ఒప్పుకోలేదని బొత్స ప్రశ్నించారు. “టాయిలెట్స్‌లో వాడే కెమికల్స్ లడ్డూలో కలిపారని చంద్రబాబు అన్న మాటలు ఎంత బాధ్యతారాహిత్యమో చూడండి. చంద్రబాబు మాట్లాడినవన్నీ హెరిటేజ్‌లో ఉన్నాయో లేదో మేం చూపిస్తాం” అని అన్నారు.
చంద్రబాబు అధికార దాహంతో ఏ స్థాయికైనా వెళ్తారని, ఆయన దోపిడీపై ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.
బిల్ గేట్స్ అంశంపై స్పందన
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో Bill Gates పేరు కేంద్రం తప్పించిందన్న వార్తలపై బొత్స స్పందించారు. ఢిల్లీలో ఈ అంశంపై జరిగిన పరిణామాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వైసీపీ స్పందిస్తుందని తెలిపారు. ఒకవేళ కేంద్రం బిల్ గేట్స్ పేరును పక్కన పెట్టినట్లయితే, నిన్న ఏపీకి ఆయనను ఆహ్వానించడం సబబుకాదని వ్యాఖ్యానించారు.
ప్రజారోగ్యం, డిజిటల్ అటెండెన్స్‌పై విమర్శలు
“ఇంటింటికీ వైద్యం వైసీపీ హయాంలోనే అందించాం. ఇందులో ఈ ప్రభుత్వానికి గొప్పేముంది?” అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ పెట్టి, శాసనమండలిలో ఎందుకు అదే విధానం అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని వైసీపీ గౌరవిస్తుందని, రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటే స్వాగతిస్తామని తెలిపారు.
కలియుగ వేంకటేశ్వరుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దేవుడి పేరు మీద ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Botcha Satyanarayana: ఆ 25 వర్గాలకు చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారా?
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
