HomeBusinessGST Collection: గతేడాది 2025 చివర్లో జీఎస్టీ ఆదాయం ఎంతో తెలుసా? ఏ రాష్ట్రాల్లో భారీ...

GST Collection: గతేడాది 2025 చివర్లో జీఎస్టీ ఆదాయం ఎంతో తెలుసా? ఏ రాష్ట్రాల్లో భారీ వృద్ధి అంటే!

GST Collection: 2025 సంవత్సరం ముగింపు వేళ భారతదేశానికి గుడ్ న్యూస్ వినిపించింది. డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 6.1 శాతం వృద్ధితో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ.1.74 లక్షల కోట్లకు చేరుకున్నట్లు భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

డిసెంబర్ 2024లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లకు పైగా ఉండగా, 2025లో అదే నెలలో ఆదాయం స్పష్టంగా పెరిగింది. దేశీయ లావాదేవీలు, దిగుమతుల నుంచి వచ్చే పన్ను వసూళ్లు రెండూ పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

దేశీయ అమ్మకాలు, దిగుమతుల్లో పెరిగిన ఆదాయం
డిసెంబర్ 2025లో దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన జీఎస్టీ ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లకు పైగా నమోదైంది. అదే సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలైన జీఎస్టీ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. దిగుమతుల నుంచి వచ్చే ఆదాయం ఏకంగా 19.7 శాతం వృద్ధితో రూ.51,977 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

రీఫండ్‌లు పెరిగినా నికర ఆదాయం పాజిటివ్
డిసెంబర్ నెలలో జీఎస్టీ రీఫండ్‌లు కూడా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 31 శాతం అధికంగా రూ.28,980 కోట్ల మేర రీఫండ్‌లు ఇచ్చారు. అయినప్పటికీ, రీఫండ్‌లను తీసివేసిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లకు పైగా నమోదైంది. ఇది సంవత్సరానికి 2.2 శాతం వృద్ధిని సూచిస్తోంది.

సెస్ వసూళ్లలో భారీ తగ్గుదల
ఇక సెస్ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గుదల కనిపించింది. డిసెంబర్ 2024లో రూ.12,003 కోట్లుగా ఉన్న సెస్ వసూళ్లు, డిసెంబర్ 2025లో రూ.4,238 కోట్లకు పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ రేట్ల తగ్గింపేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

దాదాపు 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వినియోగదారులకు ధరల ఊరట లభించింది. అయితే పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై మాత్రం అధిక సెస్ కొనసాగుతోంది. గతంలో విలాసవంతమైన, లాభాపేక్షలేని వస్తువులపై కూడా సెస్ ఉండేది.

నవంబర్‌లోనూ సానుకూల ధోరణి
డిసెంబర్‌కు ముందు నెల అయిన నవంబర్ 2025లో కూడా జీఎస్టీ వసూళ్లు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్‌లో మొత్తం జీఎస్టీ ఆదాయం 0.7 శాతం పెరిగి రూ.1.70 లక్షల కోట్లకు చేరుకుంది. నవంబర్ 2024లో ఇది రూ.1.69 లక్షల కోట్లుగా ఉంది.

ఈ రాష్ట్రాల్లో భారీ వృద్ధి
గత ఏడాదితో పోలిస్తే కొన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
హర్యానా – 17 శాతం వృద్ధి
అస్సాం – 18 శాతం వృద్ధి
కేరళ – 8 శాతం వృద్ధి
రాజస్థాన్ – 6 శాతం వృద్ధి
అలాగే గుజరాత్ లో 1 శాతం, తమిళనాడు లో 2 శాతం వృద్ధి నమోదైంది.

మొత్తంగా…
జీఎస్టీ రేట్ల తగ్గింపు, సెస్ వసూళ్ల తగ్గుదల ఉన్నప్పటికీ, 2025 ఇయర్‌ ఎండ్‌లో జీఎస్టీ ఆదాయం స్థిరంగా పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా దిగుమతుల నుంచి వచ్చే ఆదాయం పెరగడం, ప్రధాన రాష్ట్రాల్లో వృద్ధి కనిపించడం ప్రభుత్వం ఆశాజనకంగా చూస్తోంది.

ఇవీ చదవండి: AP Assembly : తొలిరోజు అసెంబ్లీ.. జీఎస్టీ సంస్కరణలు స్వాగతిస్తూ తీర్మానం
Good News GST : దేశ ప్రజలకు శుభవార్త.. జీఎస్టీ భారీగా తగ్గింపు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు