Andhra Pradesh : రాష్ట్రంలోని నేతన్నలకు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత శుభవార్త అందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు.
సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మంత్రి సవిత ఈ వివరాలను వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా 5,726 మంది నేతన్నలకు నేరుగా లబ్ధి చేకూరనుందని తెలిపారు.
ఎన్నికల ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రతి ఏడాది రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులను చేనేత సహకార సంఘాలకు అందిస్తామని హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఆ హామీకి కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం తొలి విడత నిధులను విడుదల చేసిందని తెలిపారు.
రెండు నెలల్లో రూ.9 కోట్లకు పైగా సహాయం
ఇదే నెలలో సంక్రాంతికి ముందుగా ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు సంబంధించి రూ.5 కోట్ల బకాయిలను జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. అలాగే గత డిసెంబర్ నెలలో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలను చెల్లించినట్లు తెలిపారు.
ఈ విధంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.9 కోట్లకు పైగా నిధులను చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం అందించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు
సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని ఆమె తెలిపారు.
త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదలపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. నేతన్నల సంక్షేమానికి నిరంతరం సహకరిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: Telangana: అన్నదాతలకు తీపికబురు.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘విద్యుత్ అంబులెన్స్‌లు’
Buggana : తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా.. ఒక్కటైనా వచ్చాయా? : బుగ్గన మాస్ ట్రోలింగ్ వైరల్
