HomeAndhra PradeshCold wave : ఏపీ, తెలంగాణ గజగజ.. మరో మూడు రోజులు కొనసాగనున్న తీవ్రత.. ఎక్కడెక్కడ...

Cold wave : ఏపీ, తెలంగాణ గజగజ.. మరో మూడు రోజులు కొనసాగనున్న తీవ్రత.. ఎక్కడెక్కడ ఎంత ఉష్ణోగ్రతలంటే

Cold wave : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా మరింత బిగుస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చలివాతావరణం నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాబోయే రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ భారీగా తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి ఉదయం గంటల వరకు రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది.

రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవ్వగా, పటాన్‌చెరులో 8.2 డిగ్రీలు, మెదక్‌లో 9.3 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 11 డిగ్రీలు, రామగుండంలో 11.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

చలి తీవ్రత పెరగడంతో ఉదయం వేళల్లో వాకర్లు, జాగర్లు స్వెట్టర్లు, జాకెట్లు, మంకీ క్యాప్‌లు ధరించి పార్కులకు వెళ్తున్నారు. మరోవైపు చలి, పొగమంచు కారణంగా రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో కనుచూపు మేర కూడా వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా నల్గొండ జిల్లా చిట్యాల–చౌటుప్పల్ మధ్య ప్రాంతాల్లో భారీగా పొగమంచు కురుస్తోంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై హెవీ ఫాగ్‌ ఏర్పడటంతో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా పొగమంచు తగ్గకపోవడం గమనార్హం.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా మన్యం, ఏజెన్సీ ప్రాంతాలు చలితో గజగజ వణికిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పాడేరు జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10:30 గంటల వరకు పొగమంచు దట్టంగా ఉండటంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాలు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించాల్సి వచ్చింది.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలు, అరకులో 11 డిగ్రీలు, చింతపల్లిలో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి: Telangana Weather Update: మరో రెండు రోజులు చలి పంజా.. హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
Ice Cream : చలికాలంలో ఐస్‌క్రీమ్ తినడం: నష్టాలే ఎక్కువా? లాభాలూ ఉన్నాయా? జాగ్రత్తలు ఇవే!
Winter care : చలికాలంలో స్వెటర్లు వేసుకుని పడుకోవడం మంచిదేనా? వైద్యపరంగా ఏది సరైంది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు