Box Office: భారతీయ సినిమా ఇప్పుడు సాధారణ హిట్–ఫ్లాప్ లెక్కల దశను దాటిపోయింది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడమే లక్ష్యంగా భారీ బడ్జెట్‌లు, గ్లోబల్ స్థాయి ప్లానింగ్‌తో పాన్ ఇండియా సినిమాలు సిద్ధమవుతున్నాయి. 2026 సంవత్సరం ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఏడాదిగా మారబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వస్తున్న కొన్ని మెగా ప్రాజెక్టులు ప్రపంచ మార్కెట్‌ను షేక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ క్రేజీ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
దళపతి విజయ్ ‘జననాయగన్’ – ఫైనల్ షాట్, బిగ్ రికార్డ్?
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక హైప్ ఉన్న సినిమా ‘జననాయగన్’. విజయ్ నటిస్తున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావచ్చన్న ప్రచారం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్స్ ఉండటం ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా 1000 కోట్ల మార్కును దాటడం ఖాయమని నమ్ముతున్నారు.
‘రామాయణం’ – విజువల్ స్పెక్టకిల్‌తో బాక్సాఫీస్ సునామీ
2026లో అతిపెద్ద సినిమాల జాబితాలో ‘రామాయణం’ టాప్‌లో ఉంటుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ డ్రామాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అంతేకాదు, రావణుడి పాత్రలో యశ్ కనిపించనున్నారు. సుమారు 800 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 1000 కోట్లే కాదు, 2000 కోట్ల కలెక్షన్లను కూడా టార్గెట్ చేస్తోందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.
రజనీకాంత్ ‘జైలర్ 2’ & షారుఖ్ ఖాన్ ‘కింగ్’
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘జైలర్ 2’ 2026లో థియేటర్లను షేక్ చేయనుంది. మొదటి భాగం సాధించిన సంచలన విజయం నేపథ్యంలో, ఈ సీక్వెల్ 1000 కోట్ల క్లబ్‌లో చేరడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా కూడా భారీ యాక్షన్, ఇంటర్నేషనల్ స్థాయి మేకింగ్‌తో బాక్సాఫీస్ వద్ద పెద్ద రికార్డులే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
టాలీవుడ్ నుంచి ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ మెగా అటాక్
కోలీవుడ్, బాలీవుడ్‌లతో పాటు టాలీవుడ్ కూడా 2026 రేసులో గట్టిగా నిలబడుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాలు 1000 కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తున్నాయి.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ప్రకంపనలు సృష్టించనున్నాయని అంచనాలు ఉన్నాయి.
2026 సంవత్సరం ఇండియన్ సినిమాకు నిజంగా ఒక గోల్డెన్ ఫేజ్‌లా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ వీఎఫ్ఎక్స్, పాన్ ఇండియా కాస్టింగ్, గ్లోబల్ రిలీజ్ ప్లానింగ్‌తో వస్తున్న ఈ సినిమాలు వెయ్యి కోట్ల మార్కును దాటి కొత్త బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తాయా లేదా అనేది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ – 2026 బాక్సాఫీస్ యుద్ధం మాత్రం హాట్‌గా ఉండబోతోంది!
ఇవీ చదవండి: Sonali : చిరంజీవి–మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్లకూ వన్నె తగ్గని గ్లామర్… క్యాన్సర్‌ను జయించి నిలిచిన మగువ
Patang Movie Review : పతంగ్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
