Devon Conway : సౌతాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ Devon Conway బ్యాట్‌తో ఊచకోత కోశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కాన్వే, ఆ నిరాశను మైదానంలో తుడిచిపెట్టేశాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగిన అతడు, ఎంఐ కేప్ టౌన్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కాన్వే తన ట్రేడ్‌మార్క్ ఇన్నింగ్స్‌తో హోరెత్తించాడు. మొత్తం 64 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉండగా, మరో స్టార్ బ్యాటర్ Kane Williamson (40)తో కలిసి తొలి వికెట్‌కు 52 బంతుల్లోనే 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో డర్బన్ జట్టుకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఐపీఎల్‌లో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన కాన్వేను ఎవరూ తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో Chennai Super Kings తరఫున మెరిసిన అతడు, ఈ ఇన్నింగ్స్‌తో తన ఫామ్ ఏంటో మరోసారి చూపించాడు.
ఈ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాప్-6 బ్యాటర్లు అందరూ 20కి పైగా పరుగులు చేయడం జట్టు బ్యాటింగ్ లోతును చాటింది. ఎంఐ కేప్ టౌన్ బౌలర్లలో George Linde రెండు వికెట్లు తీసుకున్నా, పరుగుల వరదను మాత్రం ఆపలేకపోయాడు.
233 పరుగుల లక్ష్యంతో చేజ్‌కు దిగిన ఎంఐ కేప్ టౌన్ తరఫున Ryan Rickelton (113) మెరుపు సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అయినా చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో, డర్బన్ సూపర్ జెయింట్స్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ వేలంలో దక్కని గుర్తింపుకు మైదానంలో బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన కాన్వే, తన విలువను మరోసారి నిరూపించాడు. ఇటు కాన్వే మెరుపులు, అటు రికెల్టన్ సెంచరీతో అభిమానులకు పసందైన క్రికెట్ వినోదం దక్కింది.
ఇవీ చదవండి: IPL 2026 : ఇదేంది భయ్యా? ఇంత మోసమా? వేలంలో రూ.25.20 కోట్లు.. కానీ చేతికి వచ్చేది రూ.9.74 కోట్లు మాత్రమే!
IPL 2026: అత్యధిక ధర పలుకుతాడనుకున్నాడు.. కానీ ఓ చిన్న మిస్టేక్‌తో వేలంలో ఆశలకు బ్రేక్?
