Varudu Kalyani : కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ శూన్యమని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… బాధితురాలినే నిందితురాలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గానికి పాల్పడిందని మండిపడ్డారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపుల కేసులో బాధితురాలిని అరెస్టు చేయడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని.. ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అని ఆమె తేల్చి చెప్పారు.
తనకు అన్యాయం జరిగిందని ఒంటరి మహిళ పోలీసుల్ని ఆశ్రయిస్తే… వారు మాత్రం మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లో విచారణ చేయడం ముమ్మాటీకీ అధికార దుర్వినియోగమేనని స్పష్టం చేశారు. అధికార పార్టీ కార్యకర్తల్లా పచ్చ చొక్కాలు వేసుకోవడం ద్వారా… పోలీసులు తమ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళల పాలిటి శాపంగా మారిన మంత్రి సంధ్యారాణి వ్యవహారంతో, కూటమి పాలనలో మహిళలకు రక్షణలేదన్న విషయం స్పష్టమైందన్నారు.
ఇక మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజన్న సీఎం చంద్రబాబు, మహిళలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తమ కేబినెట్ సహచరి పీఏ వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఇప్పటికైనా బాధితుడుని అరెస్టు చేసి.. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపి, నిందితుడుతో పాటు ఆతడికి సహకరించిన పోలీసులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
● అధికార దుర్వినియోగానికి పరాకాష్ట..
మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపులు వ్యవహారంలో బాధితురాలినే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం రెడ్ బుక్ రాజ్యాంగానికి, అధికార దుర్వనియోగానికి పరాకాష్ట. నిందితుడుని వదిలేసి బాధితురాలినే అరెస్టు చేయడం అత్యంత దారుణం, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందనడానికి ఇదే నిదర్శనం. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నవాళ్లు బాధితులకు అండగా నిలబడతారు, నిందితులను శిక్షిస్తారు.
కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. బాధితురాలినే తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, ఆమె పైనే తిరిగి కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నిందితుడు మాత్రం నిర్భయంగా, ధైర్యంగా నెల రోజుల నుంచే బయటే తిరుగుతున్నాడు. నిందితుడు సాక్షాత్తూ స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి పీఏ గా పనిచేస్తున్నాడు. ఒక మహిళా అయి ఉండి కూడా మంత్రిగారు… ఒక బాధితురాలికి అండగా నిలబడాల్సింది పోయి తన పీఏను వెనుకేసుకుంటూ రావడం అత్యంత దురదృష్టకరం. ఈ కేసు విచారణలో పోలీసులు అడుగడుగునా మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లో పనిచేశారు.
బాధిత మహిళ గత నెలలో ఫిర్యాదు చేసిన తర్వాత… మంత్రి సంధ్యారాణి ఆ రోజు ఏం మాట్లాడారో పోలీసులు సైతం అవే మాటలు చెప్పి అరెస్టు చేశారు. అంటే మంత్రి మాటలనే పోలీసులు చెప్పారు తప్ప.. ఈ కేసులో విచారణ జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది. అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మేం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో మంత్రి సంధ్యారాణి, ఆమె పీఏ వ్యవహరించారు.
● రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట…
మీ పీఏ వేధిస్తున్నారంటూ బాధిత మహిళ తన ఆవేదనను నేరుగా మంత్రి దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో.. పోలీసులు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా ముందుకు కూడా వచ్చి తన కష్టాన్ని చెప్పుకున్నారు. బాధితురాలికి అండగా నిలబడాల్సిన మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి.. ఆ పని చేయకుండా తన పీఏకు అండగా నిలబడ్డారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం.
ఒక బాధిత మహిళ తన కష్టాన్ని ధైర్యంగా బయటకు వచ్చి… నేరుగా మంత్రికే చెప్పుకున్నా న్యాయం జరగడం లేదంటే.. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ మహిళైనా బయటకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకోవడానికి ముందుకు వస్తారా? ఈ రాష్ట్రంలో పోలీసులు ఖాకీ చొక్కాలు ధరించడం మానేసి… పచ్చ చొక్కాలు వేసుకుంటూ.. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థలుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలి. సీనియర్ ఐపీఎస్ అధికారులు, మహిళా పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి చోటు లేదా?
ఒక మహిళగా, బాధ్యతగల మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉండాల్సిన సంధ్యారాణి మహిళల పాలిట శాపంగా మారారు. ఈ రాష్ట్రంలో మహిళా హోం మంత్రిగా ఉన్నా.. ఒక బీసీ మహిళా ప్రభుత్వ ఉద్యోగికి అన్యాయం జరుగింది. ఆమెపైనా అక్రమకేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణం.
● మంత్రి సంధ్యారాణి వీటికి బదులివ్వాలి?
మంత్రి గుమ్మడి సంధ్యారాణిని నేరుగా ప్రశ్నిస్తున్నాం. మీ పీఏ సతీష్ బాధితురాలి దగ్గర డబ్బులు తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన మాట వాస్తవం కాదా? డబ్బులు అడిగితే లైంగిక వేధింపులకు గురిచేసిన మాట నిజం కాదా? డబ్బులివ్వకుండా బాధితురాలిని వేధించడంతోపాటు, అధికారం చేతిలో ఉందని ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురానికి కక్షగట్టి బదిలీ చేసిన మాట నిజం కాదా? ఈ వ్యవహారంలో మంత్రి నేరుగా లేఖ కూడా ఇచ్చారంటే… తప్పు చేసిన తన పీఏను ఆమె ఏ స్ధాయిలో సపోర్టు చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. తాను లైంగికంగా వేధించంతో పాటు, ఇతర టీడీపీ నేతల దగ్గర కూడా లొంగిపోవాలని బాధితురాలిని మంత్రి పీఏ వేధించన మాటా వాస్తవం కాదా? ఇంత దారుణం జరిగినా.. మంత్రి స్పందన చూసి రాష్ట్రంలో మహిళలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు బాధపడుతున్నారు. 164 సీట్లు ఇచ్చి గెలిపించింది మీరు బాధిత మహిళలనే అరెస్టు చేయడానికా?
● సీఎం, డిప్యూటీ సీఎం సహా ప్రభుత్వానికే సిగ్గుచేటు..
మా ప్రభుత్వ హయాంలో ఎవరైనా మహిళలను కన్నెత్తి చూసినా, చేయి వేసినా వారికి అదే ఆఖరి రోజు అన్న సీఎం చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి. మీ కేబినెట్ సహచరి పీఏ నేరుగా మహిళపై వేధింపులకు దిగితే చర్యలు లేవు సరికదా.. బాధితురాలినే నిందితురాలి చేయడం అత్యంత అమానుషం. నాలుగో సారి ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీ పాలనలో ఇలా జరగడం మీక్కూడా సిగ్గుచేటు.
మహిళలపై చేయి వేస్తే తాటతీస్తా, తోలు తీస్కా అంటూ పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ముగ్గురు పిల్లలతో ఒక ఒంటరి బాధిత మహిళ తనకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగుతున్నా.. మీరు ఎవరి తాట తీశారు? మీ అసమర్థ ప్రభుత్వంలో చివరకు బాధితురాలి తాట తీశారా? మీరు ఏం చేస్తున్నారు? పోలీసులను ఇంత దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలకే ఉపయోగిస్తున్న పరిస్ధితి అనేక సందర్భాలలో కనిపిస్తోంది. తాజాగా కదిరిలో ఓ గర్భిణీపై దాడి చేశారని ఒక వ్యక్తిని అరెస్టు చేసి… విపరీతంగా వేధించారు. అతడిని వైయస్సార్సీపీ కార్యకర్తగా భావించి వేధిస్తే.. సదరు వ్యక్తి జనసేన కార్యకర్త అని తేలింది. వైయస్సార్సీపీ కార్యకర్తగా భావించి తక్షణమే అతడ్ని అరెస్టు చేసి, వేధించారు.
ఇప్పుడు కాదని తేలడంతో మౌనంగా ఉన్నారు. ఇదే ఉత్సాహం బాధిత మహిళను బెదిరించి, వేధించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో ఎందుకు లేదు? అతడి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? టీడీపీ కార్యకర్త అయితే ఎలాంటి తప్పు చేసినా వారికి అండగా నిలబడతారా? కూటమి ప్రభుత్వంలో మేం తప్పు చేసినా మాకు శిక్షలుండవు, అరెస్టులుండవు, మంత్రులు, ఎమ్మెల్యేలు మమ్నల్ని రక్షిస్తారన్న ధైర్యంతో ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. అందుకే మహిళలమీద నిర్భయంగా అరాచకాలు తెగబడుతున్నారు.
● ఇవీ కూటమి పాలనలో అరాచకాలు…
రాప్తాడులో 14 ఏళ్ల దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తలు 6 నెలలపాటు లైంగికంగా వేధించి, గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వైయస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు నిందితులను అరెస్టు చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులకు గురైన ఒక బాధిత మహిళ.. తనకు ఏపీలో రక్షణ లేదని ఏకంగా హైదరాబాద్ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి తన గోడు వెళ్లబోసుకుంది. అయినా ఆదిమూలం మీద కేసుల్లేవు.
జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ వేధింపులకు గురైన లక్ష్మి అనే బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసినా కిరణ్ రాయల్ మీద కేసులేదు. అదే విధంగా రాజమండ్రిలో వికాస్ ఫార్మసీ విద్యార్ధిని టీడీపీ కార్యకర్త హత్య చేస్తే చర్యల్లేవు. తిరువూరులో గిరిజన మహిళను టీడీపీ నేత రమేష్ లోబర్చుకోవడానికి ప్రయత్నించిన ఆడియో వైరల్ అయితే కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. గుంటూరు తెనాలిలో రౌడీషీటర్ నవీన్ సహానా అనే దళిత యువతని కొట్టి బ్రెయిన్ డెడ్ చేసి చంపేస్తే ఏం చర్యలు తీసుకున్నారు. వైయస్.జగన్ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలబడ్డారు.
మీ టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపుల కారణంగా ఒక మహిళా వీఆర్వో ఆత్మహత్యాయత్నం చేస్తే..ఆ ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు. డీప్యూటీ సీఎం కు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో పీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళా వీఆర్వోను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు నెలనెలా మామూళ్లు ఇవ్వాలని లేదంటే పక్కలోకి రావాలని వేధిస్తే మీరు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు. దళిత సంఘాల ఆందోళన చేసేంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.
ఈ వ్యవహారాలన్నింటిలో ఏం చర్యలు తీసుకున్నారు. పోలీసులను కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి, ప్రతిపక్ష వైయస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడానికే వాడుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ వ్యవహారం. ఈ రాష్ట్రంలో మహిళల బ్రతికే హక్కును కూడా ఈ ప్రభుత్వం హరిస్తుంది. పోలీసులను ఈ స్ధాయిలో అత్యంత దారుణంగా అధికార పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు కాబట్టే కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ పనితీరు దారుణంగా 36వ స్ధానానికి దిగజారిపోయింది. వైయస్.జగన్ హయాంలో 86 అవార్డులతో అత్యుత్తమ పనితీరుని కనపర్చిన పోలీసుశాఖ కూటమి పాలనలో మాత్రం.. బీఎన్ఎస్, బీఎన్ ఎస్ ఎస్ చట్టాల అమల్లో 36 వ స్ధానానికి దిగజారింది.
● కేంద్ర నివేదికల్లోనూ దిగజారిన పోలీస్ శాఖ పనితీరు…
చంద్రబాబు సొంత సర్వేలో సైతం పోలీస్ శాఖ పనిచేయడం లేదని చెప్పారు. అయినా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదా? ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా లేఖ లో మన రాష్ట్రంలో పోలీసుశాఖ పనితీరుపై ఘాటుగా రాశారు. ఎమెర్జెన్సీ కాల్ కి దేశవ్యాప్తంగా అటెండ్ టైమ్ 18 నిమిషాలుంటే ఏపీలో మాత్రం 26 నిమిషాలు ఉంది.గతంలో వైయస్.జగన్ హయాంలో ఎమర్జెన్సీ కాల్స్ కోసం పోలీసులు 5 నిమిషాల్లో పోలీసులు స్పందించే వాళ్లు. కానీ కూటమి ప్రభుత్వంలో 26 నిమిషాలకు దిగజారి పోయిందంటే.. పోలీసులు వాళ్ల విధులను సక్రమంగా కూటమి ప్రభుత్వం నిర్వర్తించనీయడం లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ పోలీసుల్ని టీడీపీ నేతలు వాళ్ల కక్ష సాధింపు చర్యలకే వాడుతున్నారు.
వీళ్ల కక్ష సాధింపు రాజకీయాలు ఏ స్థాయికి చేరాయంటే.. రాష్ట్రంలో భారీ ఎత్తున కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ తంబల్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, ఆ పార్టీ నేతలు పట్టుబడితే తిరిగి వైయస్సార్సీపీ నేతలపై ఆ కేసును రుద్దారు. మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బహిరంగంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తుంటే…పోలీసులు, మంత్రి ఏం చేస్తున్నట్టు?. ఏకంగా 283 మంది పేకాడ ఆడుతూ దొరికిపోయారంటే ఎంత బరితెగింపు.
హోంమంత్రి నివాసం ఉంటున్న భీమిలిలో పిక్నిక్ ల పేరుతో బహిరంగంగా పేకాట ఆడుతున్నారు. మీకు ప్రజలు 164 సీట్లు ఇచ్చి గెలిపించింది ఎందుకు? రాష్ట్రంలో ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే… విచ్చలవిడి మద్యం, పేకాట క్లబ్బులు, కల్తీ మద్యం , గంజాయి, డ్రగ్స్, నాటు సారా గా మార్చివేశారు.
మంత్రి పీఏ బాధితురాలు నవంబరు నెలలోనే పోలీసులకు చేసిన ఫిర్యాదులో.. బాధితురాలి స్టేట్ మెంట్ కింద క్లియర్ గా ఎలా వేధించాడో ఫిర్యాదు చేస్తే వాటిని ఆధారంగా చేసుకుని కేసు పెట్టకుండా.. స్టేషన్ బెయిల్ వచ్చేలా చిన్న, చిన్న సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. మరలా తిరిగి టీడీపీ నేతలతో బాధితురాలిపై ఫిర్యాదు చేశారంటే.. టీడీపీ నేతలు ఎంత బరితెగించి ఉన్నారన్నది స్పష్టమవుతోంది. పోలీసులు దయచేసి పసుపుచొక్కాలు విడనాడాలి.
ఖాకీ చొక్కాలు వేసుకున్న పోలీసులలా వ్యవహరించాలి. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. బాధిత మహిళలకు న్యాయం చేయాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిందితుడితో పాటు, అతడికి సహకరించిన పోలీసులకూ చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి: CII Summit : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. పెట్టుబడులకు కొత్త తలుపులు
MLC Varudu Kalyani : సభ్యసమాజం సిగ్గుపడేలా కుప్పంలో మహిళపై దాష్టీకం
