Amaravati : రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులను రాష్ట్ర మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మొత్తం ఏడు భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని, అందులో హైకోర్టు భవనం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ Norman Foster and Partners రూపొందించిన డిజైన్ ప్రకారం ఈరోజు హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభించామని వెల్లడించారు.
హైకోర్టు భవనం B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ స్ట్రక్చర్‌గా నిర్మించనున్నట్లు తెలిపారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాళ్లతో ఈ భవనం రూపుదిద్దుకోనుందని చెప్పారు. 2వ, 4వ, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉండగా, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
భవన నిర్మాణానికి సుమారు 45,000 టన్నుల స్టీల్ వినియోగించనున్నట్లు పేర్కొన్న మంత్రి, 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అమరావతి పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు.
అమరావతిని ఒక ప్రణాళికాబద్ధమైన, న్యాయ పరిపాలనకు ప్రతీకగా నిలిచే రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు.
ఇవీ చదవండి: Amaravati : అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు
Chandrababu Naidu: స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా అమరావతిలో అమరజీవి స్మృతివనం : చంద్రబాబు
