Andhra Pradesh : రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలనే లక్ష్యంతో Government of Andhra Pradesh ఏకీకృత కుటుంబ సర్వే (UFS)ను ప్రారంభిస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సకాలంలో అందేలా చేయడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.
డిసెంబర్ చివరి వారం నుంచి ఈ ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాల సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్థితిని ధృవీకరించి, అవసరమైన వివరాలను అక్కడికక్కడే నవీకరించనున్నారు.
అర్హులెవ్వరూ తప్పిపోకుండా పకడ్బందీగా..
ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి అర్హత ఉన్న ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా చూడడమే ఈ సర్వే లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఖచ్చితమైన, తాజా కుటుంబ డేటా అందుబాటులో ఉంటే ప్రభుత్వ ధృవపత్రాలు, అనుమతుల జారీ మరింత వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. అలాగే, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య తిరిగి తిరిగి ధృవీకరణ అవసరం కూడా తగ్గనుంది.
డేటా క్లారిటీపై ఫోకస్
ఈ సర్వే ద్వారా ప్రభుత్వ సమాచారం ఖచ్చితత్వం, సంపూర్ణత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటి వద్దే వివరాలను నవీకరించడం వల్ల ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో కొత్త సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు కూడా ఈ డేటా కీలకంగా ఉపయోగపడనుంది.
మొబైల్ యాప్‌తో
ఏకీకృత కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను ముందుగానే పొందుపరచి, ప్రతి కుటుంబానికి పట్టే సమయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సమాచారం త్వరగా, ఖచ్చితంగా నమోదు కానుంది.
ఆధార్‌తో సురక్షితంగా
ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ ద్వారా కుటుంబ సభ్యుల గుర్తింపును సురక్షితంగా ధృవీకరించనున్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.
పారదర్శక పాలన దిశగా మరో అడుగు
పాలనలో పారదర్శకతను పెంచడం, ప్రజాకేంద్రీకృత సేవల పంపిణీకి బలమైన పునాది వేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు సర్వేకు పూర్తి సహకారం అందించి సరైన సమాచారం ఇస్తే, ప్రభుత్వ సేవలు మరింత సజావుగా, వేగంగా అందే అవకాశం ఉంటుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: Andhra Pradesh: అమాయకంగా కనిపిస్తారు… కానీ దొంగతనాల్లో మామూలు వారు కారు!
Andhra Pradesh: మల్లవరం క్షేత్రదర్శనంతో సంతానప్రాప్తి ఖాయం?
