YS Jagan : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు పోతోందని, ఆ కాలేజీలు తీసుకున్న వాళ్లను తాము వచ్చిన తర్వాత జైళ్లలో పెడతామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగిసింది. ఆయా పత్రాల వాహనాలు నేడు తాడేపల్లికి చేరుకున్నాయి. వాటిని జగన్ ఈ ఉదయం జెండా ఊపి గవర్నర్ కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
‘‘కోటి సంతకాల సేకరణలో మీ కృషి చాలా ఉంది అని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ అభినందించడం కోసం ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి మొదలు పెడితే.. ఎమ్మెల్యే, సమన్వయకర్తల దగ్గర నుంచి, రీజనల్ కోఆర్డినేటర్ల దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, లోయెస్ట్ లెవల్లో గ్రామస్థాయిలో ఉన్న కేడర్.. నిజంగా ఇంత కమిటెడ్ గా ఒక ఉద్యమాన్ని మనసా వాచా కర్మణా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమాన్ని, ఈ కీర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే గళాన్ని కచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమంచేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు.
నిజంగా అందరికీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
దాదాపుగా కోటీ 4 లక్షల 11 వేల 136 సంతకాలు.. ప్రతి జిల్లా నుంచి బయల్దేరిన ఈ నంబర్, మన దగ్గరకు వచ్చిన నంబర్.. ఈ రోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఇప్పటికే బహుశా చూపించే కార్యక్రమం మొదలైంది. బండ్లను ఫ్లాగ్ ఆఫ్ చేశాం, ఆ బండ్లన్నీ గవర్నర్ గారి దగ్గరకు చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ ను చూస్తుంటారు. దాదాపుగా కోటీ 4 లక్షల 11 వేల 136 సంతకాలు చేసిన పత్రాలు.. ఈరోజు నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం.
చంద్రబాబునాయుడు గారు తను ఈ మధ్య కాలంలో నిన్ననే కలెక్టర్ల సదస్సులో తన నోట్లోంచి వచ్చిన మాటలు ఆశ్చర్యం కలిగించేవి.. ప్రజల్లో తన గ్రాఫ్ పడిపోతోంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదని చెబుతున్నారు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామీ.. నీ గ్రాఫ్ బాగలేక పడిపోతోంది అనేది అర్థం కావడం లేదు. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే ఒకటీ మంచి జరగలేదు.
చంద్రబాబు నాయుడు గారి ఈ 18 నెలల కాలంలో.. ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ మార్చిలో. మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ మార్చిలో. రెండు బడ్జెట్లు అయిపోయాయి, అంటే రెండు సంవత్సరాలు అయిపోయాయి. దాదాపు రెండు సంవత్సరాలు అయిపోవస్తున్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే బోడి సున్నా కనిపిస్తుంది. అంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములూ రద్దయిపోయాయి.
మన ప్రభుత్వ హయాంలో ఠంచనుగా ప్రతి నెలా బహుశా ఏ ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగి ఉండదేమో. ఏ నెల ఏ స్కీము ఇవ్వబోతున్నాము, ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాము అని ముందుగానే ప్రజలకు క్యాలెండర్ ఇచ్చి, ఆ క్యాలెండర్ ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడుగారు అవన్నీ చేయడమే కాకుండా, ఏముందీ జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు, ఇంట్లో ముసలోళ్లయినా చేయొచ్చు అన్నాడు.
అవన్నీ చేయడమే కాకుండా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి.. ఈ రెండేళ్లు కావస్తున్న సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిందేమిటి అంటే గతంలో జరిగే అన్ని పథకాలూ రద్దు కావడం, సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోవడం, నిర్వీర్యమైపోవడం. ఈ మూడూ చూశాం మనం.
అందుకే చంద్రబాబునాయుడు గ్రాఫ్ ఎంత లేపినా గ్రాఫ్ ఈరోజు పైకి లేవడం లేదు. ఎందుకంటే అన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలని ప్రజలకు అర్థమైపోతోంది. కనిపిస్తోంది కాబట్టి. అసలు మొట్ట మొదటి సారిగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరుగైపోతోంది. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ తో అన్ని రకాలుగా మోసాలు. మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకు ఉంది అనేది ఒకసారి గమనిస్తే.. కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి.
దేశమంతా చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలూ చూస్తున్నాం. ప్రభుత్వం స్కూళ్లు ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? ప్రభుత్వం ఎందుకు హాస్పిటళ్లు నడుపుతుంది? ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. అది దశాబ్దాలుగా.. ఈపొద్దు కాదు నేను చెప్పేది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని చూస్తున్నాం, ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తున్నాం. ప్రభుత్వ పని ఏమిటంటే.. ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్లు నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్స్ నడకపపోతే, ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేదేమిటి? ప్రైవేట్ ఎక్స్ ప్లాయిటేషన్ అనేది దోచేసే కార్యక్రమం జరుగుతుంది. పేద మధ్య తరగతి ప్రజలు పూర్తిగా ఏదీ కూడా విద్య, వైద్యం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గానీ ఇవేవీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయ్యి నడిపే కార్యక్రమం చేస్తుంది. ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు.
ఒకవైపున అన్ని వ్యవస్థలూ ఈరోజు చూస్తే కుప్పకూలిపోయిన పరిస్థితులే. గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు నడుపుతోంది అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబునాయుడు తప్ప ప్రపంచంలో ఎవడూ ఉండడు. గవర్నమెంట్ హాస్పిటళ్లు ఎందుకు నడుపుతోంది అనుకునే మనిషి చంద్రబాబు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడు. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి.
చంద్రబాబునాయుడు వచ్చి ఉంటే ఆర్టీసీ కూడా ఈపాటికి అమ్మేసుండేవాడు. మొన్న ఆశ్చర్యకరంగా ఒకమాట విన్నా. పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం చేస్తానన్నాడు. అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడంటే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్ ప్లాయిటేషన్ ఉండకూడదు అని. స్కూళ్లు ఎందుకు గవర్నమెంట్ నడుపుతుంది అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్ ప్లాయిటేషన్ ఉండకూడదు అని, హాస్పిటళ్లు గవర్నమెంట్ ఎందుకు నడుపుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్ ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందంటే కారణాలున్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పరంగా పేదలు ఇబ్బంది పడకూడదు అని.
అలాంటిది ఈరోజు అన్ని వ్యవస్థలూ తిరోగమనమే. ఇంతకు ముందు అమలవుతున్న పథకాలన్నీ రద్దు. నువ్వు చేస్తున్నవేమో మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు, కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డపేరు వస్తోందని నువ్వు చెప్పడం అంటే అసలు వాళ్లంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. ఆ స్థాయిలో ఈ మనిషి చంద్రబాబునాయుడు బుర్ర పని చేయడం లేదు.
నిజంగా ఈరోజు దాదాపుగా కోటీ 4 లక్షల 11 వేల 136 సంతకాలు.. ఇదొక హిస్టరీ. నిజంగా ప్రతి సంతకం కూడా ఎక్కడా పొరపాటు జరగకూడదని, ప్రతి సంతకం సిన్సియారిటీతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం.
అక్టోబర్ 7న ప్రజలకు ఉద్యమం గురించి, కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించా. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలో, పట్టణంలో, వార్డులో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతున్నది ఏమిటి అని చెప్పి సవివరంగా ఎక్స్ ప్లెయిన్ చేస్తూ, ప్రజల్ని ఈ సంతకాల విషయంలో భాగస్వాములను చేస్తూ, ప్రజలు ఏరకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ప్రజలు ఎలా నష్టపోతారో అని సవివరంగా ప్రజలకు ఎక్స్ ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది.
నిజంగా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు, ఆ సీట్ల వల్ల లోకల్ గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారన్నది ఒక యాస్పెక్ట్ అయితే, ప్రైవేటుకన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకొచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక యాస్పెక్ట్ అయితే, అన్నింటికన్నా ఇంకా పెద్ద యాస్పెక్ట్ ఏమింటంటే.. ఈ మెడికల్ కాలేజీల వల్ల వీటితోపాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటళ్లు అందుబాటులోకి రావడం.. అంటే మా కడప అయితే ఉదాహరణకు.. ఏది తీసుకున్నా ఇదే మాదిగా ఉంటుంది. ఒక జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. అంటే ఒక 70 కిలోమీటర్లు ఇటు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలూ కనెక్ట్ అవుతాయి.
ఒక మెడికల్ కాలేజీ వస్తే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబులిటీకి వస్తే, ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ ప్లాయిటేషన్ అన్నది పూర్తిగా జీరో అయిపోతుంది. రేప్పొద్దున ఎవరూ ప్రైవేట్ ఆస్పత్రికిపోడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసిపెడుతుంటే రేప్పొద్దున ఎవడూ ప్రైవేట్ హాస్పిటల్ కు పోడు. నువ్వు ఏదో రీజనబుల్ గా చార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప నువ్వు రూ.2 లక్షలు, రూ.4 లక్షలు అంటే ఎవడొస్తాడు? నీ దగ్గరకు పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో, మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్లు, లెక్చరర్లు, మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్లు.. వాళ్లు బ్రహ్మాండగా ఫ్రీగా ట్రీట్ చేస్తుంటే నీ దగ్గరకు ఎందుకొస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ ప్లాయిటేషన్ కు పూర్తిగా చెక్ పడే కార్యక్రమం.
ఈ వివరాలన్నీ కూడా సవివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాల్లో ఎక్స్ ప్లెయిన్ చేస్తూ, ప్రజల్ని భాగస్వాములను చేస్తూ వారి సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా వచ్చి పేపర్ మీద వాళ్ల సంతకం పెట్టి వాళ్ల ఫోన్ నంబర్ కూడా రాసి ఏ మాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా కోటీ 4 లక్షల 11 వేల 136 మంది పత్రాలు వాళ్ల సంతకాలు, ఫోన్ నంబర్ తో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం, ప్రభుత్వం మెడలు వంచైనా సరే.. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రెజర్ తీసుకుని వచ్చేదాని కోసం ప్రజలు ధైర్యంగా వచ్చి సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమం అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగింది. నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాం. మళ్లీ ఈనెల 10వ తేదీన మళ్లీ 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్లీ ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రాల్లో కూడా ఇదేరకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రాల నుంచి ఈ బండ్లు మనదగ్గరకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్లీ మనం ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరకు పంపించడం, ఆయనకు చూపించడం కోసం పంపిస్తున్నాం.
గరవ్నర్ గారికి ఒక్కసారి ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోటీ 4 లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం, సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరెప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయని కోర్టులో అఫిడవిట్ కూడా వేయడం జరుగుతుంది.
ఇంతటితో చంద్రబాబుకు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు చర్మం కొంచం మందం. మీకు గుర్తుండే ఉంటుంది. పూర్వకాలంలో నా చిన్నప్పుడు ఎన్.జనార్ధన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇచ్చారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు నేనే చాలా చిన్నపిల్లోడిని. ఒక కాలేజ్. ఈరోజు ఈయనకు సిగ్గులేదో ఇంకొకటి లేదో.. ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ నేను గవర్నమెంట్ ఆస్తుల్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానిక ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు. చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కాము ఏమిటో తెలుసా.. నువ్వు ప్రైవేట్ వాళ్లకు కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేటు కాలేజీల వాళ్లు నడిపేటప్పుడు వాళ్ల జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కాము.
అంటే నెలకు ఒక్కో కాలేజీలో కనీసం రూ.5కోట్లు జీతం. మినిమం. అంటే సంవత్సరానికి ఒక్కో కాలేజీకి రూ.60 కోట్లు. రెండేళ్లపాటు కనీసం అంటే రూ.120 కాలేజీలు. ఒక్కో కాలేజీకి ఎదురు ఇస్తున్నాడు. చెనిక్కాయలకు బెల్లాలకు కాలేజీలు కట్టబెట్టడమే కాక, మళ్లా ఎదురు రూ.120 కోట్లు ఇస్తున్నాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా?
మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఎక్కడైనా చంద్రబాబు వినకుండా దీనికి ముందుకు తీసుకుని పోతే మాత్రం ఆతర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు తిరక్క ముందే అంతా జైళ్లలో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్నోళ్లు మాత్రం. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తున్నా కూడా ప్రజలు దీని వల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు ప్రైవేటుకన్నా చాలా తక్కువ ధరకే మెడికల్ సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏ మాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న ఈ తీరుకు చంద్రబాబుకు గట్టి గుణపాఠం మాత్రం కచ్చితంగా తగులుతుంది.
మరీ ముఖ్యంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి మీ ద్వారా ప్రతి కార్యకర్తకూ,ప్రతి గ్రామంలోనూ కూడా అభినందనలు తెలియజేయడం కోసం మిమ్మల్నందరినీ ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ గారి దగ్గరకు పోయే కార్యక్రమంలో అందరికీ వాళ్లు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి 40 మందికి మాత్రమే వాళ్లు పర్మిషన్ ఇచ్చారు. ఆ 40 మంది జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే అక్కడికి సరిపోతుంది. కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి పోయి జరుగుతున్న విగ్రహానికి అంబేద్కర్ గారి పాదాల చెంతనో, విగ్రహం చెంతనో.. వాళ్లు ఎంత దూరం పంపిస్తారో నాకు తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా అన్యాయమైన ప్రభుత్వం కాబట్టి.. అంబేద్కర్ గారిని దర్శించుకుని ఆయనకు కూడా ఈ జరుగుతున్న అన్యాయం కాపీని అక్కడ పెట్టి అటు నుంచి అటే 40 మంది గవర్నర్ గారి దగ్గరకు పోయే కార్యక్రమం చేస్తాం.
అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరకు ఒక 300 మీటర్లు ఉంటుంది. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు అందరం పోదాం. అక్కడ ఈ విన్నపాన్ని పెట్టే కార్యక్రమం కూడా అందరం చేద్దాం. దాని తర్వాత ఎవరికైతే పర్మిషన్ ఉందో వాళ్లు, నేను మాత్రం అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరకు పోయే కార్యక్రమం చేస్తాం. అక్కడికి ఈ ఘట్టం ఇంత వరకు పూర్తి అవుతుంది. దాని తర్వాత కోర్టుల్లో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈలోపు చంద్రబాబునాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ముందుకు అడుగులు వేసే కార్యక్రమం చేస్తుంటే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రొటెస్ట్ కార్యక్రమంలో భాగంగా మళ్లీ మనం ప్రజల మధ్యన నిల్చుని ఉద్యమాలు చేసే కార్యక్రమం కొనసాగుతుందని జగన్ స్పష్టీకరించారు.
ఇవీ చదవండి: YS Jagan : జోజినగర్ ఇళ్లు కూల్చివేతపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్ డిమాండ్
Vijayawada : రేపు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన.. జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులకు పరామర్శ
