HomeInternationalPakistan Water Crisis : పాకిస్తాన్‌కు డబుల్ షాక్.. ఇటు సింధు జలాలు, అటు కునార్...

Pakistan Water Crisis : పాకిస్తాన్‌కు డబుల్ షాక్.. ఇటు సింధు జలాలు, అటు కునార్ నది నీటిని మళ్లించిన అప్ఘనిస్తాన్!

Pakistan Water Crisis : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్‌కు నీటి సరఫరాను నిలిపివేయడంతో, ఆ దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కునార్ నది జలాలపై కీలక నిర్ణయం తీసుకోవడం పాకిస్తాన్‌లో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసేలా కనిపిస్తోంది.

కునార్ నది నీటిని నంగర్‌హార్ ప్రావిన్స్‌కు మళ్లించే ప్రణాళికకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చేరే నది ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఆర్థిక కమిషన్ సాంకేతిక కమిటీ కునార్ నది నుంచి నంగర్‌హార్‌లోని దారుంటా ఆనకట్టకు నీటిని మళ్లించే ప్రతిపాదనను చర్చించి ఆమోదించింది. ఈ ప్రతిపాదనను తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్‌కు పంపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అమలైతే నంగర్‌హార్ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు నీటి కొరత సమస్య కొంతవరకు తీరుతుందని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.

అయితే దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నీటిపారుదల, తాగునీరు, జలవిద్యుత్ అవసరాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దాదాపు 500 కిలోమీటర్ల పొడవు కలిగిన కునార్ నది, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ జిల్లాలో హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఉద్భవిస్తుంది. అనంతరం ఇది దక్షిణంగా ప్రవహిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్, నంగర్‌హార్ ప్రావిన్సుల గుండా వెళ్లి కాబూల్ నదిలో కలుస్తుంది. ఈ నది పాకిస్తాన్‌కు ముఖ్యమైన నదుల్లో ఒకటిగా ఉండటంతో పాటు, అక్కడి మారుమూల ప్రాంతాలకు జీవనాధారంగా ఉంది.

కునార్ నదిపై ఆనకట్ట నిర్మాణం జరిగితే, పాకిస్తాన్‌లో ఇప్పటికే సింధు నది నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో భారీ దెబ్బగా మారుతుందని అంచనా. ముఖ్యంగా వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత్–పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం (IWT) లాగా, పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య కునార్ నది జలాలపై ఎలాంటి అధికారిక ఒప్పందం లేదు. దీనివల్ల తాలిబన్ల నిర్ణయాన్ని ఆపేందుకు ఇస్లామాబాద్ వద్ద తక్షణ మార్గం లేకుండా పోయింది. ఈ పరిణామాలు పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాన్ని పెంచుతున్నాయి.

ఇవీ చదవండి: Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా? కీలక సమాచారం వెల్లడించిన సోదరి ఉజ్మా ఖానుమ్
Modi Trump : ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్.. భారత్-పాక్ యుద్ధ విరమణపై వివాదం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు