Digital Arrest : ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల ముఠాకు తిరుపతిలో SBI బ్యాంక్ సిబ్బంది గట్టి షాక్ ఇచ్చారు. నకిలీ CBI అధికారి పేరుతో ఒక రిటైర్డ్ టీచర్‌ను బెదిరించి భారీ మొత్తాన్ని కాజేయాలని ప్రయత్నించిన సైబర్ మోసాన్ని బ్యాంక్ అధికారుల అప్రమత్తత బట్టబయలు చేసింది.
తిరుపతి నగరంలోని SVU క్యాంపస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 66 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, తాము CBI అధికారులు అని చెప్పుకుని ఫోన్ చేశారు. ఆయన ఫోన్ నంబర్ నుంచి బెంగళూరులో మహిళలకు అనుచిత సందేశాలు పంపించారని, దీనిపై FIR నమోదైందని బెదిరించారు. వెంటనే బెంగళూరుకు రావాలని చెప్పడంతో పాటు మానసిక ఒత్తిడికి గురిచేశారు.
ఆ తర్వాత వీడియో కాల్ చేసి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుని మాట్లాడాలని ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ‘గుర్తింపు మెసేజ్’ పంపాలని, విచారణ పేరుతో బ్యాంక్ ఖాతా వివరాలు వెల్లడించాలని చెప్పి తీవ్ర భయాందోళనలకు గురి చేశారు.
తాను నిర్దోషినని నిరూపించుకోవాలంటే డబ్బులు డిపాజిట్ చేయాల్సిందేనని నమ్మబలికిన సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మిన రిటైర్డ్ టీచర్, ఇప్పటికే రూ.40 లక్షలు వివిధ ఖాతాలకు బదిలీ చేశాడు. అనంతరం మరింత మొత్తాన్ని RTGS ద్వారా పంపించేందుకు తిరుపతిలోని ఇస్కాన్ రోడ్ SBI బ్రాంచ్‌కు చేరుకున్నాడు.
ఇతర రాష్ట్రాల ఖాతాలకు ఇంత పెద్ద మొత్తాన్ని బదిలీ చేయడానికి గల కారణంపై అనుమానం వ్యక్తం చేసిన SBI అధికారులు లీలాకృష్ణ, కృష్ణారెడ్డి ఖాతాదారుడిని ప్రశ్నించారు. మొదట నిజం చెప్పేందుకు వెనుకంజ వేసినా, అతడి ప్రవర్తనను గమనించిన అధికారులు ఇది పక్కా డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం అని గుర్తించారు.
వెంటనే లావాదేవీలను నిలిపివేసిన బ్యాంక్ అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంక్ అధికారుల సమయస్ఫూర్తి, అప్రమత్తతతో మరింత భారీ నష్టం జరగకుండా తప్పింది.
ఈ ఘటనలో ప్రో-యాక్టివ్‌గా వ్యవహరించిన SBI అధికారులను SVU క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ సత్కరించి అభినందించారు.
‘డిజిటల్ అరెస్ట్’ అనేది పూర్తిగా నకిలీ
డిజిటల్ అరెస్ట్ అనే పదం పూర్తిగా నకిలీదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. CBI, ED, పోలీసులు లేదా కోర్టులు ఎప్పుడూ WhatsApp వీడియో కాల్ ద్వారా విచారణ జరపవని తెలిపారు.
OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ATM PIN, ఆధార్, PAN వంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. తెలియని వ్యక్తుల సూచనల మేరకు RTGS, IMPS, UPI ద్వారా డబ్బులు పంపవద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు.
ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే కాల్ కట్ చేసి కుటుంబ సభ్యులకు, బ్యాంక్ సిబ్బందికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్ మోసం అనుమానం ఉంటే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా http://www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: Digital Market : డిజిటల్ మార్కెట్ల నియంత్రణ.. కేంద్రానికి స్టార్టప్ వ్యవస్థాపకుల లేఖ
CNAP : ప్రభుత్వ ట్రూ కాలర్ కమింగ్.. సైబర్ మోసగాళ్లకు టెక్నాలజీతో చెక్!
