CNAP : మొబైల్ ఫోన్లు కొత్తగా అందుబాటులోకి వచ్చిన రోజుల్లో ఫోన్ చేసింది ఎవరు అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ వచ్చాయి. అందులో ముఖ్యమైనది ట్రూ కాలర్. ఎక్కువ మంది ఒక నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేస్తారో, అదే పేరు మన స్క్రీన్‌పై కనిపించేలా ఈ యాప్ పనిచేస్తుంది.
ఇటీవల జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు కూడా ఇన్‌బిల్ట్ కాలర్ ఐడీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అలాగే సామ్‌సంగ్ వంటి మొబైల్ తయారీ సంస్థలు ఫోన్‌లోనే కాలర్ ఐడీ ఫీచర్‌ను అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ 100 శాతం నమ్మదగినవిగా మారలేదు.
ఈ లోపాన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రకరకాల ఫోన్ నంబర్లతో కాల్స్ చేసి, ట్రూ కాలర్‌లో పోలీస్ స్టేషన్, ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి, సీబీఐ, సీఐడీ, ప్రభుత్వ కార్యాలయాలు, ‘డిజిటల్ అరెస్ట్’ వంటి పేర్లతో రిజిస్టర్ చేసుకుని ప్రజలను మోసగిస్తున్నారు. ట్రూ కాలర్‌లో ‘వెరిఫైడ్ నేమ్’ కనిపించడంతో చాలా మంది అమాయకంగా నమ్మి కోట్లు పోగొట్టుకుంటున్నారు.
ఈ సమస్యను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. దీంతో ఇప్పుడు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డు కొనుగోలు చేసే సమయంలో ఏ ఆధార్ కార్డు ఇస్తామో, అందులో ఉన్న పేరు ఇక నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు స్క్రీన్‌పై నంబర్ స్థానంలో కనిపించనుంది.
ఈ కొత్త విధానాన్ని CNAP (Calling Name Presentation) పేరుతో అమలు చేయనున్నారు. 2026 మార్చి నుంచి ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ మార్పులకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేయాలని అన్ని టెలికాం ఆపరేటర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా అన్ని మొబైల్స్‌లో అప్‌డేట్ అవుతుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారో స్పష్టంగా పేరు కనిపించడంతో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే యూజర్లకు మరింత భద్రత, పారదర్శకత, ప్రైవసీ అందించడం కూడా దీని ప్రధాన లక్ష్యం.
అయితే పేరు చూపించకుండా కేవలం మొబైల్ నంబర్ మాత్రమే డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించనుంది.
ఇవీ చదవండి: Call Merging Scam: ఫోన్‌కి వచ్చే ఈ స్కాం కాల్‌తో మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ.. జాగ్రత్త తప్పనిసరి!
Vizag crime : విశాఖ పెందుర్తి: దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కాల్చి చంపిన కోడలు లలిత.. షాకింగ్!
