HomeTelanganaTelangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..

Telangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..

Telangana Crime : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలంలో చోటుచేసుకుంది. అక్క వరుసయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని, ఆమె భర్త హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

యాదాద్రి జిల్లా గుండాల మండలం బుర్జుబావి గ్రామానికి చెందిన మహిళకు, పదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేశ్యగిరి గ్రామానికి చెందిన ఏనుగుల బాలనర్సయ్యతో వివాహమైంది. జీవనోపాధి కోసం బాలనర్సయ్య హైదరాబాద్‌కు వెళ్లి భార్యతో కలిసి జవహర్ నగర్‌లో నివసిస్తూ టైల్స్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

అయితే బుర్జుబావి గ్రామానికి చెందిన గడ్డం దావీదు జులాయిగా తిరుగుతూ, వరుసకు సోదరి అయిన బాలనర్సయ్య భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాలనర్సయ్య భార్యను తీవ్రంగా మందలించడంతో పాటు, బంధువులు కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.

కొంతకాలం దావీదుతో కలిసి ఆమె వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. అనంతరం భర్త, కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఒప్పించి తిరిగి బుర్జుబావికి తీసుకొచ్చారు. ఈ సమయంలో బాలనర్సయ్య కూడా అత్తగారి ఊరైన బుర్జుబావిలోనే ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, దావీదు గ్రామానికి రావడం మానేశాడు. అయితే ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చాడని తెలిసిన బాలనర్సయ్య, దావీదును తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆగ్రహానికి లోనైన బాలనర్సయ్య, తన వెంట తెచ్చుకున్న కత్తితో దావీదును పొడిచాడు. కిందపడిన దావీదును బాలనర్సయ్యతో పాటు మహిళా సోదరుడు వంశీలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో దావీదు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుండాల ఎస్సై తేజంరెడ్డి తెలిపారు. హత్యకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి: Vizag crime : విశాఖ పెందుర్తి: దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కాల్చి చంపిన కోడలు లలిత.. షాకింగ్!
Telangana Crime : మామూలోడు కాదు.. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్‌ రౌడీషీటర్‌ సూరి మళ్లీ పోలీసుల వలలో!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు