HomeTelanganaHarish Rao : బీఆర్ఎస్ ప‌గ్గాలు తీసుకోవాలని హ‌రీష్ రావుపై పెరుగుతున్న ఒత్తిడి?

Harish Rao : బీఆర్ఎస్ ప‌గ్గాలు తీసుకోవాలని హ‌రీష్ రావుపై పెరుగుతున్న ఒత్తిడి?

Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాలు చేజిక్కించుకోవాల‌ని మాజీ మంత్రి హరీష్ రావుపై ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన బీఆర్ఎస్ సీనియ‌ర్‌ నేత‌లు ఒత్తిడి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో హ‌రీష్ రావు ఆ దిశ‌గా పావులుక‌దుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. పార్టీలో కేసీఆర్‌కు హ‌రీష్ రావే ప్ర‌త్యామ్నాయం అని ఓ వ‌ర్గం బ‌లంగా వాదిస్తోంది. కేటీఆర్‌కు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవ‌ని, ఆయ‌న పార్టీని న‌డ‌ప‌లేర‌ని బీఆర్ఎస్‌లోని సీనియ‌ర్లు భావిస్తున్నారు. పార్టీలో కేటీఆర్‌ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించేది లేద‌ని వారు తేల్చిచెబుతున్నారు.

సిరిసిల్ల‌లోనే గెలిపించ‌లేక‌పోయారు..
దీనికి కార‌ణాలు కూడా లేక‌పోలేదు. కేటీఆర్ నాయ‌క‌త్వంలో ఇటీవ‌ల‌ పార్టీ ప్ర‌తి ఎన్నిక‌లో ఓడిపోయింద‌ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌, అలాగే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింద‌ని వివ‌రిస్తున్నారు. ఇక కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ సిరిసిల్లలోని మెజారిటీ గ్రామ పంచాయ‌తీల్లో కాంగ్రెస్ స‌త్తాచాటింద‌ని ఉదాహ‌రిస్తున్నారు. కేటీఆర్‌కు పార్టీని న‌డిపే స‌త్తా లేద‌న‌డానికి ఈ ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌ని హ‌రీష్ రావు వ‌ర్గం వాదిస్తోంది. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌ను కేటీఆర్ గెలిపించుకోలేక‌పోయార‌ని, ఇక ఆయ‌న ఆధ్వ‌ర్యంలో పార్టీ న‌డ‌వడం క‌ష్ట‌మ‌ని సీనియ‌ర్లు గుస‌గుసలాడుతున్నారు.

హ‌రీష్ రావుతో సీనియ‌ర్ల ర‌హ‌స్య భేటీ..!
మ‌రోవైపు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా సిద్దిపేట‌లో హ‌రీష్ రావు మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోగ‌లిగార‌ని, జిల్లాలో 508 గ్రామ పంచాయ‌తీలు ఉంటే అందులో 300పైచిలుకు పంచాయ‌తీల్లో బీఆర్ఎస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌ను హ‌రీష్ గెలిపించుకోగ‌లిగార‌ని గుర్తు చేస్తున్నారు. ఇదే ఆయ‌న బ‌ల‌మైన‌ నాయ‌క‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ బీఆర్ఎస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

బీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి పెరుగుతున్న వేళ‌, గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ ఫలితాల్లో బీఆర్ఎస్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో కేటీఆర్ నాయ‌క‌త్వంపై నేత‌లు పెద‌వి విరుస్తున్నారు. కేటీఆర్‌పై అసంతృప్తిగా ఉన్న సీనియ‌ర్లు హ‌రీష్ రావుతో ఇటీవ‌ల ర‌హ‌స్యంగా భేటీ అయిన‌ట్టు తెలంగాణ భ‌వ‌న్‌లో చ‌ర్చ న‌డుస్తోంది. పార్టీ ప‌గ్గాల‌ను చేజిక్కించుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని, సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కేటీఆర్ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోలేక‌పోయార‌ని, ఇక పార్టీని ముందుండు న‌డ‌పాల‌ని వారంద‌రూ హ‌రీష్ రావును కోరిన‌ట్టు స‌మాచారం.

ఇక హ్యాండ్స్ అప్ చేయాల్సిందే..
బీఆర్ఎస్ ప‌గ్గాల‌ను కేసీఆర్ నుంచి చేజిక్కించుకొనే విష‌య‌మై సీనియ‌ర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేప‌థ్యంలో హ‌రీష్ రావు కూడా ఆలోచ‌న‌ల్లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. కేటీఆర్ గ‌నుక పార్టీని నడిపితే అంద‌రం మునుగుతామ‌నే భావ‌న‌లో సీనియ‌ర్లు ఉన్న‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ద‌క్షిణ తెలంగాణ‌లో పార్టీ క‌నుమ‌రుగైంద‌ని, కేటీఆర్‌ను గ‌నుక కొన‌సాగిస్తే ఇక కొంత‌మేర బ‌లంగా ఉన్న‌ ఉత్త‌ర తెలంగాణ‌లో కూడా బీఆర్ఎస్ హ్యాండ్స్ అప్ చేయాల్సి ఉంటుంద‌ని సీనియ‌ర్లు హ‌రీష్ రావు వ‌ద్ద మొర‌పెట్టుకున్న‌ట్టు స‌మాచారం.

ఆ ప్ర‌క‌ట‌న వెనుకు వ్యూహం ఏంటి..!
ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సీనియ‌ర్ల ఒత్తిడి మేర‌కు పార్టీపై ప‌ట్టుకోసం హ‌రీష్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 19న జ‌ర‌గాల్సిన బీఆర్ఎస్ కార్య‌వ‌ర్గ‌, ఎల్పీ స‌మావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్టు హ‌రీష్ రావు నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డం ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది. కార‌ణాలు ఏవైనా కూడా స‌హ‌జంగా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు అన్నీ తెలంగాణ భ‌వ‌న్ నుంచి విడుద‌ల అయ్యేవ‌ని, అయితే హ‌రీష్ రావు నుంచి విడుద‌ల కావ‌డం బీఆర్ఎస్‌లో రాబోయే రోజుల్లో జ‌ర‌గ‌బోయే కీల‌క రాజ‌కీయ ప‌రిణామాల‌కు నాంది ప‌లికింద‌ని కొంద‌రు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవీ చదవండి: Fake Voters : ఆ వ్య‌క్తి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త.. న‌కిలీ ఓట్ల విష‌యంలో మ‌రోసారి దొరికిపోయిన కేటీఆర్‌
KTR : సానుభూతి ఆధారంగా ఓటు వేయ‌వ‌ద్దు – కేటీఆర్ పాత వీడియో వైర‌ల్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు