HomeAgricultureHorticulture : ఉద్యాన పంటలే ఊతం.. 15 జిల్లాల నుంచి 80 శాతం జీవీఏ

Horticulture : ఉద్యాన పంటలే ఊతం.. 15 జిల్లాల నుంచి 80 శాతం జీవీఏ

Horticulture : రాష్ట్ర ఆర్థిక వృద్దికి వ్య‌వ‌సాయ రంగంలో ప్ర‌ధానంగా ఉధ్యాన‌వ‌న పంట‌లే ఊత‌మిస్తున్నాయ‌ని, జిల్లా క‌లెక్ట‌ర్లంద‌రూ త‌మ జిల్లాలో ఈ రంగంపైన ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ ఎక్స్ అఫిషియో స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ బుడితి రాజ‌శేఖ‌ర్ సూచించారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఇవాళ ఆయ‌న మాట్లాడుతూ వ్య‌వ‌సాయ‌రంగంలో సాధించాల్సిన ల‌క్ష్యాల గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు.

ఈ ఆర్థిక సంవ‌త్స‌రం వ్య‌వ‌సాయ‌రంగంలో 16.47 శాతం వృద్ది రేటుతో సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు. రూ.6,02,728 కోట్ల‌తో 35.19 శాతం స్థూల విలువ జోడింపు (గ్రాస్ వాల్యూ యాడెడ్ -జీవీఏ) ల‌క్ష్య‌మ‌న్నారు. ఈ దిశ‌గా జిల్లా క‌లెక్ట‌ర్లు దృష్టి సారించాల‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైత‌న్నా మీకోసం కార్య‌క్ర‌మాన్ని నిర్మాణాత్మ‌కంగా చేప‌ట్టామ‌న్నారు.

దీని ద్వారా ప్ర‌తి రైతు సేవా కేంద్రం ప‌రిధిలో జీవీఏ సాధించ‌డానికి చేప‌ట్టాల్సిన ప్ర‌ణాళిక‌ను క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టామ‌న్నారు. దీనిద్వారా స‌త్ఫ‌లితాలు సాధించ‌బోతున్నామ‌న్నారు. ఆయా ప్రాంతంలో జీవీఏకి ఊత‌మిచ్చే పంట‌లేవి, వాటిని సాధించ‌డానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు ఏంటీ అనేది కూడా విపులంగా రూపొందించామ‌న్నారు. ఒకేసారి మూడు సీజ‌న్ల‌కు సంబంధించి ఈ ర‌బీ సీజ‌న్ రేపు రాబోయే ఖ‌రీఫ్, ర‌బీ సీజ‌న్ల‌కు సంబంధించి కూడా ప్ర‌ణాళిక సిద్ధం చేశామ‌న్నారు.

ప్రాథ‌మిక‌రంగమైన వ్య‌వ‌సాయ రంగంలో ఐదు ఉప రంగాలున్నాయ‌ని, వాటిలో ఉధ్యాన‌వ‌న రంగం నుంచే జీవీఏ ఎక్కువ‌గా వ‌స్తోంద‌న్నారు. 16 శాతం వృద్ది రేటు ఈ రంగం నుంచి సాధించాల‌నేది ల‌క్ష్య‌మ‌న్నారు. ఉద్యాన‌వ‌న రంగం అందించే జీవీఏలోనూ 15 జిల్లాల నుంచే రూ.1,41,498 కోట్లతో 80 శాతం జీవీఏ సాధిస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో అనంత‌పురం, స‌త్య‌సాయి, క‌ర్నూలు, క‌డ‌ప‌, ఏఎస్ ఆర్ జిల్లాలు అగ్ర‌స్థానంలో ఉన్నాయ‌ని చెప్పారు. మిగిలిన 15 జిల్లాలు కూడా జీవీఏ వృద్ధి సాధ‌న‌లో పురోగ‌తి సాధించే దిశ‌గా ప‌నిచేయాల‌న్నారు.

22 పంట‌ల నుంచే అత్య‌ధిక జీవీఏ
ఉద్యాన‌వ‌న రంగంలో 22 ర‌కాల ప్ర‌ధాన పంట‌ల నుంచే అత్య‌ధికంగా జీవీఏ వ‌స్తోంద‌ని తెలిపారు. వీటిలో అర‌టి, మిర‌ప‌, మామిడి, మ‌ల్లి, ట‌మాటాల అగ్ర‌స్థానంలో ఉన్నాయ‌ని తెలిపారు. ఒక్క అర‌టి పంట రూ.31,656 కోట్ల‌తో 17.84 శాతం జీవీఏ అందిస్తోంద‌న్నారు. త‌ర్వాత ఎండుమిర్చి రూ.22,474 కోట్ల‌తో 12.67 శాతం, మామిడి రూ.14,641 కోట్ల‌తో 8.25 శాతం, మ‌ల్లె 10,749 కోట్ల‌తో 6.06 శాతం, ట‌మాట రూ.9,573 కోట్ల‌తో 5.4 శాతం జీవీఏ సాధిస్తున్నాయ‌ని చెప్పారు.

మ‌ల్లెపూల సాగు ద్వారా కూడా రాష్ట్రం జీవీఏ గ‌ణ‌నీయంగా సాధిస్తోంద‌ని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈ పూల సాగు ఎక్కువ‌గా ఉంద‌ని, గుండుమ‌ల్లె మ‌న రాష్ట్ర పుష్ప‌మ‌ని, ఈ సాగును కూడా ఆయా జిల్లాల్లో ప్రోత్స‌హించ‌డం ద్వారా అధిక జీవీఏ సాధించ‌వ‌చ్చ‌న్నారు. అలాగే మామిడి రైతుల‌కు మామిడి క‌వ‌ర్లు అందించి, నాణ్య‌త బాగుండేలా రైతుల‌ను ప్రోత్స‌హిస్తే ఇందులో మ‌రింత ఎక్కువ జీవీఏ సాధించ‌వ‌చ్చ‌న్నారు.

ప్రాథ‌మిక రంగంలో జీవీఏ వృద్ధి ల‌క్ష్యాలు సాధించ‌డానికి 6 వ్యూహాత్మ‌క సాధ‌నాలు (స్ట్రాట‌జిక్ లీవ‌ర్స్ ) రూపొందించామ‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లు త‌మ త‌మ జిల్లాలో ఈ రంగంలో ఎక్క‌డెక్క‌డున్నాము, ఎక్క‌డ వెనుక‌బ‌డ్డాము అనేది ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకుని, జీవీఏ వృద్ధి ల‌క్ష్యాలు సాధించాల‌న్నారు. పాలు, మాంసం, గుడ్డు ఉత్ప‌త్తిలో కూడా జిల్లాలు గ‌ణ‌నీయ‌మైన వృద్ది సాధించాల‌ని దానికి త‌గ్గ‌ట్లు వ్యూహాత్మ‌కంగా ప‌నిచేయాల‌న్నారు.

ఇవీ చదవండి: Chandrababu Naidu : ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 17.11 శాతం జీఎస్డీపీ వృద్ధి లక్ష్యం
YS Jagan : చంద్రబాబూ.. ఇకనైనా రైతులను పట్టించుకోండి: వైఎస్ జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు