HomeBusinessLionel Messi: ఇదేందయ్యా ఇదీ.. మెస్సీ ఎడమ కాలుకు రూ.7,600 కోట్ల బీమానా? ఇండియాలో మ్యాచ్...

Lionel Messi: ఇదేందయ్యా ఇదీ.. మెస్సీ ఎడమ కాలుకు రూ.7,600 కోట్ల బీమానా? ఇండియాలో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం!

Lionel Messi: లియోనెల్ మెస్సీ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. అలాంటి దిగ్గజం భారత్‌కు వస్తున్నాడంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ముఖ్యంగా అతను మైదానంలో అడుగుపెట్టి ఆడటం చూడాలన్నది కోట్లాది మంది కల. కానీ ఈసారి ఆ కోరిక నెరవేరలేదు. దీనికి కారణం వయస్సు గానీ, అలసట గానీ కాదు… అతని అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీ.

భారత్‌లో మ్యాచ్‌లు లేవు

లియోనెల్ మెస్సీ ఇటీవల మూడు రోజుల ప్రత్యేక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చాడు. ‘GOAT టూర్’లో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో సందడి చేశాడు. ఈ పర్యటన పూర్తిగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు, అభిమానుల సమావేశాలుకే పరిమితమైంది. ఈ సమయంలో మెస్సీ ఎలాంటి అధికారిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడలేదు. అభిమానుల ముందు కాసేపు బంతిని తన్నిన దృశ్యాలు కనిపించినా, పూర్తి మ్యాచ్ మాత్రం ఆడలేదు.

అభిమానుల ఆశలు ఆవిరి

భారతదేశంలో మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడని లక్షలాది మంది ఆశించారు. అయితే ప్రస్తుత షెడ్యూల్‌లో క్లబ్ మ్యాచ్‌లు లేదా అంతర్జాతీయ టోర్నీలు లేనందున, ఈ పర్యటనలో 38 ఏళ్ల మెస్సీ మైదానంలో కనిపించలేదు.

అసలు కారణం – ఖరీదైన బీమా

మీడియా కథనాల ప్రకారం, మెస్సీకి ప్రపంచంలోనే అత్యంత విలువైన అథ్లెట్ బీమా పాలసీల్లో ఒకటి ఉంది. అతని ఎడమ కాలుకు దాదాపు 900 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.7,600 కోట్లు బీమా చేయబడి ఉన్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తానికి బీమా ఉండటంతో, అధికారిక మ్యాచ్‌లు కాకుండా ఇతర పోటీల్లో ఆడటం అతనికి నిషేధం.

ఈ బీమా ఎందుకు అవసరం?

మెస్సీ కెరీర్‌కు ముప్పుగా మారే గాయాల నుంచి రక్షణ పొందేందుకే ఈ బీమా. పాలసీ నిబంధనల ప్రకారం అతను అర్జెంటీనా జాతీయ జట్టు లేదా తన క్లబ్ ఇంటర్ మయామి తరపున మాత్రమే ఆడాలి. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు లేదా అనధికారిక పోటీల్లో పాల్గొంటే, బీమా చెల్లుబాటు కాకపోవచ్చు. ఒకవేళ అలాంటి మ్యాచ్‌లో గాయమైతే, అతనికి ఇన్సూరెన్స్ పరిహారం రాదు. ఇది అతని కెరీర్‌తో పాటు ఆర్థిక ఒప్పందాలకు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రిస్క్ తీసుకోవడానికే మెస్సీ సిద్ధంగా లేడని తెలుస్తోంది.

ఎగ్జిబిషన్ మ్యాచ్‌లకు నో

సాధారణంగా బీమా పాలసీలు స్నేహపూర్వక లేదా ప్రదర్శన మ్యాచ్‌లను కవర్ చేయవు. అలాంటి మ్యాచ్‌లో గాయం జరిగితే, లక్షలాది డాలర్ల పరిహారం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే భారత్‌లో జరుగుతున్న ఈ పర్యటనలో మెస్సీ మ్యాచ్‌లు ఆడే రిస్క్ తీసుకోలేదని నివేదికలు చెబుతున్నాయి.

మైఖేల్ జోర్డాన్ ఒప్పందం వేరు

బాస్కెట్‌బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ ఒప్పందంలో ‘Love of the Game’ అనే ప్రత్యేక క్లాజ్ ఉండేది. ఈ నిబంధన అతనికి జట్టు అనుమతి లేకుండా కూడా ఎక్కడైనా ఆడే స్వేచ్ఛను ఇచ్చేది. గాయమైతే పూర్తి బీమా కూడా వర్తించేది. అయితే మెస్సీ బీమా పాలసీ అలాంటిది కాదు.

మ్యాచ్‌లు లేవు… కానీ జ్ఞాపకాలు మిగిలాయి

మెస్సీ భారత్‌లో ఫుట్‌బాల్ ఆడకపోయినా, అతని ఉనికే అభిమానులకు ఓ గొప్ప అనుభూతి. ఈసారి మైదానంలో అతని మ్యాజిక్ చూడలేకపోయినా, అతనితో గడిపిన క్షణాలు, ఫోటోలు, మీట్-అండ్-గ్రీట్ జ్ఞాపకాలు మాత్రం అభిమానుల మనసుల్లో చాలా కాలం నిలిచిపోతాయి.

ఇవీ చదవండి: Messi Tour: హైదరాబాద్‌లో మెస్సీ మ్యానియా.. ఫోటోకు లక్షల ఖర్చు!
Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్..! న్యూఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు