HomeNationalWatch Video: సభలో లేడీ డాక్టర్‌ హిజాబ్‌ లాగిన సీఎం నితీశ్‌ కుమార్‌.. వీడియో వైరల్,...

Watch Video: సభలో లేడీ డాక్టర్‌ హిజాబ్‌ లాగిన సీఎం నితీశ్‌ కుమార్‌.. వీడియో వైరల్, రాజకీయ దుమారం

Watch Video: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉన్నప్పటికీ, ఆయన ప్రవర్తనపై తరచూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ బహిరంగ కార్యక్రమంలో మహిళా డాక్టర్‌తో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాట్నాలోని సీఎం నివాసంలో కొత్తగా ఎంపికైన ఆయుష్‌ వైద్యులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్టిఫికెట్‌ తీసుకునేందుకు వచ్చిన ఓ ముస్లిం మహిళా డాక్టర్‌ వద్దకు వెళ్లిన సీఎం నితీశ్‌కుమార్‌, ఆమె హిజాబ్‌ను కిందకు లాగినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన అక్కడే ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ సమయంలో డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా, సీఎం మాత్రం ఆపుకోలేదని వీడియోలో కనిపిస్తోంది. మహిళా డాక్టర్‌ ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా నిశ్చేష్టంగా నిలబడిపోయింది. అదే వేదికపై ఉన్న కొందరు నవ్వుతున్నట్లు కనిపించడం మరో చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ నేతలు నితీశ్‌కుమార్‌ ప్రవర్తనను ఖండిస్తూ, ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌ కూడా వినిపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి ప్రవర్తనకు పాల్పడడం సమంజసం కాదని విమర్శించింది. రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవం అంశాన్ని ముందుకు తెస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది ప్రతిపక్షాలు.

ఈ ఘటనతో జేడీయూ నేతలు, కార్యకర్తలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు విపక్షాల విమర్శలు, మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు పార్టీకి తలనొప్పిగా మారాయి. 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా మరింత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు పాలనతో పాటు ప్రజల్లో మంచి ఆదరణ పొందిన నితీశ్‌ కుమార్‌ ఇప్పుడు తరచూ వివాదాల్లో నిలుస్తుండటం బిహార్‌ రాజకీయాల్లో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ తాజా ఘటనపై సీఎం కార్యాలయం నుంచి స్పష్టమైన వివరణ వస్తుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది.

ఇవీ చదవండి: Bihar Election Result : బిహార్‌లో సుపరిపాలనకు పట్టం: ఎన్డీయే ఘన విజయం
Bihar Election 2025 : బిహార్‌ ఎన్డీఏలో సీట్ల గందరగోళం.. కూటమి పార్టీల్లో కుమ్ములాట!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు