HomeTelanganaHyderabad: హైదరాబాదీలకు అలర్ట్..! న్యూఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్..! న్యూఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

Hyderabad: న్యూ ఇయర్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చే నగరం హైదరాబాద్‌. ప్రతి ఏడాది డిసెంబర్‌ 31 రాత్రి నుంచి నగరం మొత్తం వేడుకలతో సందడిగా మారుతుంది. యువత, కుటుంబాలు, స్నేహితులు కొత్త ఏడాదిని ఘనంగా స్వాగతించేందుకు పెద్ద ఎత్తున బయటకు వస్తుంటారు. అయితే ఈ ఉత్సాహంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈసారి మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ పరిధిలో న్యూఇయర్ వేడుకల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. స్టార్‌ హోటల్స్‌, పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్ నిర్వాహకులు తప్పనిసరిగా 15 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే అర్ధరాత్రి 1 గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.

న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలపై ప్రత్యేక నిఘా ఉండాలని సూచించారు. అశ్లీలతకు తావు లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇండోర్‌లో మాత్రం తక్కువ శబ్దంతో అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. పార్టీల్లో బాణసంచా వినియోగంపై పూర్తిగా నిషేధం విధించారు. కెపాసిటీకి మించి పాస్‌లు, టికెట్లు లేదా కూపన్లు ఇవ్వకూడదని హెచ్చరించారు.

ముఖ్యంగా డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మైనర్‌లకు ప్రవేశం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎక్సైజ్‌, నార్కోటిక్స్‌, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నారు. అత్యాధునిక డ్రగ్స్ టెస్టింగ్ పరికరాలు, డాగ్ స్క్వాడ్‌లతో అనుమానితులపై నిఘా పెంచనున్నారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నందున మద్యం సేవించిన వారు తప్పనిసరిగా డ్రైవర్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మొత్తంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో, చట్టాలను గౌరవిస్తూ న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి: Messi Tour: హైదరాబాద్‌లో మెస్సీ మ్యానియా.. ఫోటోకు లక్షల ఖర్చు!
Gold Rate Today: తిరిగి రెట్టించిన వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు – హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు