Chicken : బరువు తగ్గాలనే లక్ష్యంతో అతిగా కఠినమైన ఆహార నియమాలు పాటించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఆరు నెలల పాటు కేవలం ఉడికించిన చికెన్ బ్రెస్ట్, కొన్ని కూరగాయలకే పరిమితమైన డైట్‌ను అనుసరించిన 25 ఏళ్ల చైనా యువతి తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి అంతటి తీవ్రంగా ఉండటంతో ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడింది.
సోషల్ మీడియాలో తన డైట్ ప్రయాణాన్ని నిత్యం షేర్ చేస్తూ వచ్చిన ఈ యువతిని ఆమె అనుచరులు “Goddess of Self-Discipline” అంటూ ప్రశంసించేవారు. అయితే ఆ కఠిన నియమాలే చివరకు ఆమె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయి.
అతిగా నియంత్రిత ఆహారం.. ప్రమాదానికి ఆహ్వానం
షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన ఈ యువతి ఆరు నెలల పాటు చికెన్‌తో పాటు ఉడికించిన కాలీఫ్లవర్ మాత్రమే తినేది. కొన్నిసార్లు చిన్న బంగాళాదుంప ముక్కలను మాత్రమే తీసుకునేది. అన్ని రకాల కొవ్వులు, కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేసింది.
నీరసం, అలసట, శరీర బలహీనత వంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆమె తన డైట్‌ను ఆపలేదు. కొద్ది రోజుల తర్వాత తీవ్ర కడుపు నొప్పి మొదలవడంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షల అనంతరం వైద్యులు ఆమెకు తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ఉన్నట్లు నిర్ధారించారు.
క్లోమం దెబ్బతిని ప్రాణాంతక స్థితి
ది స్టార్ నివేదిక ప్రకారం.. ఈ పరిస్థితిలో జీర్ణ ఎంజైమ్‌లు క్లోమంలోనే పేరుకుపోయి ఆ అవయవాన్ని క్రమంగా జీర్ణం చేయడం ప్రారంభిస్తాయి. ఈ యువతి సీరం అమైలేస్ స్థాయి సాధారణం కంటే కనీసం పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫలితంగా ఆమె క్లోమంలో పెద్ద భాగం నెక్రోటైజ్ అయ్యింది. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అసలు కారణం ఏమిటి?
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాణాంతక పరిస్థితికి ప్రధాన కారణం ఆమె దీర్ఘకాలంగా పాటించిన అతి తక్కువ కేలరీలు, కొవ్వులేని, చప్పగా ఉండే ఆహారం. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతిని క్లోమానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
బరువు తగ్గాలంటే కేలరీల లోటు అవసరమే అయినా, అన్ని పోషకాలు ఉండే సమతుల్య ఆహారం తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటి?
ప్యాంక్రియాటైటిస్ అనేది క్లోమంలో ఏర్పడే వాపు. క్లోమం జీర్ణ ఎంజైమ్‌లు, రక్తంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేసే ముఖ్యమైన అవయవం. ఈ వ్యాధి వల్ల వచ్చే కడుపు నొప్పి చాలా తీవ్రమై వెన్ను వరకు వ్యాపించవచ్చు. ముఖ్యంగా తిన్న తర్వాత నొప్పి ఎక్కువగా ఉంటుంది.
ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు ఇవే
తీవ్రమైన కడుపు నొప్పి
వికారం, వాంతులు
వేగవంతమైన హృదయ స్పందన
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
అధిక జ్వరం
తిన్న తర్వాత అజీర్ణం, నొప్పి
ఆకలి తగ్గడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం
కొవ్వుతో కూడిన మలం
తక్కువ రక్తపోటుతో తల తిరగడం
తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ప్రాణాంతక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొవ్వులు, కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయడం కాకుండా, అన్ని పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Diabetes : మధుమేహం ఉన్నవారు చికెన్ తినవచ్చా?
Chicken vs Fish : చికెన్ వర్సెస్ చేపలు: ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది బలవర్ధక ఆహారం?
