AP GSDP : రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)పై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రజెంటేషన్, ఇతర వివరాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేశారు. ప్రజల్ని మోసం చేయడానికి జీఎస్డీపీ అంకెలు తయారు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇంగ్లీష్ ట్వీట్ తెలుగు అనువాదం ఇదీ…
‘‘నిన్న చంద్రబాబునాయుడుగారు, టీడీపీ కూటమి ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ భాగానికి సంబంధించిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ప్రాథమిక అంచనాలను విడుదల చేసింది. చంద్రబాబుగారి డైరెక్షన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఈ అంకెలను తయారు చేసినట్టుగా చంద్రబాబుగారు చెప్పకనే చెప్పారు. ప్రాథమిక అంచనాల గణాంకాలను ప్రభుత్వం తయారు చేయగలుగుతుంది. అలాగే కావాలనుకుంటే వక్రీకరించగలుగుతుంది కూడా. కానీ, దేశంలోనే రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన కాగ్ (CAG), రాష్ట్ర ఖాతాలను ఆడిట్ చేసి వెల్లడించే గణాంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా వక్రీకరించ లేరు.
రాష్ట్ర ఖాతాలను పరిశీలించి `కాగ్` విడుదల చేసిన గణాంకాల ద్వారానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏంటో తెలుస్తుంది. `కాగ్` వెల్లడించే గణాంకాలు చంద్రబాబుగారి సలహా ప్రకారమో లేక ఆయన మార్గనిర్దేశంలోనూ తయారైనవి కావు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిజమైన ఆదాయాలు, చేసిన వాస్తవ ఖర్చుల ఆధారంగా ఈ సమగ్ర గణాంకాలు వెల్లడవుతాయి.
ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో `కాగ్` విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏమిటంటే…
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది.
రాష్ట్ర ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది
చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి
మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది
మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి
రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి.
భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండి పడుతోంది.
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా, అబ్రహం లింకన్ గారి మాటలు గుర్తు చేయాల్సి వస్తోంది. ‘‘కొంతకాలం పాటు ప్రజలను మభ్య పెట్టగలవు, ఎల్లకాలం ప్రజలందరినీ మభ్య పెట్టలేవు’’ అంటూ లింకన్ గారు అన్న మాటలు ఇప్పుడు చంద్రబాబుగారికి సరిపోతాయి.
నేను అడిగే ఈ ప్రశ్నలకు చంద్రబాబునాయుడుగారు సమాధానం చెప్పగలరా?.
నిజంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది?
2014–19 మధ్య అప్పటి మీ పాలనలో GSDP వృద్ధి అంత గొప్పదైతే, దేశ GDP లో రాష్ట్రం వాటా 4.45%కి మాత్రమే ఎందుకు పరిమితమైంది.
వైయస్ఆర్సీపీకి ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి ద్వారా రెండేళ్ల పాటు సంక్షోభం తలెత్తినా సరే వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో దేశ GDP లో రాష్ట్రం వాటా (2019–24) మధ్య 4.78%గా ఉన్న మాట వాస్తవం కాదా?
మీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బాగా నడిచినట్లయితే, తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ర్యాంకు ఒక్క మెట్టైనా ఎందుకు పెరగలేదు?
చంద్రబాబునాయుడుగారి వాస్తవిక సమర్థత గురించి, అలాగే 2019–24 వైయస్ఆర్సీపీ పాలనలో జరిగిన వాస్తవ ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ఆయన అబద్ధాలను బట్టబయలు చేస్తూ ఈ ట్వీట్ కు స్లైడ్‌లను జత చేశాం. వీటిని అందరూ ఓసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
2014–19 కాలానికి చెందిన GSDP యొక్క CAGR ను, 2019–24 కాలానికి చెందిన CAGR తో పోల్చి, తాను 2019–24లో అధికారంలో కొనసాగి ఉంటే 2023–24లో రాష్ట్ర GSDP వృద్ధి రేటు 13.5% అయ్యేదంటూ చంద్రబాబుగారు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.
2019–24 కాలంలో ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి కారణంగా అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాన్ని, అలాగే దాని నుంచి కోలుకోవడంలో కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో, తాను అధికారంలో ఉంటే 13.5% వృద్ధి సాధించేవాడినని చంద్రబాబు చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
CAGR (Compounded Annual Growth Rate) అనేది మొదటి సంవత్సరం మరియు చివరి సంవత్సరాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు.
కానీ, ప్రతి సంవత్సరానికీ గణాంకాలను విడివిడిగా విశ్లేషిస్తేనే సంపూర్ణమైన మరియు నిజమైన పోలిక సాధ్యమవుతుంది. ఆ వివరాలను ఒక్కసారి చూస్తే…
2014–19 కాలంలో దేశ GDPలో చేసిన రాష్ట్రం వాటా 4.54% మాత్రమే.
అదే 2019–24 కాలంలో ఇది 4.78%.
ఇది మాత్రమే కాదు —
అత్యంత తీవ్రమైన సంక్షోభ సంవత్సరాలైన 2020–21 మరియు 2021–22లో దేశ GDPలో రాష్ట్రం వాటా వరుసగా 4.93% మరియు 4.79%.
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా తీసుకు వచ్చిన విధానాలు, అదే విధంగా అభివృద్ధి మీద పెట్టిన దృష్టి కారణంగా కోవిడ్ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ఇంత స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అత్యంత దారుణమైన పనితీరును చంద్రబాబు ప్రదర్శించినప్పటికీ, తాను ఇంకా మెరుగ్గా పనిచేసే వాడిని అని ఆయన ఎలా చెప్పగలరు?
టీడీపీ కూటమి ప్రభుత్వం వెల్లడించిన అంచనాల ప్రకారం, 2024–25 తొలి అర్ధభాగంలో రాష్ట్ర GSDP వృద్ధి రేటు 9.89%, అలాగే 2025–26 తొలి అర్ధభాగంలో 10.91% అని పేర్కొంది.
ఈ రెండు సంవత్సరాల మొత్తాన్ని కలిపి చూస్తే GSDP CAGR 10.40% మాత్రమే కనిపిస్తోంది.
సహజంగానే, ఈ స్థాయి GSDP వృద్ధితో పాటు రాష్ట్ర స్వంత ఆదాయాలు కూడా కనీసం 10% CAGR తో పెరగాలి.
కానీ, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది, అంతేకాదు ఇంకా నిరాశాజనకంగా ఉంది.
• రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని ప్రతిబింబించే SGST ఆదాయాల CAGR 4.35% మాత్రమే పెరిగాయి
• సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు CAGR మైనస్ (-)2.80% గా తగ్గిపోయాయి
• మొత్తంగా చూస్తే, రాష్ట్ర స్వంత ఆదాయాల CAGR కేవలం 2.58% మాత్రమే
కొత్త ప్రభుత్వం మద్యం విధానంలో పెద్ద పెద్ద మార్పులు చేసినప్పటికీ, మద్యం రిటైల్‌ను ప్రైవేటీకరించడం, షాపులు పెంచడం, విక్రయ వేళలపై పరిమితులను ఎత్తివేయడం, బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్‌లను తిరిగి అనుమతించడం.. తదితర తీవ్ర మార్పుల తర్వాత కూడా ఎక్సైజ్ సుంకం CAGR కేవలం 5.10% మాత్రమే పెరిగింది. లిక్కర్ వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతుందనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్ర ఆదాయాల CAGR ఎక్కడా 10% దగ్గర కూడా లేదు. అది కేవలం 2.58% మాత్రమే ఉంది.
అన్నిటికంటే ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం (Capital Expenditure) భయంకరంగా పడిపోయి CAGR మైనస్ ( – ) 16% గా నమోదైంది.
నిజమైన వృద్ధి కనిపించిన ఏకైక అంశం
కేంద్ర పన్నులలో రాష్ట్రానికి లభించిన వాటా, అది కూడా CAGR 17.78%. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరుకు సంబంధించినది, రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సంబంధించింది కాదు.
కాని, దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే… కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, జీడీపీ పెరుగుదల కూడా సమానంగా ఉన్నాయి.
విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాస్తవాలకు ఇది పూర్తి విరుద్ధం.
FPPCA (Fuel and Power Purchase Cost Adjustment) పేరుతో, చంద్రబాబుగారి ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలపై ₹18,272 కోట్లు భారం వేసింది.
గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలపై సెక్యూరిటీ సృష్టించింది, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టింది అని చంద్రబాబుగారు ఆరోపిస్తున్నారు.
సరే గత ప్రభుత్వం ₹25,000 కోట్ల రుణం కోసం ₹1,941 కోట్ల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టింది.
కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ₹9,000 కోట్ల బాండ్‌ల విడుదల కోసం ₹1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను సెక్యూరిటీగా పెట్టింది. భవిష్యత్తు ఆదాయాలనూ అప్పులకోసం పణంగా పెట్టింది.
ఇంకా, రాష్ట్ర సంచిత నిధి (Consolidated Fund of the State) మీద బాండ్ హోల్డర్లకు యాక్సెస్ రైట్ ఇచ్చింది—
ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని, అత్యంత ప్రమాదకరమైన చర్య.
చంద్రబాబు గారు, వైయస్ఆర్సీపీ పాలనలో విద్యుత్ రంగం దెబ్బతింది అని ఆరోపిస్తున్నారు.
కానీ, నిజాలు మాత్రం ఆయన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
• టీడీపీ పాలనలో (2014–19) విద్యుత్ రంగపు అప్పులు CAGR 23.88%
• వైయస్ఆర్సీపీ పాలనలో (2019–24) ఆ అప్పుల పెరుగుదల CAGR 7.28% మాత్రమే.
అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించిందని వెల్లడవుతోంది.
చంద్రబాబు గారు, వైయస్ఆర్సీపీ పాలనలో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టారని చేసిన ఆరోపణ కూడా పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన తయారు చేసిన అబద్ధమే.
MOSPI విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల GSVA వృద్ధి (2019–24) CAGR 11.14%
అదే కాలంలో భారతదేశ పరిశ్రమల GVA వృద్ధి CAGR 8.96%. అంటే రాష్ట్ర పరిశ్రమల రంగం దేశ సగటు కంటే చాలా మెరుగ్గా ప్రదర్శించింది.
ఇలాంటి స్పష్టమైన విజయాలున్నప్పటికీ,
పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచిపెట్టారు అని చంద్రబాబు గారు ఎలా అంటారు?
అది నిజానికి అసత్య ఆరోపణ, ప్రజలను మభ్యపెట్టే ప్రచారం మాత్రమే.’’ అని వైఎస్ జగన్ తన ట్వీట్లో స్పష్టీకరించారు.
ఇవీ చదవండి: Jagan Pressmeet : వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. రైతులు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, లడ్డూ, పరకామణి, చంద్రబాబు కేసులు..
YS Jagan PC : రేపు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై క్లారిటీ!
YS Jagan : చంద్రబాబూ.. ఇకనైనా రైతులను పట్టించుకోండి: వైఎస్ జగన్
